ASBL NSL Infratech

చండీ యాగానికి సర్వం సిద్ధం

చండీ యాగానికి సర్వం సిద్ధం

ఈ నెల 23 నుంచి 27వ తేది వరకు నిర్వహించే ఆయుత మహా చండీ యాగం ఏర్పాట్లును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పరిశీలించారు.  దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ యాగం కోసం ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతమంతా ముఖ్యమంత్రి కలియతిరిగి నిర్వహకులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. 101 హోమ గుండాలతో పాటు చతుర్వేద యాగశాలలు ఏర్పాటు చేశారు. రాజశ్యామల యాగానికి , మహ రుద్ర యాగానికి, ఆయుత మహా చండీ యాగానికి వేర్వేరుగా యాగశాలలు ఏర్పాటు చేశారు.  మహిళలు కుంకుమార్చన చేయడానికి ప్రత్యేక ప్రాంగణాన్ని తిర్చిదిద్దారు. ప్రతిరోజు సాయంత్రం ప్రవచనాల కోసం కూడా ఏర్పాట్లు చేశారు.

ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 3:45 నుండి ఏడు గంటల వరకు యాగం నిర్వహిస్తారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన 6 గురు ప్రధాన రుత్విజులు మొత్తం చండీ యాగాన్ని పర్వవేక్షిస్తారు. దేశ నలుమూలల నుండి వచ్చే దాదాపు రెండు వేల మంది రుత్విజులు యాగశాలలోనే ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.  రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణులు కూడా ఈ  కార్యక్రమంలో పాల్గొంటారు. యాగాన్ని భక్తులు తిలకించడానికి వీలుగా యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చండీ యాగాన్ని వీక్షించడానికి వీలుగా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. వివిఐపి ల కోసం  మూడు ప్రత్యేక కాటెజీలు,  మరో మూడు విఐపి కాటేజీలు నిర్మించారు. రుత్విజులు బస చేయడానికి, భోజనానికి రెండు భారీ ప్రత్యేక తాత్కాలిక వసతీ సమూదాయాలను ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా హాల్స్‌ నిర్మించారు. వారంతా కూర్చుని యాగాన్ని చూడటానికి వీలుగా కూడా ప్రేత్యక వ్యూ పాయింట్‌ ఏర్పాటు  చేశారు. మీడియా కోసం ప్రత్యేకంగా మీడియా పాయింట్‌ నిర్మించారు. మీడియా ప్రతినిధులు విశ్రాంతి తీసుకోవడానికి, వార్తలు ఎప్పటికప్పుడు పంపుకోవడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. విఐపిలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక భోజనశాల  నిర్మించారు.

విఐపిలు యాగాన్ని తిలకించడానికి వీలుగా ప్రత్యేక సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ చేశారు. ప్రతిరోజు దాదాపు 50 వేల మందికి భోజనం పెట్టడం కోసం భారీ భోజన శాల నిర్మించారు. వివిఐపిలు, విఐపిల కోసం ఐదు ప్రత్యేక హెలిప్యాడ్‌లు నిర్మించారు. సామన్య భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి యాగాన్ని తిలకించడానికి, ప్రదక్షిణలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 వేల వాహనాల కోసం పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.  ప్రాంగణమంతా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. సిసి కెమెరాల నిఘూ కూడా నిరంతరం కొనసాగుతుంది. మంచినీటి వసతి, సానిటేషన్‌ పనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా సరే నిర్విఘ్నంగా యాగం కొనసాగడానికి ప్రతి చోట వాటర్‌ ప్రూఫ్‌ రూఫింగ్‌ చేశారు.

ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, డిప్యూటి స్పీకర్‌ పద్యాదేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు వేము ప్రశాంత్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ తదితరులు ఉన్నారు.

ప్రముఖుల రాక

ఆయుత మహా చండీ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్లు నరసింహన్‌, రోషయ్య, విద్యాసాగర్‌ రావు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరుకానున్నారు.

 

Tags :