ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మీ వాటా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మీ వాటా ఉండాలి

డల్లాస్‌ సమావేశంలో ఎన్నారైలను కోరిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధిలోనూ, అమరావతి రాజధాని నిర్మాణంలోనూ ఎన్నారైలు పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. తనను కలుసుకోవడానికి వచ్చిన ఎన్నారైలంతా గత 9ఏళ్ళ ముఖ్యమంత్రి హయాంలో జరిగిన సాంకేతికరంగ అభివృద్ధి వలనే తాము ఇక్కడకు వచ్చి పారిశ్రామికవేత్తలుగా ఎదిగామని చెబుతున్నారని, ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలంతా వారి సంస్థల్లో వచ్చిన లాభాల్లో తన వాటాలను నూతన రాష్ట్రాభివృద్ధికి ఇవ్వాలని కోరారు. శనివారం సాయంత్రం డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌లో ఎపిఎన్‌ఆర్‌టీ, ఎన్నారై టీడిపి, ఎపి జన్మభూమి సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నారైలను ఉద్దేశించి ముఖ్యమంత్రి 45 నిముషాలపాటు ప్రసంగించారు.

భారతదేశం యువరక్తంతో ఉప్పొంగుతోందని, రెండంకెల వృద్ధి మరే దేశానికి సాధ్యం కాని రోజుల్లో దానిని సాధించి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 కల్లా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా మలచాలని ముందుచూపుతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. 

రాష్ట్రం ఎల్లప్పుడూ సంతోషదాయకంగా వుండేలా చూస్తున్నామని, ఇందుకోసం సంతృప్తి సూచికపై దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చామని, అయితే రైతుల సహకారంతో వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టేలే రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు. అమరావతి నిర్మాణం తన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు. ఒక నగరాన్ని నిర్మించడం, రాజధానిని నిర్మించడం వేర్వేరని, రాజధాని నిర్మాణంలో పలు సవాళ్లను అధిగమించాల్సి వుంటుందని అన్నారు. 

రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్న ముఖ్యమంత్రి 24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేయడం, పింఛన్లు ఐదు రెట్లు పెంచడం, పేదవారికి నిత్యావసరాలు అందించడం, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, అందరికీ గ్యాస్, సీసీ రోడ్ల నిర్మాణం, ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దడం, నదుల అనుసంధానం, కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి చేపట్టిన చర్యలను వివరించారు. ప్రతి ఒక్కరు జన్మభూమితో మమేకం కావాలని సూచించారు. 

ప్రపంచం సాంకేతికతలో ముందుందన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలోనూ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నామని చెప్పారు. వినూత్నంగా ఆలోచించి వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును అతి తక్కువ ఖర్చుతోనే పూర్తి చేస్తున్నామని, రాష్ట్రంలోని ప్రతి ఇంటిని ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తున్నామని అన్నారు. కేవలం రూ. 149కే ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ ప్రసారాలు అందిస్తామని చెప్పారు. 

మీకున్న నూతన ఆలోచనలను, ఆవిష్కరణలను మీ గ్రామాల్లో అమలు పరచాలని ఈ సందర్భంగా ప్రవాస తెలుగువారిని ముఖ్యమంత్రి కోరారు. హుద్ హుద్ తుఫాను సమయంలో వచ్చిన ఆలోచనతో సుమారు ఐదు లక్షల ఎల్ఈడీ బల్బులను మొదటిసారిగా ఏర్పాటు చేసి పెద్దఎత్తున విద్యుత్ ఆదా అయ్యేలా చేశామని చెప్పారు. తన డ్యాష్ బోర్డు ద్వారా ఎక్కడ ఏ బల్బు పనిచేస్తున్నది, లేనిదీ ఎక్కడ నుంచైనా తెలుసుకోగలుగుతున్నానని అన్నారు. ఎంతో చవకైన సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టిపెట్టామన్న ముఖ్యమంత్రి గతంలో సౌర విద్యుత్ యూనిట్ ధర రూ. 6గా వుంటే, ఇప్పుడు యూనిట్‌కు రూ. 3.15 కన్నా తక్కువకే లభిస్తోందని చెప్పారు. 

ఈ సమావేశంలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి తొలుత ప్రసంగించి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనకు సహకరించి రాష్ట్రాభివృద్ధిలో మనవంతు కృషిని చేయాలని కోరారు.

ఎపిఎన్‌ఆర్‌టీ సిఇఓ డా. రవికుమార్‌ వేమూరు మాట్లాడుతూ నేడు ఎంతోమంది ఎన్నారైలలో తెలుగువాళ్ళు ముందంలో కనిపిస్తున్నారని ఇది చాలా సంతోషకరమైన విషయమని చెప్పారు. తొలుత ఎపిఎన్‌ఆర్‌టీ అంతర్జాతీయ సలహాదారు సతీష్‌ మండువ స్వాగతోపన్యాసం చేశారు.

ఈ కార్యక్రమంలో హ్యూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ అనుపం రే, మంత్రి యనమల రామకృష్ణుడు, మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, ఎన్నారై తెదేపా శ్రేణులు వేమన సతీష్, మండువ సురేష్, కొణిదెలె లోకేష్, గోవాడ అజయ్, కేసీ చేకూరి, సుగన్ చాగర్లమూడి, మన్నవ మోహనకృష్ణ, కొరడా రామకృష్ణ, కిషోర్ చలసాని, కోనేరు శ్రీనివాస్, తాళ్లూరి మురళీ, దొడ్డా సాంబ, పోలవరపు శ్రీకాంత్, మేకా రఘు, సూరపనేని రాజా, ప్రవాస తెలుగు ప్రముఖులు డా.సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్, డా.తోటకూర ప్రసాద్, ఐ.ఎ.ఎస్ అధికారులు విద్యానంద్, అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అంజనా సౌమ్య, రోహిత్ ల సంగీత విభావరి ఆకట్టుకుంది. ప్రవాస చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. 


Click here for Photogallery

Tags :