ASBL NSL Infratech

తానా టీమ్‌ 2023-25 

తానా టీమ్‌ 2023-25 

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగుసంఘం నూతన అధ్యక్షునిగా నిరంజన్‌ శృంగవరపు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2023`25 సంవత్సరానికి గాను తానా అధ్యక్షునిగా ఆయన వ్యవహరిస్తారు. తన రెండేళ్ళ పదవీకాలంలో తానా టీమ్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో తానా సేవలను మరింత విస్తృతపరుస్తానని నిరంజన్‌ శృంగవరపు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని రాజానగరంకు చెందిన నిరంజన్‌ శృంగవరపు తానాలో అంచెలంచెలుగా ఎదిగారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఆయన ఫౌండేషన్‌ ద్వారా కోట్లాదిరూపాయలతో నిత్యావసర సరుకులను ఇతర సహాయ కార్యక్రమాలను ఆయన అందించారు. తానాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనుభవంతో తానా అధ్యక్షునిగా మరింతగా తెలుగురాష్ట్రాల్లోని వారితోపాటు దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి కూడా తానా ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వైస్‌ ప్రెసిడెంట్‌గా నరేన్‌ కొడాలి ఎన్నికయ్యారు. తానాలో వివిధ పదవులను నిర్వహించిన నరేన్‌ కొడాలి ఈసారి వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికోసం ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికలు రద్దు కావడంతో ఏకగ్రీవంగా చేసిన ఎంపికలో నరేన్‌ కొడాలి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 2003 నుంచి  తానాలో ఆయన వివిధ పదవులను నిర్వహించారు.  2003లో వెబ్‌ అండ్‌ ఐటీ సపోర్ట్‌ కోచైర్‌గా ప్రారంభించిన తానా ప్రయాణం 2019లో వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన తానా 22వ మహాసభల ఛైర్మన్‌గా, అలాగే 2021 వరకు తానా బిల్డింగ్‌ కమిటీ కోచైర్‌ గా ఉన్న నరేన్‌ కొడాలి తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికోసం 2021లో జరిగిన ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో తిరిగి 2023 ఎన్నికలలోనూ తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేసి అడుగు ముందుకే వేశారు.  సంయమనం కోల్పోకుండా, విధేయత, విశ్వసనీయత మరియు ప్రభావవంతమైన సేవ అంటూ తన క్యాంపెయిన్‌ తను చేసుకుంటూ తన ప్యానెల్‌ సభ్యులను కూడా ఉత్సాహపరిచారు. 2023-25కి తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా అలాగే 2025-27 గోల్డెన్‌ జూబిలీకి తానా అధ్యక్షులుగా నరేన్‌ కోడాలి సేవలందించనున్నారు. 

2023-25కు సంవత్సరానికి తానా కార్యదర్శిగా నియమితులైన కొల్లా అశోక్‌ తానాలో వివిధ పదవులు నిర్వహించారు. 2009లో తానా ప్రవాస విద్యార్థుల కమిటీ అధ్యక్షుడిగా సంస్థలో తన పయనం ప్రారంభించిన ఆయన గడిచిన 14ఏళ్లలో తానాలో పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.  ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెంకు చెందిన అశోక్‌ కార్యదర్శిగా కూడా కమ్యూనిటీకి అవసరమైన సేవలను అందిస్తానని చెబుతున్నారు.   అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థులు తానా సభ్యత్వ నమోదు రుసుము కడితే వారు చదువుకుని ఉద్యోగవకాశం దొరికేవరకు వారికి తానా ద్వారా ఆరోగ్య బీమా కల్పించడం తన లక్ష్యమన్నారు. తద్వారా తానా సభ్యత్వం బలోపేతం కావడంతో పాటు విద్యార్థులకు తానాను దగ్గర చేయవచ్చునని, ఇది బహు విధాల ప్రయోజనకారి అని ఆయన పేర్కొంటున్నారు. 

తానా ట్రెజరర్‌గా కృష్ణాజిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఎన్నికయ్యారు.  తానాలో కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వంటి పదవులను ఆయన కృష్ణాజిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో జన్మించిన రాజా కసుకుర్తి ఉన్నత విద్యాభ్యాసంకోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించారు. అమెరికాలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్‌గా తెలుగు స్టూడెంట్లకు ఉపయోగపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గత డిసెంబర్‌, జనవరి నెలలో తానా చైతన్యస్రవంతి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉచిత కంటి చికిత్స, విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ లు, వృద్ధులకు రగ్గులు, రైతులకు అవసరమైన పరికరాలను ఆయన అందించారు. తానా ట్రెజరర్‌గా తానా నిధుల వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తానని, తెలుగు రాష్ట్రాల్లోని మనవాళ్ళకు అవసరమైన సేవ, సహాయ కార్యక్రమాలను నిరంతరం చేస్తూనే ఉంటానని  రాజా కసుకుర్తి తెలియజేశారు. 

తానా జాయింట్‌ సెక్రటరీగా శిరీష తూనుగుంట్ల ఎన్నికయ్యారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో గుర్తింపు పొందిన శిరీష తూనుగుంట్ల తానాలో ఉమెన్స్‌ కో ఆర్డినేటర్‌గా, కల్చరల్‌ కో ఆర్డినేటర్‌గా పదవులను నిర్వహించారు. తానాలో ఉమెన్స్‌ కో ఆర్డినేటర్‌గా పని చేసినప్పుడు ఎంతోమంది మహిళలకు ఆసరాగా నిలిచి వారి హక్కులను కాపాడేందుకు కృషి చేశారు. తానాలో తెలుగు భాషకు పట్టంకట్టే కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పాల్గొనడంతోపాటు వాటి విజయానికి పాటుపడ్డారు. జాయింట్‌ సెక్రటరీగా తానా కార్యక్రమాల విజయవంతానికి మరింతగా కృషి చేస్తానని శిరీష తూనుగుంట్ల చెప్పారు.

తానా జాయింట్‌ ట్రెజరర్‌గా సునీల్‌ పంట్ర ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన సునీల్‌ పంట్ర తానాలో వివిధ పదవులను నిర్వహించి ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేశారు. తానాలో 2009 నుంచి పనిచేస్తున్న సునీల్‌ పంట్ర ఎన్నో పదవులను చేపట్టారు.  ధీంతానా సమన్వయకర్తగా, ప్రకటనల విభాగం అధ్యక్షునిగా, డెట్రాయిట్‌ తానా మహాసభల ప్రచార విభాగం నాయకునిగా, ఎలక్ట్రానిక్‌ మీడియా చైర్‌పర్సన్‌గా, డెట్రాయిట్‌ సభల మీడియా విభాగం అధ్యక్షుడిగా, తానా సాంస్కృతిక సేవల సమన్వయకర్తగా  తానా ప్రాంతీయ ఉపాధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారు.  ఇటీవల తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేసి దాదాపు వందకు పైగా కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో సమన్వయపరచడంతోపాటు తానా సేవలను, కార్యక్రమాలను ఎంతోమందికి చేరవేయడంలో విజయం సాధించి తానాకు పేరు తీసుకువచ్చారు. తానా జాయింట్‌ ట్రెజరర్‌గాఎన్నికైన తరువాత సునీల్‌ పంట్ర మాట్లాడుతూ, తానాకు నిధులు తేవడంతోపాటు, ఆర్థికపరమైన అంశాల్లో సాంకేతికతను వినియోగించడం వల్ల పారదర్శకంగా అన్ని వివరాలు అందురూ తెలుసుకునేలా చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. 

తానాలో ప్రస్తుత కార్యవర్గంలో కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌గా లోకేశ్‌ నాయుడు ఎన్నికయ్యారు. తానాలో చురుకైన యువ నాయకునిగా పేరు పొందిన లోకేష్‌ నాయుడు తానాలో వివిధ పదవులను నిర్వహించారు. స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌గా, కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ పదవులను నిర్వహించి ప్రస్తుతం కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. కమ్యూనిటీకి ఉపయోగపడే మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతోపాటు తనవంతుగా తానా ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని లోకేష్‌ నాయుడు తెలిపారు. 

న్యూజెర్సిలో తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా పనిచేసిన వంశీ వాసిరెడ్డి ప్రస్తుత కార్యవర్గంలో కల్చరల్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యారు. తానాలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన వంశీ వాసిరెడ్డి తానాలో తెలుగు కళలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తానని చెబుతున్నారు. కళాకారులను గౌరవించడంతోపాటు వారికి తానా ద్వారా సహాయాన్ని అందిస్తానని చెబుతున్నారు.

ప్రస్తుత తానా కార్యవర్గంలో కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌గా బే ఏరియాకు చెందిన రజనీకాంత్‌ కాకర్ల ఎన్నికయ్యారు. తానాలో ఆయన వివిధ విభాగాల్లో పదవులను చేపట్టారు. 2019 నుండి ఉత్తర కాలిఫోర్నియా తానా ప్రాంతీయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 2015లో తానా క్రీడల విభాగ ఉపాధ్యక్షుడిగా సంస్థలోకి ప్రవేశించిన ఆయన 2017-19 మధ్య అదే విభాగానికి అధ్యక్షుడిగా కొనసాగారు. ఎపి జన్మభూమి కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు. తానాలో తనకు లభించిన అవకాశాలతో కమ్యూనిటీకి సేవలందించినట్లుగానే కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ పదవి ద్వారా కూడా అందరికీ సేవలందిస్తానని రజనీకాంత్‌ కాకర్ల తెలిపారు.

తానా 2023-25 కార్యవర్గంలో పెనమలూరుకు చెందిన ఠాగూర్‌ మల్లినేని ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యారు. తానాలో మీడియా కో ఆర్డినేటర్‌గా పాపులర్‌ అయిన ఠాగూర్‌ మల్లినేని ఇటీవల జరిగిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో కూడా సేవలందించి తెలుగు రాష్ట్రాలవారికి కూడా బాగా పరిచయమయ్యారు. తానా ద్వారా నిర్వహించే ఎన్నో కార్యక్రమాలను ఆయన మీడియా ద్వారా తెలుగు కమ్యూనిటికీ చేరవేయడంలో విజయాన్ని సాధిం చారు. ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా ప్రపంచంలోని తెలుగు కమ్యూనిటీకి, సంఘాలకు తానా కార్యక్రమాలు తెలుసుకునేలా చేయడంతో పాటు, వారిని కూడా ఇందులో భాగస్వాములయ్యేలా కృషి చేయనున్నట్లు ఠాగూర్‌ మల్లినేని చెప్పారు.

తానా ప్రస్తుత కార్యవర్గంలో స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌గా నాగమల్లేశ్వరరావు పంచుమర్తి ఎన్నిక య్యారు. తానాలో ఆయన వివిధపదవులను నిర్వహిం చిన అనుభవం, కమ్యూనిటీ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ఉపయోగమని చెప్పే నాగమల్లేశ్వరరావు పంచుమర్తి 2017లో తానాలో అడ్‌హాక్‌ కమిటీ కో చైర్‌గా ప్రవేశించారు. తరువాత బ్యాక్‌ప్యాక్‌ కో చైర్‌గాను, అపలాచియాన్‌ ప్రాంత రీజినల్‌ కో ఆర్డినేటర్‌గాను పనిచేశారు. ప్రస్తుతం స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యారు. తానా సభ్యులకోసం వివిధ రకాల ఆటల పోటీలను వివిధ నగరాలలో నిర్వహించడం ద్వారా వారిలో మానసికోల్లాసం కలగజేయడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తానని నాగమల్లేశ్వరరావు పంచుమర్తి చెప్పారు. 
తానాలో ప్రస్తుత కార్యవర్గంలో ఉమెన్స్‌ కో ఆర్డినేటర్‌గా తానాలో వివిధ పదవులను నిర్వహించిన మాధురి డి ఎల్లూరిని ఎన్నుకున్నారు. తానా ద్వారా మహిళా సమస్యలను పరిష్కరించడంలో మాధురి ఎల్లూరి ఎంతో కృషి చేశారు. తానా ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ చైర్‌్‌గా ఆమె చేసిన ఎన్నో కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. అప్పలాచియాన్‌ ప్రాంతంలో మహిళల అభివృద్ధికి కూడా ఆమె కృషి చేశారు.  ధీమ్‌తానా కో చైర్‌గా కూడా గతంలో ఆమె పని చేశారు. తానా కార్యక్రమంలో ఎంతోమందిని పాలుపంచుకునేలా ఆమె కృషి చేశారు.

 

 

 

Tags :