ASBL NSL Infratech

హైదరాబాద్‌లో ఐటి డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న ఫిస్కర్

హైదరాబాద్‌లో ఐటి డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న ఫిస్కర్

ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ అయిన ఫిస్కర్‌.. హైదరాబాద్‌లో ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. లాస్‌ ఏంజెల్స్‌లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ హెన్రీక్‌ ఫిష్కర్‌, సీఎఫ్‌వో గీతా ఫిస్కర్‌తో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారబోతుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుందని ఫిస్కర్‌ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ వివరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీపై చర్చించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నాయన్నారు. ఇక జడ్‌ఎఫ్‌, హుండాయ్‌లాంటి పలు కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా తమ టెక్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో కేటీఆర్‌ ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించామని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేశారు. ఆటో మొబైల్‌ పరిశ్రమకు సంబంధించిన డిజైన్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్‌ లో అద్భుతమైన అవకాశాలున్నాయన్న కేటీఆర్‌, ఇందుకోసం ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగస్వాములు కావాలని ఫిస్కర్‌ కంపెనీని కోరారు. మంత్రి కేటీఆర్‌ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిస్కర్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే మొబిలిటీ క్లస్టర్‌ లో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు.

తమ ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుతో ఆటో మొబైల్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు చెందిన 300 మంది టెక్‌ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. కాగా, ఫిష్కర్‌ కంపెనీ తయారు చేసిన ఓషన్‌ మోడల్‌ ఎలక్ట్రిక్‌ కారును మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :