ASBL NSL Infratech

డాలస్ లో వైభవంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం

డాలస్ లో వైభవంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుని నామస్మరణతో డాలస్‌ మారుమ్రోగింది. సనాతన ధర్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జూలై 12వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేడుక జరిగిన ఫ్రిస్కోలోని డా. పెప్పర్‌ సెంటర్‌ భక్తులతో క్రిక్కిరిసిపోయింది. దాదాపు 10,000 మందికిపైగా భక్తులు ఈ వేడుకను తిలకించేందుకు కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. 

తిరుమల నుంచి తీసుకువచ్చిన విగ్రహాలతో, టిటిడి అర్చకులే స్వయంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని శాస్రోక్తంగా నిర్వహించి భక్తులకు కన్నులపండువు చేశారు. ఉదయం 8 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలను ప్రారంభించారు. తరువాత 10.30 నుంచి శ్రీనివాస కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. తిరుమలలో జరుగుతున్నట్లుగానే ఇక్కడ కూడా జరగడంతో భక్తులు పరవశించిపోయారు. తన్మయత్వంతో గంటలకొద్దీ ఈ వేడుకలను తిలకించారు. ఈ కళ్యాణ మహోత్సవం కోసం దాదాపు 30 రోజులపాటు నిర్వాహకులు, వలంటీర్లు ఎంతో శ్రమించారు. వారి శ్రమకు తగ్గట్టుగానే భక్తులు కూడా ఈ వేడుకలకు తరలివచ్చారు.

టీటిడి జెఇఓ పోలా భాస్కర్‌, టీటిడి బోర్డు సభ్యుడు ఎ.వి. రమణ, చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారి నాగేంద్ర కుమార్‌ తొలుత వేదిక వద్దకు చేరుకుని ఏర్పాట్లను చూశారు. సుప్రభాత సేవతో కార్యక్రమాలను ప్రారంభించారు. వేద పండితులు సుప్రభాత పఠనం చేస్తుండగా భక్తులు రావడం ప్రారంభమైంది. తోమాలసేవ, అర్చన తరువాత స్వామివారి తీర్థాన్ని అందరిపై చల్లారు. టీటిడి ధర్మకర్తల మండలి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కళ్యాణ మహోత్సవం జరుగుతున్నంతసేపు ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో కోలాహలంగా కనిపించింది. దాదాపు 300 మంది వలంటీర్లు ఈ కార్యక్రమాన్ని భక్తులు హాయిగా తిలకించేలా చేశారు.

ఈ సందర్భంగా టీటిడి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రపంచమంతా హైందవధర్మాన్ని, ఆ ధర్మంలో వేదాల్లోని సారాంశాన్ని కలియుగంలో అందించాలని ప్రపంచం మొత్తం గోవింద నామస్మరణతో ఒక్కనాడు తరించడానికి ఈ కళ్యాణం ఓ నాందిగా నేను భావిస్తున్నానని చెప్పారు. భారత దేశ ప్రతిష్ఠను, సంస్కృతిని కాపాడటానికి ప్రతి ఒక్క భారతీయునికి స్వామివారు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తునికి స్వామివారు తోడుగా ఉంటారని, స్వామి ఆశీర్వచనాలు వారికి ఎల్లవేళలా లభిస్తుందన్నారు. డాలస్‌ మెట్రోప్లెక్‌ మేయర్‌ మాహెర్‌ మాసో ఈ సందర్భంగా జూలై 12వ తేదీని శ్రీనివాస కళ్యాణం డేగా పేర్కొంటున్నట్లు ప్రకటించారు.

టీటిడి జెఇఓ పోలా భాస్కర్‌, టీటిడి బోర్డు సభ్యుడు రమణ, వేడుకల నిర్వాహకుడు గోపాల్‌ పోనంగి తదితరులు కూడా భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. కోర్‌ కమిటీ సభ్యులు సత్యనారాయణ పులిపాక, గోపాల్‌ పొనంగి, రవి ఆకుల, విజయ్‌ తోడుపునూరి, ఆర్‌.కె. పండిటి, శ్రీనివాస్‌ కొంగర, శ్యామ రుమాళ్ళ, వెంకట్‌ నార్పల, రావు కల్వల, మహేష్‌ ఆదిభట్ల, కెసి చేకూరి, రంగారావు, శ్రీనివాస్‌ పమిడి ముక్కల, శ్రీకాంత్‌ కొండ, మహేష్‌ చొప్ప, కిరణ్‌ చెలమల్ల, ఉమా మహేష్‌, మదన్‌ బిజిలి, చంద్ర కె, బందర్‌, రవి పట్టిశం తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి తీవ్రంగా కృషి చేశారు. మాజీ డిజిపి అరవిందరావు, తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర, డా. శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, డా. రాఘవేంద్ర ప్రసాద్‌, ప్రకాశరావు వెలగపూడి, తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన తదితరులు ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. 


View Event Gallery

 

Tags :