ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సిఎం జగన్‌పై హత్యాయత్నం

సిఎం జగన్‌పై హత్యాయత్నం

విజయవాడలో ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్రలో ప్రసంగిస్తున్నప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చి సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకిన రాయి.. సీఎం జగన్‌ పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. రాయి తగలడంతో సీఎం జగన్‌ ఎడమకంటి కనుబొమ్మపై తీవ్ర గాయం అయింది. సీఎం జగన్‌ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎడమ కంటికి సైతం గాయం అయింది. వెంటనే సీఎం జగన్‌ కు బస్సులో డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్రను సీఎం జగన్‌ కొనసాగించి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు.

సీఎం జగన్‌ పై దాడి ఎలా జరిగింది..? అంత ఈజీగా ఎలా టార్గెట్‌ చేశారు. సీఎం జగన్‌కు పోలీసులతో పాటు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. అందునా విజయవాడ లాంటి సిటీ నడిబొడ్డున దాడి జరగడమెలా సాధ్యం..? చుట్టూ పోలీస్‌ పహారా ఉంది. సీఎం లాంటి అత్యున్నతపదవిలో ఉన్న వ్యక్తి పర్యటన జరుగుతున్నప్పుడు పోలీసుల భద్రత హై రేంజ్‌ లో ఉంటుంది. ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అది కాకుండా చుట్టూ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి ఎక్కడి నుంచో రాయి ఎలా వచ్చింది..? అంత కచ్చితంగా జగన్‌ కే ఎలా తగిలింది..? ఇప్పుడిదే అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దాడి సమయంలో సీఎం జగన్‌ బస్సుపై ఉన్నారు. జై జగన్‌ అంటూ కార్యకర్తలు నినదిస్తున్నారు.

ఈతరుణంలో దూరం నుంచి రాయి వచ్చి పడిరది. అయితే అది రాయి కాదని, వైసీపీ నేతలు చెబుతున్నారు. క్యాటిల్‌ బార్‌ తో గురి చూసి కొట్టారని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో అతి పెద్ద భద్రతా లోపం దాగిఉందని చెప్పక తప్పదు. సాక్షాత్తూ సీఎం స్థాయి వ్యక్తికి పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేకపోయారు. రాయి విసిరారు సరిపోయింది. ఇంకోవిధంగా దాడి జరిగితే జరగబోయే పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారు.? ప్రస్తుతమున్న డీజీపీ, ఇతర అధికారులు.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆజ్ఞలను శిరసావహిస్తారు. ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరించాలో వారికి తెలియనిదా.. ఇప్పుడు.. ఈవ్యవహారం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో కేంద్రం ఎలా స్పందిస్తుంది..? కేంద్ర హోంశాఖ వివరణ కోరితే ఏం వివరణ ఇవ్వనున్నారు.? సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్‌ తయారు చేయాల్సి ఉంటుంది.

ఇంతలోనే ఎన్నికలు కూడా పూర్తయ్యే అవకాశముంది. మరి దీన్ని పోలీసులు ఎలా డీల్‌ చేయనున్నారు..? గతంలో చాలా మంది సీఎంలు పర్యటనలు చేశారు. అయితే అప్పుడెప్పుడూ ఈస్థాయిలో దాడి జరగలేదు. ఎప్పుడో ఎన్టీఆర్‌ టైములో ఏదో చిన్నదాడి జరిగింది. అయితే అదికూడా నాటకీయమని.. ఆయనతో కలిసి పనిచేసిన పలువురు చెబుతూ వచ్చారు. ఇటీవలి కాలంలో విపక్షనేతగా పర్యటిస్తున్నప్పుడు చంద్రబాబు టూర్‌ లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తర్వాత పోలీసింగ్‌ చాలా పటిష్టమైంది. సీఎం జగన్‌ విపక్షనేతగా రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. అప్పుడు ఎలాంటి దాడి జరగలేదు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి.. ఇప్పుడేమో రాళ్లదాడి జరిగింది.అంటే ఈఐదేళ్లుగా పోలీసులు విధి నిర్వహణలో విఫలమవుతూ వస్తున్నారా..? వీటన్నింటికీ పోలీసు వ్యవస్థ, రాష్ట్రప్రభుత్వం, కేంద్ర హోంశాఖ సమగ్ర దర్యాప్తు జరిపి అసలు నిజాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

భగ్గుమన్న వైసిపి శ్రేణులు...

సీఎం జగన్‌పై విజయవాడలో జరిగిన దాడితో వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. తమ అధినేత పర్యటనకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న ప్రజాస్పందనను చూసి తట్టుకోలేక చంద్రబాబు, టీడీపీ నేతలు.. ఈ దుర్మార్గపు ఘటనకు పూనుకున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. అంతే కాదు.. సీఎం జగన్‌ ను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. జగన్‌ కు బ్లాక్‌ క్యాట్‌ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదంతా పక్కా వ్యూహంతో జరిగిందని వారు గట్టిగా చెబుతున్నారు. సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్‌ రెడ్డిని రాళ్లతో కొట్టమని.. తుళ్లూరులో చంద్రబాబు చెప్పారన్నారు. కులాన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు మాటలు విని సీఎం జగన్‌ను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారంగా గురి చూసి కొట్టాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్ను వద్ద తగిలింది.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్‌ గాయంతో బయటపడ్డారన్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్‌ చూస్తుంటే.. ఈ దాడి కాస్తా ముఖ్యమంత్రి జగన్‌ పై జరిగిన హత్యాయత్నంగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. దీనికి చంద్రబాబు, టీడీపీ నేతలే కారణమంటున్నారు. చంద్రబాబు జీవితచరిత్ర అంతా మోసాలు, వెన్నుపోట్లేనని.. ఇప్పుడు అలాంటి ఎత్తుగడలే వేస్తున్నారని మండిపడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నీచపు పనికి పాల్పడ్డారని వైసీపీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇది చంద్రబాబు, టీడీపీకి రాజకీయ సమాధి కడుతుందని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఈఘటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకూ వివిధ అంశాలను ప్రస్తావించిన ఇరుపార్టీలు తప్పనిసరిగా ..దాడి అంశాన్ని చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇది ఎలా జరిగింది..? ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారు..? దీనివల్ల ఎవరికి లాభం.. ? ఇలాంటి అంశాలన్నీ ఒక్కసారిగా తెరపైకి రానున్నాయి.  మరోవైపు సోషల్‌ మీడియాలో ఇరువర్గాలు అప్పుడే పని మొదలుపెట్టేశాయి . వైసీపీ సోషల్‌ ఆర్మీ దాడికి కారణం టీడీపీ అని ఆరోపిస్తుంటే... కాదు, ఇది కోడికత్తి 2.0 అని టీడీపీ సోషల్‌ ఆర్మీ కౌంటరిస్తోంది. గతంలో కోడికత్తి ఘటన ఎలా రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుందో మనందరికీ తెలిసిందే.. ఈసారి దాని స్థానంలో రాళ్లదాడి ఘటన ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. కోడికత్తి కేసు .. వైసీపీకి, జగన్‌ కు రాజకీయంగా మాంచి మైలేజ్‌ ఇచ్చింది.ఈసారి ఈ రాళ్లదాడిని ప్రచారం చేస్తే, అది ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.

కోడికత్తి 2.0 వెర్షనేనా..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌పై రాయి దాడి.. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సాక్షాత్తూ వైసీపీ అగ్రనేతలు, మంత్రులు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచనే అంటూ ఆరోపిస్తుండడంతో విపక్ష పార్టీ అప్రమత్తమైంది. దాడి జరిగిన వెంటనే ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు... కోడికత్తి 2.0 వెర్షన్‌ అంటూ ట్వీట్‌ చేయడం దీనిలో భాగంగానే కనిపిస్తోంది. అంతేకాదు..నాడు కోడికత్తి, నేడు రాయిదాడి అంటూ సెటైర్‌ వేశారు. దీంతో విపక్ష టీడీపీ.. అధికార పార్టీ ఆరోపణలను ఎదుర్కొనేం దుకు సిద్ధంగా పడిరదని అందరికీ అర్థమైందని చెప్పొచ్చు. సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన ఈపరిణామం రాజకీయ వేడిని పీక్స్‌ కు చేర్చింది. 
గతంలో కోడికత్తి అంశం ఎన్నికల ప్రచారంగా మారడంతో..వైసీపీకి రాజకీయంగా లబ్ధిని చేకూర్చింది. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకూడదని పట్టుదలగా ఉన్న టీడీపీ.. సోషల్‌ మీడియాలోనూ కౌంటర్స్‌ వేస్తోంది.

ఏపీ ప్రజలు అంత అమాయకులు కాదని.. ఏం జరిగిందో అందరికీ తెలుసని ట్వీట్స్‌ పెడుతున్నారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబు బస్సుపై రాళ్లదాడి సమయంలో... మంత్రుల కామెంట్లను వెతికి తీసి మరీ పోస్టుచేస్తున్నాయి టీడీపీ సోషల్‌ ఆర్మీ శ్రేణులు.. విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉండడంతోనే... ఇలాంటి రాళ్లు పడతాయని అప్పుడు మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇదంతా నాటకమని కొందరు వ్యాఖ్యానించారు కూడా. ఇప్పుడు అవే వ్యాఖ్యలను రిపీట్‌ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇప్పుడు జనంపైనా విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉందని... దాని కారణంగానే రాళ్లు పడి ఉండొచ్చని కూడా ఓ వాదన తెరపైకి తెస్తున్నారు. సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో భద్రతా వైఫల్యంపైనా టీడీపీ అభిమానులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సీఎం రోడ్‌ షో జరుగుతుంటే కరెంట్‌ ఎందుకు తీశారు? భద్రత చూడాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. 2014 నుంచి నేటి వరకు జగన్‌ ప్రతి ఎన్నికల ముందు ఒక డ్రామా అడుతున్నారని, దాన్ని ప్రతిపక్షంపై నెడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో సీక్వెన్స్‌ పై పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైసీపీప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మొత్తం జగన్‌ కనుసన్నల్లో నడుస్తోందని.. ఈదాడికి బాధ్యత విపక్షానిదెలా అవుతుందని నిలదీస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :