ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో ‘ఎపి ప్రత్యేక ప్రతినిధి’ కార్యాలయం ప్రారంభం

అమెరికాలో ‘ఎపి ప్రత్యేక ప్రతినిధి’ కార్యాలయం ప్రారంభం

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జయరామ్‌ కోమటి రాష్ట్ర అభివృద్ధిపనులకు సంబంధించిన వ్యవహారాలను ఎన్నారైలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వీలుగా మిల్‌పిటాస్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కార్యాలయంలోని కుర్చీలో జయరామ్‌ కోమటిని కూర్చోబెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నారైల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎన్నారైలను రాష్ట్రాభివృద్ధిలో కీలకభాగస్వాములుగా గుర్తిస్తోందని, వారికి ఉపయోగపడేలా అనేక చర్యలను చేపట్టిందన్నారు. జన్మభూమి బాగుకోసం ఎంతోమంది ఎన్నారైలు ముందుకు వస్తున్నారని, వారందరికీ ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటిమాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని, ఆయనకు చేయూతగా నిలిచేందుకు ఎంతోమంది ఎన్నారైలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చే ఎన్నారైల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు 5,000 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు కృషిచేస్తానంటూ రాసిన లేఖపై తొలి సంతకం చేసి మంత్రికి అందించారు.

ఈ కార్యక్రమంలో జన్మభూమి పనుల కోసం ప్రత్యేకంగా తయారు www.apjanmabhoomi.org ని ఆవిష్కరించారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీమతి సంధ్యారాణి కూడా ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించిన వ్యవహారాలన్నీఉన్న cse.ap.gov.in ను ఈ పోర్టల్‌కు అనుసంధానించడం వల్ల మరింత ఉపయోగం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి తానా, బాటా నాయకులతోపాటు దాదాపు 100 మంది ఎన్నారైలు హాజరయ్యారు.

 

 

Tags :