ASBL NSL Infratech

బాల్యదశ నుంచే భగవద్గీత నేర్పించాలి.... డా. లక్కావఝ్జుల వేంకట గంగాధర శాస్త్రి

బాల్యదశ నుంచే భగవద్గీత నేర్పించాలి.... డా. లక్కావఝ్జుల వేంకట గంగాధర శాస్త్రి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), కార్యసిద్ధి హనుమాన్‌ టెంపుల్‌ సంయుక్తంగా ఫ్రిస్కోలో నిర్వహించిన కార్యక్రమంలో భగవద్గీత ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ గాయకుడు డా. లక్కావఝ్జుల వేంకట గంగాధర శాస్త్రి పాల్గొని భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేశారు. 

తానా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో తొలి కార్యక్రమంగా ఫ్రిస్కోలోని కార్యసిద్ధి హనుమాన్‌ ఆలయంలో నిర్వహించిన ‘‘గీతా గాన ప్రవచనం’’లో ఆయన అద్భుత ప్రసంగం చేశారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేందుకు గీతను మించిన కరదీపిక మరొకటి లేదన్నారు. వ్యక్తులకు పుట్టినరోజు చేసే సమాజంలో వేల ఏళ్ల క్రిందట పుట్టిన భగవద్గీత అనే ఓ గ్రంథానికి జన్మదిన వేడుకలు చేయగలిగిన శక్తిమంతమైన ఒకే ఒక సమాజం హైందవ సమాజమని కొనియాడారు. హిందువు అంటే సర్వజన బంధువు అని అన్నారు. ధర్మం అంటే స్వకార్యం కాదు లోకకళ్యాణం కలిగించేదని తెలిపారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ప్రతిఫలాన్ని భగవానుడి పాదాలకు వదిలేసి భవబంధాలకు అతీతంగా జీవించడమే హైందవ జీవనమని గంగాధర శాస్త్రి అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ తలపెట్టిన గీతాయజ్ఞాన్ని ప్రశంసించారు. స్థానిక చిన్నారులు గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగాన్ని రసోత్కృష్టంగా ఆలపించారు. గీత చదవగలగడం అద్భుతం, అర్థం చేసుకోవడం మహాద్భుతం, ఆచరించగలిగితే పరమాద్భుతమని వ్యాఖ్యానించారు. కూర్చోవడానికి స్థలం లేకుండా చాలా మంది శ్రీ గంగాధర శాస్త్రి గారి ప్రబోధాన్ని రెండున్నర గంటల పాటు నిలబడి విన్నారు.

‘‘బాల్యంలో పిల్లలకు భగవద్గీతను దగ్గర చేయండి..అప్పుడు అవి మనకు, మన సంస్కృతికి దూరం కావు.భగవద్గీత మనసులోని బలహీనతను తొలగించి బలాన్ని ఇస్తుంది.మనిషిని ఉన్నత స్థాయికి మారుస్తుంది.తల్లిదండ్రులు మీ విలువైన సమయాన్ని పిల్లలతో గడపండి. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఆధ్యాత్మిక విలువల ఔన్నత్యం గురించి చెప్పండి.. ఈ ఆధ్యాత్మిక పునాది లేకపోవడం, కుటుంబ వ్యవస్థలు లేకపోవడం వల్ల డిప్రెషన్‌, యాంగ్జయిటీకి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో గన్‌ కల్చర్‌ ప్రబలుతోంది. అమాయకుల ప్రాణాలకు తరచు కాల్పులు.. ఇలాంటి మానసిక వ్యాధులకు భగవద్గీత ఒక్కటే మందు... ఇందులోని ప్రతి శ్లోకం మనల్ని ఎంతగానో ప్రభావితం చేసి మనల్ని మరింత దృఢంగా మారుస్తుంది.!!’’ అన్నారు. లవ్‌ జిహాద్‌, మత మార్పిడుల పేరుతో ఇతర మతస్తులు చేస్తున్న దౌర్జన్యాలు హిందువుల ఉనికినే ప్రశ్నిస్తున్నాయని, దీనిపై హిందువులు అప్రమత్తంగా ఉండాలని గంగాధరశాస్త్రి సూచించారు. 

తానా కార్యదర్శి కొల్లా అశోక్‌బాబు కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్‌ గంగాధర శాస్త్రిని సభకు పరిచయం చేస్తూ పుణ్యజీవి, ధీరోధాత్తుడని కొనియాడారు. హనుమాన్‌ ఆలయ ఛైర్మన్‌, ‘సేవ్‌ టెంపుల్స్‌’ వ్యవస్థాపకులు డా. వెలగపూడి ప్రకాశరావు మాట్లాడుతూ గీత ప్రారంభ వాక్యం ‘‘ధర్మ’’, ముగింపు వాక్యం ‘‘మమ’’ రెంటినీ కలిపి ‘‘మమ ధర్మ’’ అంటే స్వధర్మం వదలకుండా చేయమని సూచిస్తోందని దానికి అనుగుణంగా హిందువులు నిద్రాణ స్థితిని వదిలి, మేల్కొని, ఐకమత్యంగా సమాజంలో జరుగుతున్న అధర్మాన్ని ప్రశ్నించాలని కోరారు. ఈ సందర్భంగా గంగాధరశాస్త్రిని నిర్వాహకులు ఘనంగా సత్కరించి మెమోంటోనూ అందజేశారు. ప్రవాస అతిథులతో కిక్కిరిసిన ఈ కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సేవల సమన్వయకర్త లోకేష్‌ నాయుడు, ఫౌండేషన్‌ ట్రస్టీ పోలవరపు శ్రీకాంత్‌, మాజీ కార్యదర్శి వేమూరి సతీష్‌, టాంటెక్స్‌ మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, బీరం సుందరరావు, వీర లెనిన్‌, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, బిందు తదితరులు పాల్గొన్నారు. 

 

Click here for Photogallery

 

 

 

Tags :