ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏం చేశారని మోడీకి మూడోసారి ఓటు వేయాలి: ప్రశ్నించిన సీఎం రేవంత్

ఏం చేశారని మోడీకి మూడోసారి ఓటు వేయాలి: ప్రశ్నించిన సీఎం రేవంత్

పదేళ్లుగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నరేంద్రమోదీ దేశానికి ఏం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ఎలాంటి కృషి చేయలేదని, ఒక్క అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని మండిపడ్డ రేవంత్.. ఏం చూసి మోదీకి మూడోసారి ఓటు వేయాలని ప్రశ్నించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్.. లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాలు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు. ఈ గెలుపు కాంగ్రెస్ వంద రోజుల పరిపాలనకు రెఫరెండమని రేవంత్ అన్నారు.

కేసీఆర్ పాలనలో ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేకపోయారని, వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలును తీసుకురాలేకపోయారని, అయితే ఈ సారి మన ఎంపీలు గెలిచి పార్లమెంటుకు వెళ్తే తెలంగాణను చక్కగా అభివృద్ధి చేసుకొగలమన్నారు. ఇక మోడీ పదేళ్ల పాలనను దుయ్యబడుతూ.. బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన ప్రధాని, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలును కూడా ఇవ్వలేదన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోదీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడుతూ.. "క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరికి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్‌కి దానం నాగేందర్‌ని అభ్యర్థులుగా పార్టీ ప్రకటించింద"న్నారు.

చివరిగా త్వరలో తుక్కుగూడలో జరగబోతున్న జాతీయస్థాయి బహిరంగ సభ గురించి వివరిస్తూ.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో రాష్ట్ర అభివృద్ధి కోసం 6 గ్యారంటీలను ప్రకటించుకున్నామని, ఇప్పుడు మరోసారి అక్కడే ఏప్రిల్ 6 లేదా 7వ తేదీల్లో జాతీయస్థాయి గ్యారంటీలు ప్రకటించుకోబోతున్నామని అన్నారు. "ఈ సారి జాతీయస్థాయి రాజకీయాలకు కూడా రంగారెడ్డి జిల్లా నుంచే దేశ శంఖారావం పూరించబోతున్నాం. 14 ఎంపీ స్థానాలు గెలిచి ఏఐసీసీ అగ్రనేత సోనియగాంధీకి కృతజ్ఞతలు చెబుదాం. పార్టీకి అండగా నిలబడి సోనియగాంధీ నాయకత్వానికి బలపరచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే ఈ జన జాతర సభకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వంటి పార్టీ అగ్ర నేతలంతా హాజరు కానున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :