ASBL NSL Infratech

స్వల్ప ఆధిక్యం దిశగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ....

స్వల్ప ఆధిక్యం దిశగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ....

పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు నెమ్మదిగా వెల్లడవుతున్నాయి. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ (PTI) పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తాము అధిక స్థానాల్లో గెలుస్తామని పీటీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పార్టీకి చెందిన మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన సొంత నియోజకవర్గంలో గెలుపుసాధించారు.

సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 266 స్థానాలకు గానూ 49కి పైగా స్థానాల్లో ఇమ్రాన్ పార్టీ పీటీఐ, 39 స్థానాల్లో నవాజ్ షరీఫ్ పార్టీ, 30 స్థానాల్లో బిలావల్ భుట్టో పార్టీ పీపీపీ గెలుపొందాయి. అయితే ఎన్నికల కమిషన్ తమ విజయాన్ని ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని పీటీఐ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో తమ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని ఇమ్రాన్‌ ప్రకటించారు. ఎన్నికల అధికారులు ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు తమ పార్టీ 150 నేషనల్‌ అసెంబ్లీ స్థానాలకు పైగా గెలుపొందినట్లు పీటీఐ ఛైర్మన్‌ గోహర్‌ ఖాన్‌ ప్రకటించుకున్నారు. పంజాబ్‌, కైబర్‌ ఫంఖ్తుంక్వాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉందన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించాలని ఈసీపీకి విజ్ఞప్తి చేశారు. జాప్యంపై పాక్‌ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్‌ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఓటింగ్‌ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్‌ కేర్‌టేకర్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని ఇంకా పునరుద్ధరించకపోవడం గమనార్హం. అయితే పాకిస్తాన్ పగ్గాలను త్వరలోనే నవాజ్ షరీఫ్ చేపడతారని .. ఆయన పార్టీనేతలు తెలిపారు.

పూర్తి వివరాలు రాగానే నవాజ్ .. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు. జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ పీటీఐ అధికారిక చిహ్నం క్రికెట్‌ బ్యాట్‌ను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకూ అనుమతి నిరాకరించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :