ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మరో నాటకానికి తెర లేపిన బాబాయ్ – అబ్బాయ్..!!

మరో నాటకానికి తెర లేపిన బాబాయ్ – అబ్బాయ్..!!

మహారాష్ట్రలో రాజకీయం రోజురోజుకూ ఎన్ని మలుపులు తీసుకుంటోందో చూస్తూనే ఉన్నాం. ఆదివారం మరో ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఎన్సీపీని చీల్చి వేరుకుంపటి పెట్టుకున్న అజిత్ పవార్.. పార్టీ వ్యవస్థాపకులు శరద్ పవార్ ను కలిశారు. పార్టీని ఐక్యంగా ఉంచాలని అభ్యర్థించారు. అసలు ఈ ట్విస్టును ఎవరూ ఊహించలేదు. పార్టీ తనదంటే తనదేనని ఇన్నాళ్లూ బీరాలు పోయిన ఇద్దరు నేతలు ఇప్పుడు సుదీర్ఘంగా భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాబాయ్ అబ్బాయ్ ఇద్దరూ కలిసే ఈ డ్రామా నడిపిస్తున్నారని మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ భేటీ కావడం అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – ఎన్సీపీ నిట్టనిలువునా చీలిన విషయం మనకు తెలిసిందే. శరద్ పవార్ ఈ పార్టీ వ్యవస్థాపకులు. మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పిన నేత. ఎన్సీపీ లేకుండా అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవంటే ఆ పార్టీ ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీంతో శరద్ పవార్ కింగ్ మేకర్ గా మారారు. తనకు ఎక్కడ ఎక్కువ లబ్ది చేకూరితే ఆ పార్టీతో కలవడం శరద్ పవార్ కు అలవాటే. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు శరద్ పవార్. కాంగ్రెస్ తో శివసేన చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక శరద్ పవార్ కీలకపాత్ర పోషించారు.

అయితే శివసేనను బీజేపీ చీల్చిన తర్వాత కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయాయి. అప్పటి నుంచి ఎన్సీపీలో అసంతృప్తి మొదలైంది. బీజేపీతో కలిసి పనిచేద్దామనే ఒత్తిడి శరద్ పవార్ పై పెరిగింది. అయితే శరద్ పవార్ మాత్రం తాను నమ్ముకున్న సిద్ధాంతాలను వదిలి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. అలాగని అజిత్ పవార్, ప్రపుల్ పటేల్ లాంటి నమ్మకస్తుల మాటను కాదనలేకపోయారు. అందుకే తెరవెనుక ఉంటూనే చక్రం తిప్పారు. వాళ్ల దారి వాళ్లను చూసుకోమన్నారు. దీంతో అజిత్ పవార్ నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు ఎన్సీపీని చీల్చేశారు. తమదే ఒరిజినల్ అని చెప్పుకొచ్చారు. దీంతో శరద్ పవార్ ఒంటరిగా మారారు. అయితే ఇదంతా శరద్ పవార్ కు తెలిసే ఆడుతున్న డ్రామాగా చాలా మంది భావిస్తూ వచ్చారు.

అజిత్ పవార్ ప్రభుత్వంలో భాగస్వాములైన తర్వాత 9 మందికి మంత్రిపదవులు దక్కాయి. ఎన్సీపీని చీల్చారనే చెడ్డపేరు అజిత్ పవార్ కు వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పార్టీకోసమే తాను ఈ పని చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తమ నాయకుడు శరద్ పవారేనని ప్రకటించారు. అంతేకాక ఆదివారం అజిత్ పవార్ నేతృత్వంలో చీలిక వర్గం నేతలు శరద్ పవార్ ను కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీని ఐక్యంగానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన ఏమీ మాట్లాడలేదని చెప్పారు. అయితే ఇదంతా పెద్ద డ్రామా అని నేషనల్ మీడియా ప్రకటించింది. రేపోమాపో శరద్ పవార్ కూడా తలొగ్గి అంతా కలిసి పనిచేయడం ఖాయమని ఘోషిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :