ASBL NSL Infratech

చంద్రబాబుపైనే టీఆర్ఎస్ గురి?

చంద్రబాబుపైనే టీఆర్ఎస్ గురి?

తెలంగాణ ఎన్నికల్లో మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే కేంద్ర బిందువు అయ్యారు. ముందస్తు ఎన్నికల ప్రకటనకు ముందు, తరువాత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్‌ఎస్‌)దే గెలుపు అని భావించిన తరుణంలో చంద్రబాబు రంగప్రవేశం అంచనాలను తలకిందులు చేసింది. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితితో కలిసి ఫ్రంట్‌ ఏర్పాటయ్యేలా చంద్రబాబు చక్రం తిప్పారు. దాంతో అంతవరకు టీఆర్‌ఎస్‌దే ఏకపక్ష విజయం అన్నవారు తరువాత కూటమి ఏర్పాటైన తరువాత ప్రజల్లో వచ్చిన మార్పును చూసి ఇప్పుడు గెలుపెవరిదో చెప్పలేమని చెబుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ తమ విజయావకాశాలకు గండికొడుతున్న చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుంది.

చంద్రబాబునాయుడు తెలంగాణకు మొదటి నుంచి చేస్తున్న వ్యతిరేక కార్యకలాపాలను ప్రజలకు ఏకరువు పెట్టడానికి టిఆర్‌ఎస్‌ ప్రచారకర్తలు వ్యూహం రూపొందించారు. మలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాత్రికి రాత్రే ఇతర సీమాంధ్ర పార్టీలతో కూడా మంతనాలు చేసి కత్రిమ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి అడ్డుకున్న విధానాన్ని వివరించనున్నారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు 'ఓటుకు..నోటుతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన కుట్రను కూడా మరోసారి ప్రజల్లో ఎండగట్టేందుకు యోచిస్తున్నారు. కాళేళ్వరం..పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, భక్తరామదాసు తదితర ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు రాసిన లేఖలను కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజల్లో బహిరంగ పరిచేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలివిడతగా నీటిపారుదల శాఖ మంత్రితో తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న 19 కుట్రలను వివరిస్తూ  బహిరంగ లేఖను విడుదల చేయించారు. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు బడుగు, బలహీనవర్గాలకు తమ పార్టీలో పెద్దపీట వేస్తామని ప్రగల్బాలు చెప్పుకునే టిడిపి అగ్రనేతలు..గత ఎన్నికల్లో తెలంగాణ సిఎం అభ్యర్థిగా ప్రకటించిన బిసి ఉద్యమ నేత ఆర్‌.కష్ణయ్యకు రానున్న ఎన్నికల్లో ఆయన సిట్టింగ్‌ స్థానం ఎల్‌బి నగర్‌ నుంచి అవకాశం కల్పించేందుకు కూడా ఆసక్తి చూపలేదనే అంశాన్ని కూడా తమ ప్రచారంలో ప్రజలకు వివరించాలని టిఆర్‌ఎస్‌ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలిసింది. బిసివర్గాల పార్టీగా టిడిపిని చెప్పుకునే ఆపార్టీ నేతలు..అఖరి వరకు పార్టీనే నమ్ముకుని ఉన్న కష్ణయ్యకు అన్యాయం చేశారనే విషయాన్ని ప్రజల్లోకి ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతోన్నారు.

సిఎం కేసిఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజు రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రోజుకు నాలుగైదు వరకు కూడా సభల్లో కూడా ఆయన సుడిగాలి ప్రచారం చేసినట్లు చెబుతున్నారు. మహాకూటమి అభ్యర్థులను ఈనెల 11. 12 తేదీల్లో పకటించే అవకాశం ఉన్నందున..అవెంటనే ముమ్మర ప్రచారానికి సిఎం కేసిఆర్‌ సహా..టిఆర్‌ఎస్‌ అగ్రనేతలు కేటిఆర్‌, హరీష్‌రావు, కవిత..తదితరులు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు కూటమి అభ్యర్థులు ఖరారు కాకపోవడం వల్లే..ప్రత్యర్థి ఆటగాళ్లే లేకపోతే..గ్రౌండ్‌లో ఎలా ఆట ఆడాలని..వాళ్లు ఖరారు కాగానే తమ అధినేత కేసిఆర్‌ ప్రచార కదన రంగంలోకి దూకుతారని ఇటీవటే కేటిఆర్‌ కూడా వెల్లడించారు.

 

Tags :