ఎడిసన్ లో మేము సైతం బాబు కోసం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుల్ని పెట్టారని విమర్శిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన తెలుగు కుటుంబాలు మేము సైతం బాబు కోసం అంటూ నినదించారు. ఎడిసన్‌లో జరిగిన ఆత్మీయ సమావేశానికి వణికించే చలిలోనూ 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుకు అవినీతి రంగు పులిమేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ మనుగడకే పరీక్షలాంటివి. టీడీపీ, జనసేన కూటమిని గెలిపించడానికి ప్రతి ప్రవాసాంధ్రుడు వెన్నుదన్నుగా నిలవాలి అని అన్నారు.
టీడీపీ, జనసేన కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్బంగా తీర్మానించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి మందడి, రమేశ్ నూతలపాటి, మోహన్ కుమార్, వంశీ వెనిగళ్ల, వెంకట్ సూడతో పాటు టీడీపీ, జనసేన పార్టీ అభిమానులు తదితరులు హాజరయ్యారు.