ASBL NSL Infratech

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ సక్సెస్....

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ సక్సెస్....

అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్ విదేశీపర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్... దావోస్ పర్యటన సాగింది. జనవరి 15 నుంచి 18వ తేదీవరకూ జరిగిన ఈపర్యటనలో.. తెలంగాణ ప్రభుత్వం పలు కంపెనీలతో పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకుంది. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామమని... హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కంపెనీలకు పిలుపునిచ్చారు.స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అధికారులతో కలిసి సీఎం పాల్గొన్నారు.

దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్ కు రావాలి‘ అని సీఎం స్వాగతం పలికారు.

పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డి వరుసభేటీలు

ఈ సదస్సు సోమవారం ప్రారంభం కాగా.. రెండ్రోజుల్లో 60 మంది వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ సర్కారు విధానాలను ... హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను గురించి విశదీకరించారు.. డబ్ల్యూఈఎఫ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ఆయన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఈ భేటీల్లో పాల్గొన్నారు.

హైదరాబాద్ లో అమెజాన్ విస్తరణపై ఫోకస్..

అమెజాన్‌ ఉపాధ్యక్షుడు మైఖేల్‌ పుంకేతో జరిగిన భేటీలో రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆ సంస్థ పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అమెజాన్‌ డేటా సెంటర్‌, రెండో అతిపెద్ద కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌తోనూ రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. ఆ సంస్థ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లో ఉండగా.. భారత్‌ కేంద్రంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. ఇక్కడ పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), క్లినికల్‌ డెవలప్‌మెంట్‌, మెడికల్‌ రైటింగ్‌కు సంబంధించిన విభాగాలున్నాయి. భవిష్యత్‌లో నోవార్టిస్‌ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.

ఆరోగ్యవంతమైన తెలంగాణ దిశగా..

యూఎస్‌ అగెనెస్ట్‌ అల్జీమర్స్‌ చైర్మన్‌ జార్జ్‌ వ్రాదెన్‌బర్గ్‌తోనూ సీఎం సమావేశమై.. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణపై సలహాలను కోరారు. తొలిరోజు సదస్సు సందర్భంగా డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండ్‌, ఇతర నిర్వాహకులతో రేవంత్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్‌ హసెంటోతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్‌మ్యాప్ ను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పనిచేస్తే.. ప్రజలు సంపన్నులవుతారని, రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రేవంత్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సీఎం నిర్వహించిన వరుస భేటీల్లో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇన్వె్‌స్టమెంట్స్‌ ప్రమోషన్స్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

యువతకు నైపుణ్య శిక్షణ

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్(నాస్కామ్‌) అధ్యక్షుడు దేబ్జానీ ఘోష్‌తో రేవంత్‌ సమావేశమై.. రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించే అంశంపై చర్చించారు. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇతర డిగ్రీ కోర్సుల్లో ఉన్న యువత చదువు పూర్తయ్యేలోపే వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అందించాల్సిన నైపుణ్యాభివృద్ధిపై సహకరించాలని నాస్కామ్‌ను కోరారు. ఈ విషయంలో నాస్కామ్‌ ముందుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. దావోస్‌ అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌(సీ4ఐఆర్‌) కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. దీనికి సంబంధించి సదస్సు అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండ్‌, సీఎం రేవంత్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో జరగనున్న సదస్సులో ఈ సెంటర్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా సీఎం సారథ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే స్టేట్‌ హెల్త్‌టెక్‌ ల్యాండ్‌స్కేప్‌ సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. రాష్ట్రంలో ఆరోగ్యం, పారిశ్రామికరంగాన్ని బలోపేతం చేసేందుకు, విదేశీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

రూ.40,232కోట్ల పెట్టుబడులు

దావోస్ టూర్ లో భాగంగా మొత్తం 200 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. పలు కీలక ఒప్పందాలను సైతం కుదుర్చుకుంది. ఏకంగా రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్‌ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

ఆదానీగ్రూప్ రూ.12,400కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో భారీగా పెట్టుడబులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మెుత్తం రూ. 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలిసింది. బహుళ ప్రయోజనాలతో అదానీ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురూ చర్చించి నాలుగు ఎంవోయూలు కుదుర్చుకున్నారు.

రైతుల పక్షాన కార్పొరేట్ ప్రపంచం నిలబడాలి..

దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. మరో సదస్సులో మాట్లాడుతూ…. హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయని అన్నారు. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోడానికి డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలని సీఎం అన్నారు.

డెలిగేట్స్ తో సమావేశాలు

ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్ కు రావాలి...‘ అని స్వాగతం పలికారు.

ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడితో సీఎం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం.. సీ4ఐఆర్‌ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయోఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్‌ ప్రారంభం కానుంది. రేవంత్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఉంటాయని స్పష్టం చేశారు. డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యంతో వేగంగా లక్ష్యాలు అందుకోవచ్చన్నారు. ప్రజారోగ్యం, సాంకేతికత, మెరుగైన జీవితం కల్పించడం వంటి లక్ష్యాలను చేరుకోవచ్చని వెల్లడించారు.

ప్రపంచ ఆర్థిక వేదికకు సంబంధించిన సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌ నెట్‌వర్క్‌ ఇప్పటి వరకు అయిదు ఖండాల్లో విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పనున్న ఈ కేంద్రం ప్రపంచంలో 19వది. అయితే దీనికి అనుబంధంగా ఆరోగ్య సంరక్షణ, జీవ వైద్య శాస్త్ర కేంద్రం ఏర్పాటు చేయనుండడం ఇదే తొలిసారి అవడం గమనార్హం. ఆసియాలోనే జీవ వైద్య శాస్త్ర రంగానికి హైదరాబాద్‌ నగరంను ముఖ్య కేంద్రంగా పరిగణించనున్నారు. అలాగే దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. లాభాపేక్ష లేని సంస్థ ఇది. ఆరోగ్య సంరక్షణ, జీవ వైద్య శాస్త్ర విధానాల రూపకల్పన, పరిపాలన అంశాలపై ఇది దిశానిర్దేశం చేస్తుంది.

రాష్ట్రంలో వచ్చే అయిదేళ్లలో 20 వేల స్టార్టప్‌ ఇంక్యుబేటర్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ ప్రారంభంతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని, కొత్త ఆవిష్కరణలకు స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. తెలంగాణను 'హెల్త్‌ టెక్‌ హబ్‌'గా, ప్రపంచ గమ్యస్థానంగా మార్చటంపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను అందించే సంకల్పంతో పని చేస్తుందని ఆయన తెలిపారు. సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు శామ్‌ బిషెన్‌ మాట్లాడుతూ, అందరికీ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సాంకేతిక విధానాల లభ్యతకు ఈ ఒప్పందం దోహదపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

తెలంగాణలో ‘పెట్టుబడి పెట్టండి’ పేరుతో పెవిలియన్‌..

ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ పెవిలియన్‌’ ఏర్పాటు చేసింది. తెలంగాణలో ‘పెట్టుబడి పెట్టండి’ పేరుతో పెవిలియన్‌ రూపొందించారు. ‘సృజనాత్మక.. సంప్రదాయాల కలయిక..’ ట్యాగ్‌ లైన్‌తో పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంకేతిక సృజనాత్మకతను ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్‌, పోచంపల్లి ఇక్కత్‌, చేర్యాల పెయింటింగ్స్‌, టీ హబ్‌ పేరుతో పెవిలియన్‌ వాల్‌ రూపొందించారు. పెట్టుబడులకు దేశంలోనే మొదటి గమ్యస్థానం, అపారమైన అవకాశాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ వంటి నినాదాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ‘మీకోసమే తెలంగాణ’ అంటూ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వ్యక్తం చేసేలా ఏర్పాట్లు చేశారు.

దావోస్ సదస్సు ప్రాముఖ్యత...

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతూ వస్తోంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదాని.. వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు.

కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటుంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ పర్యటనలో ఆయన వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి వీ శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్వి విష్ణువర్ధన్ రెడ్డి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరామ్, ముఖ్య భద్రతాధికారి తస్ఫీర్ ఇక్బాల్, ఉదయ సింహా, గుమ్మి చక్రవర్తి వెళ్తారు.

దావోస్‌కు దారేది?

ఇందుకోసం మీకు ఆహ్వానం అంది ఉండాలి. మీరు ప్రపంచ నేతనో, చీఫ్ ఎగ్జిక్యూటివో.. కాకపోతే కనీసం ఏదో కంపెనీ ప్రతినిధి లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ లేదా ఎన్జీవో ప్రతినిధి అయి ఉండాలి.లేదా ప్రపంచ ఆర్థిక వేదికలో సభ్యత్వం కలిగి ఉండడంతో పాటు సుమారు రూ.17 లక్షలు రుసుం చెల్లించాలి.

ఒక ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ తన ఇన్వెస్టర్ల కోసం ఈ ఈవెంట్‌పై సుమారు రూ.4.4 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.మీ దగ్గర అంత సొమ్ము లేకుంటే, అక్కడికి వెళ్లి, చిన్నా చితకా ఈవెంట్స్‌లో పాల్గొనొచ్చు.దీని కోసం ఔత్సాహికులు కొన్ని నెలల ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటారు. అక్కడ మీకు లభించే 'హోటల్ బ్యాడ్జ్'తో మీరు సమావేశాలలో పాల్గొనలేకపోయినా, కనీసం అక్కడ ప్రముఖులు పాల్గొనే పార్టీల దగ్గర వరకు వెళ్లొచ్చు.

లండన్ లో ఎంపీలతో సమావేశం

దావోస్ టూర్ తర్వాత లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లతో సమావేశమయ్యారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమేనన్నారు.. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే సరైన మార్గమని సూచించారు.యునెస్కో 2016 సంవత్సరంలోనే లండన్ లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలోనే ఈ సమావేశం జరిగింది. లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

“నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి... వీటన్నింటికీ విరుగుడు ప్రజాస్వామ్యం పటిష్టం చేయటం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం.‘ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో తన స్వీయ అనుభవాలను సీఎం వారితో పంచుకున్నారు. ‘నాది గ్రామీణ ప్రాంతం. నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఎంచుకున్న ప్రజాస్వామ్య భావనతోనే నాకు ఇంతటి అవకాశం వచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశాలు అసలైన ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయి..‘ అని చెప్పారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :