ASBL NSL Infratech

కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యూచర్ ఏంటి?

కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యూచర్ ఏంటి?

రాజకీయాల్లో హత్యలుండవ్.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయ్.. అంటూ ఉంటారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హ్యాపీగా అక్కడ ఉండక.. పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. చివరకు ఏమైంది.. ఆయన అతి విశ్వాసం కొంపముంచింది. మునుగోడు వాసులు తన వెంటే ఉంటారనుకున్న కోమటిరెడ్డికి అక్కడి ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అటుఇటు కాకుండా పోయారు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం.

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎంతో పేరుంది. ఒకప్పుడు జిల్లాలో వారు చెప్పిందే వేదం. వారికంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ మునుగోడు ఎన్నికతో బ్రాండ్ ఇమేజ్ మొత్తం అభాసుపాలైంది. కేసీఆర్ టార్గెట్ గా చేసుకుని బైపోల్ కు వెళ్లారు రాజగోపాల్ రెడ్డి. ఇది సెమీఫైనల్ అని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ప్రకటించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పనైపోయిందని ప్రచారం చేసారు. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ అండగా నిలిచింది. మనుగోడులో గెలిచి కేసీఆర్ ను గద్దె దించాలనుకున్నారు. కానీ బీజేపీ ప్లాన్ వర్కవుట్ కాలేదు. బీజేపీ వ్యూహంలో చిక్కుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్న పదవినీ పోగొట్టుకున్నారు.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, ఎంపీ వెంకట్ రెడ్డి కూడా అటుఇటు కాకుండా పోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న కోమటిరెడ్డి ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ప్రచారం చేయలేదు. అలాగని సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికీ మద్దతివ్వలేదు. అయితే పార్టీలకతీతంగా ఓటు వేయాలంటూ తన అనుచరులకు చెప్పిన ఆడియో బయటకు రావడం ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ లో ఎంపీగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పకుండా వ్యతిరేక ప్రచారం చేయడంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపోమాపో చర్యలకు సిద్ధమవుతుంది. తన సొంత నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్నా పట్టించుకోకుండా పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం మరిన్ని వివాదాలకు కారణమైంది.

ఇప్పుడు మునుగోడులో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కు రాజీనామా చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు బీజేపీ ఓడిపోవడంతో వెంకట్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఈలోపే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలా చర్యలు తీసుకుంటే ఆయన కూడా బీజేపీలో చేరొచ్చు.. అయితే మునుగోడులో ఓటమి తర్వాత బీజేపీకి ఇక్కడ భవిష్యత్ ఉంటుందా అనే అనుమానాలున్నాయి. పైగా నల్గొండ జిల్లాలో తిరుగులేని నేతలుగా చెలామణీ అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్లడం ద్వారా తమ ప్రాభవాన్ని కోల్పోయారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగి, పదవులు అనుభవించి ఇప్పుడు ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచారనే విమర్శలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీలో వారికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది.. వారి భవిష్యత్ ఏంటనేది ఆసక్తి కలిగిస్తోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :