ASBL NSL Infratech

విమానంలో తిరుమల దేవుడు!

విమానంలో తిరుమల దేవుడు!

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలను అమెరికాలో వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడి ధర్మకర్తల మండలి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, జెఇఓ పోలా భాస్కర్‌, టీటిడి చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ డి. నాగేందర్‌ కుమార్‌తోపాటు అర్చకులు, వేదపండితులు తిరుమల నుంచి ప్రత్యేకంగా స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలకోసం అమెరికా వచ్చిన సంగతి తెలిసిందే. తమతోపాటు వచ్చిన విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత వివిధ నగరాల్లో కళ్యాణ మహోత్సవాలను టీటిడి బృందం స్థానిక నిర్వాహకులతో కలిసి ఘనంగా నిర్వహిస్తు వస్తోంది. ఈ కళ్యాణ మహోత్సవాలను చూసేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండటం టీటిడి నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కళ్యాణ వేడుకల్లో భాగంగా వాషింగ్టన్‌ డిసి నుంచి డాలస్‌ వెళ్ళాలనుకున్న సమయంలో ఓ అద్భుతం జరిగింది.

జూలై 12వ తేదీన డాలస్‌లో శ్రీనివాస కళ్యాణంకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు జూలై 11వ తేదీన వాషింగ్టన్‌ డిసిలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం జరిగిన తరువాత డాలస్‌లో జరిగే కళ్యాణానికి స్వామివార్లను రోడ్డు మార్గంలో తీసుకెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో విమానమార్గంలో తీసుకెళ్ళాలని టీటిడి బృందం, నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. దీనికి స్వామీ ఆశీస్సులు కూడా లభ్యం కావడంతో స్వామి విగ్రహాల విమాన ప్రయాణానికి ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు.

టీటిడి జెఇఓ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ, ఒక్కసారి స్వామివార్ల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత స్వామివార్లను పెట్టెలో పెట్టి మూత వేయడానికి ఆగమశాస్త్రం అంగీకరించదని, సమయం లేనందున రోడ్డుమార్గంలో తీసుకువస్తే ఆలస్యమవుతుందన్న భావనతో స్వామివార్లను విమానమార్గంలో తీసుకువచ్చినట్లు తెలిపారు.. సత్య పులిపాక మాట్లాడుతూ స్వామివార్లకోసం అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌వారు ప్రత్యేక ఏర్పాట్లను చేయడంతోపాటు అనుమతిని కూడా ఇచ్చారని చెప్పారు. బోర్డింగ్‌ పాస్‌తో 3 సీట్లలో విగ్రహాలను కూర్చోబెట్టి డాలస్‌కు తీసుకువచ్చినట్లు ఈ కళ్యాణ మహోత్సవాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. గతంలో కూడా అమెరికాలో టీటీడీ ఆధ్వర్యంలో మొదటిసారి కళ్యాణ మహోత్సవాలను నిర్వహించినప్పుడు కూడా అద్భుతాలు జరిగిన సంగతి తెలిసిందే.

టీటీడి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, జెఇఓ పోలా భాస్కర్‌, టీటిడి చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ డి. నాగేందర్‌ కుమార్‌తోపాటు అర్చకులు, వేదపండితులు స్వామివార్లతోపాటు డాలస్‌కు తరలివచ్చారు.

 

Tags :