ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రేవంత్ రెడ్డి భయపడుతున్నారా..?

రేవంత్ రెడ్డి భయపడుతున్నారా..?

తన సర్కార్ ను గద్దెదించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి..పదేపదే విమర్శిస్తున్నారు.. వంద రోజులుగా అధికారంలో ఉన్న తనను గద్దె దించాలని అంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోడీని గద్దె దించాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు. ‘‘పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా పని చేసే హక్కు నాకు లేదా!? దొరలే ఎప్పుడూ సీఎం కావాలా!? వారు కాకపోతే వారి కొడుకులే కావాలా!?’’ అని ప్రశ్నించారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పాలమూరు ప్రజలకు అందకుండా ఎమ్మెల్సీ కోడ్‌తో బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను పాలమూరులో కూడా అమలు చేస్తామని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దని, కుట్రలు చేస్తున్న వారిని అడ్డుకొని, ప్రతి బూత్‌, గ్రామంలో మెజారిటీ తెచ్చేందుకు కష్టపడితే ఆ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందని అన్నారు.

తన బిడ్డ బెయిల్‌ కోసం మాజీ సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్ ను.. బీజేపీకి తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు.. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మోడీతో చీకటి ఒప్పందం చేసుకొని సుపారీ తీసుకున్నారని సంచలన ఆరోపణలు సైతం చేశారు.. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌, భువనగిరి లోక్‌సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందుకే.. ఆయా నియోజకవర్గాల పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ గ్రామాలకు వెళ్లి బీఆర్‌ఎస్ కు ఓటు వేయాలని కూడా అడగడం లేదు’’ అని వివరించారు. బీఆర్‌ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టడం ద్వారా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకుల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర ఉంచారని మండిపడ్డారు.

బిడ్డ లగ్గం ఉన్నా కూడా వదలకుండా తనను, ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్‌కు బాధ కలగలేదని, కానీ, తన బిడ్డను జైల్లో పెట్టగానే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గద్వాల వంటి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించడానికి బీజేపీ సహకరించిందని, ఇప్పుడు బీజేపీ గెలవడానికి బీఆర్‌ఎస్‌ సహకరిస్తోందని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సహచర మంత్రులతో కలిసి సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నామని, పదేళ్లలో చేసిన వందేళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ‘‘మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. పేదలకు 200 యూనిట్లలోపు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం.

నియోజక వర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు మంజూరు చేశాం. 60 ఏళ్లుగా పోరాడుతున్న బీసీ గణనకు అనుకూలంగా అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేశాం. 126 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందుకేనా రేవంత్‌ రెడ్డిని ఓడగొట్టాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నారు!?’’ అని బీజేపీ, బీఆర్ఎస్ లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :