ASBL NSL Infratech

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌ 7న

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌ 7న

తెలంగాణ శాసనసభకు డిసెంబర్‌ 7న ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని, 11న కౌంటింగ్‌ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున ఓటర్ల జాబితా ప్రకటనకు సమయం పడుతుందన్నారు. వాస్తవానికి అక్టోబర్‌ 8వ తేదీనే తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉండగా.. ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు నడుస్తున్నందున ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఈ పరితెలంగాణలో ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టు తీర్పునకు వీలుగా మార్పులు చేయడానికి సమయం ఉన్నందునే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించామని సిఇసి ఒపి రావత్‌ చెప్పారు.

తెలంగాణలో పర్యటించకుండా, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా షెడ్యూల్‌ ఎలా ప్రకటిస్తారని అన్న ప్రశ్నపై రావత్‌ స్పందిస్తూ తుదిజాబితాను పరిశీలిస్తామని హైకోర్టు చెప్పినందున, జాబితాను మార్చడానికి వీలుగా వ్యవధిని కూడా పెంచామని చెప్పారు. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా కొత్త ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 12న విడుదల చేస్తామని రావత్‌ తెలిపారు. అయితే ముందుగా హైకోర్టుకు సమర్పించిన తర్వాతే ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందన్నారు.

తెలంగాణలో పోలింగ్‌ క్రమం ఇలా..

తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119
నోటిఫికేషన్‌ విడుదల: నవంబర్‌ 12
నామినేషన్ల ప్రారంభం: నవంబర్‌ 12
నామినేషన్లకు చివరి తేదీ: నవంబర్‌ 19
నామినేషన్ల పరిశీలన: నవంబర్‌ 20న
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 22
డిసెంబర్‌ 7న పోలింగ్‌
డిసెంబర్‌ 11న ఎన్నికల ఫలితాలు

 

Tags :