ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇండియా వర్సస్ ఎన్డీయే..! ఇదే విపక్షాల నినాదం..!!

ఇండియా వర్సస్ ఎన్డీయే..! ఇదే విపక్షాల నినాదం..!!

కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలనుకుంటున్నాయి విపక్షాలు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉంది. అందుకే ఇప్పటి నుంచే ఐక్యంగా ముందుకు సాగాలని విపక్షాలన్నీ నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్ లేకుండా విపక్షాలన్నీ కలిసి పోరాడాలని మొదట్లో భావించినా అది అసాధ్యమని గ్రహించాయి. అందుకే కాంగ్రెస్ నేతృత్వంలోనే కూటమిగా బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తున్నాయి. కూటమికి సంబంధించిన కీలక సమావేశం నిన్నటి నుంచి బెంగళూరులో జరుగుతోంది. ఇందులో కూటమి పేరును నిర్ణయించారు.

విపక్షాల కూటమి పేరు ఖరారైంది. ఇండియన్ నేషనల్ డొమొక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ – INDIA అని దీనికి పేరు పెట్టారు. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమి అని తెలుగులో చెప్పుకోవచ్చు. అయితే అలయెన్స్ అనే పదంపై ఇంకా క్లారిటీ రానట్టు తెలుస్తోంది. ఏదైతేనేం విపక్షాల మధ్య ఐక్యత అసాధ్యమని.. ఆ అనైక్యతే బీజేపీకి ఆయుధమని చాలాకాలంగా పలువురు భావిస్తూ వస్తున్నారు. అలాంటిది 26 విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. రెండు సార్లు భేటీ అయ్యాయి. బీజేపీని సమైక్యంగానే ఎదుర్కోవాలని నిర్ణయించాయి. దీంతో విపక్షాల కూటమిపై ఇన్నాళ్లూ ఉన్న అపోహలు తొలగినట్లేనని భావిస్తున్నారు.

కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ, ఆర్జేడీ.. లాంటి కీలక పార్టీలెన్నో ఈ సమావేశానికి హాజరయ్యాయి. పేరు కూడా డిసైడైపోయింది. ఇప్పుడు కూటమికి అధ్యక్ష, కన్వీనర్లను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే కూటమికి సోనియా నేతృత్వం వహిస్తేనే బాగుంటుందని విపక్షాల్లో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే సోనియా అధ్యక్షురాలిగా, నితీశ్ కుమార్ కన్వీనర్ గా నియమితులవడం ఖాయంగా కనిపిస్తోంది. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను వీళ్లిద్దరూ తీసుకోవాల్సి ఉంది.

అయితే ఈ కూటమి సమైక్యంగా ముందుకు సాగడంపై ఇప్పటికీ అనేక అనుమానాలున్నాయి. కూటమిలోని పలు పార్టీల మధ్య రాష్ట్రాల్లో వార్ నడవనుంది. పంజాబ్ లో ఆప్ – కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. అలాగే కేరళలో లెఫ్ట్ – కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోంది. ఇలాంటి రాష్ట్రాల్లో ఎలా సమన్వయం చేసుకుంటారనేది అంతుచిక్కడం లేదు. ఈ చిక్కుముళ్లను సాల్వ్ చేసుకోగలిగితే కచ్చితంగా విపక్ష కూటమి మంచి రిజల్ట్స్ రాబట్టుకునే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :