ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కమలం పనైపోయిందా..?

కమలం పనైపోయిందా..?

మొన్నటి వరకూ తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగించింది. బెంగాల్ స్ట్రాటజీ అమలు చేస్తూ.. పార్టీని మరింత వేగంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పార్టీలో చేరికలను ప్రోత్సహించడం ద్వారా బలోపేతం చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డికె అరుణ లాంటి చాలా మంది సీనియర్లు కమలం పార్టీలో చేరారు. అంతేనా పార్టీ చేరికల కోసం ఓకమిటీని ఏర్పాటు చేయడంతో పాటు దానికి ఈటలను చైర్మన్ గా నియమించింది. మరోవైపు.. బండి పాదయాత్రతో రాష్ట్రం చుట్టేస్తూ.. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. దీనికి తోడు దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపుతో గులాబీ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న అభిప్రాయాన్ని కలిగించడంతో కమలం నేతలు సక్సెస్ అయ్యారు.

కర్నాటక ఎన్నికల ఫలితాలు... తెలంగాణ బీజేపీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త నేతలను చేర్చుకునేందుకు పార్టీ చేరికల కమిటీ... ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. సరికదా.. జూపల్లి, పొంగులేటి లాంటి వాళ్లు తిరిగి తనకే కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఈటల చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. చేరికలు ఆగిపోయాయి. ఎవరూ పార్టీలో చేరే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బీజేపీ పనైపోయిందని మంత్రి హరీశ్ రావు లాంటి వాళ్లు సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు కర్నాటక ఎన్నికల ఫలితాలతో .. తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఇదే అదనుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దేనని.. పార్టీ వీడిన నేతలందరూ తిరిగి రావాలని కోరుతున్నారు. అంతే కాదు... నేతల పేర్లను కూడా ప్రస్తావిస్తూ.. వారిని ఇరుకున పెడుతున్నారు. దీంతో ఆ నేతలందరూ తాము పార్టీ వీడడం లేదని ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు..పార్టీలో చేరదామని భావించిన జూపల్లి, పొంగులేటి వంటి వాళ్లు కూడా.. ఇప్పుడు గాంధీభవన్ వైపు పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

మొన్నటి వరకూ అందరూ బీజేపీలోకి వస్తున్నారు. మేం డోర్లు ఓపెన్ చేస్తే చాలు .. పార్టీలు ఖాళీ అవుతాయని చెప్పుకున్న అదే నోటితో... ఇప్పుడు మాపార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లడం లేదని చెప్పాల్సిన దుస్థితి కమలం పార్టీనేతలకు వచ్చింది. అంతే కాదు.. దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ నేతలు వాపోతున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకత్వంతో పోరాటం కోసం పార్టీలో చేరిన నేతలు.. బీజేపీ హైకమాండ్ వైఖరిపై అనుమానంతో వేరే పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరున్నప్పటికీ.. చర్యలు తీసుకోకుండా వ్యవహరించడంతో.. ఇరుపార్టీల మధ్య ఏమైనా జరుగుతోందా అన్న అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈపరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చేరికలు పెరగనున్నట్లు సమాచారం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :