ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రయుత చండీయాగం చేస్తా : కేసీఆర్

ప్రయుత చండీయాగం చేస్తా : కేసీఆర్

అనుకున్న లక్ష్యాలు నెరవేరితే ప్రయుత చండీయాగం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  ఐదు రోజులుగా మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అయుత చండీ మహాయాగం ముగిసిన సందర్భంగా యాగంలో పాలుపంచుకున్న వారిని కేసీఆర్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకకల్యాణార్థమే అయుత చండీయాగాన్ని నిర్వహించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. యాగాలు చేయటం తనకు కొత్తకాదని అన్నారు.  తెలంగాణ  రాష్ట్రం సిద్దిస్తే ఆయుత చండీయాగం చేస్తానని మొక్కుకున్నానని అన్నారు. తాను యాగానికి సిద్ధమయితే కొంతమంది అవాకులు చెవాకులు, మాట్లాడారని, మరికొందరు ఎద్దేవా చేశారన్నారు.  త్వరలో కుటుంబ సమేతంగా శృంగేరి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో బ్రతకాలని, అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా మిషన్‌ భగీరధ పూర్తికావాలని మొక్కుకున్నానన్నారు. ప్రతిఏటా నీటిప్రాజెక్టుల కోసం బడ్జెట్‌ కేటాయిస్తామని అన్నారు.

ప్రజలందరూ సంతోషంగా బతకగలిగితే అదే తనకు తృప్తి అని అన్నారు. ఈ యాగం ఏ ఒక్కరి శ్రేయస్సు కోసమో చేసింది కాదన్నారు. వంద సంవత్సరాలు భంగపడి, ఇటీవలే విముక్తమై ప్రగతివైపు అడుగులు వేస్తున్న తెలంగాణ సంక్షేమాన్ని కాంక్షించి నిర్వహించామని అన్నారు.  చాలా పట్టుదలగా రుత్విజ మహాశయులంతా యాగం నిర్వహించారు. యాగం సుసంపన్నమైంది. వైదికంగా పూర్ణాహుతి పరిసమాస్తమైందన్నారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

 

Tags :