ASBL NSL Infratech

ఐటీ ఉద్యోగులపై వేటు ఖడ్గం...

ఐటీ ఉద్యోగులపై వేటు ఖడ్గం...

కోవిడ్ నుంచి ప్రారంభమైన అనిశ్చితి.. ఐటీ రంగంలో ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో సమర్థుడు కాని ఉద్యోగిని పిలిచి మాట్లాడేవారు. ఇంకా పనితీరు మెరుగపడకపోతే, వార్నింగిచ్చి చూసేవారు. ఆ తర్వాత ఇక చివరగా పింక్ స్లిప్ ఇచ్చేవారు. అయితే అప్పటికే ఆ ఉద్యోగి మానసికంగా సంసిద్ధుడయ్యేవాడు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా గ్రూపులుగా ఉద్యోగులను తొలగిస్తున్నారు.

ఐటీ ఉద్యోగుల తొలగింపు గత ఏడాది నుంచే మొదలైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని, కొత్త ప్రాజెక్టులతో, పెద్దఎత్తున నియామకాలతో మళ్లీ ఐటీ రంగం కళకళలాడుతుందని ఆశించినా, ఆ కల నిజం కాలేదు. గత ఏడాదిలో యూఎస్‌లో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. నిన్నటికి నిన్న స్నాప్‌ ఇంక్‌., అనే సంస్థ తన ఉద్యోగుల్లో 10 శాతాన్ని (దాదాపు 540 మంది) తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓక్తా ఇంక్‌. అనే మరొక సంస్థ 400 మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు గత నెలలో స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్‌ తన గేమింగ్‌ డివిజన్‌లో, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విభాగంలో, వీడియో గేమ్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ యూనిటీ సాఫ్ట్‌వేర్‌, మెసేజింగ్‌ అంకురం డిస్‌కార్డ్‌ ... వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.

‘కొవిడ్‌ పరిమాణాల్లో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేశాయి. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో పాటు అనుకోని విధంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అధిక వడ్డీరేట్లు, ఆర్థిక సమస్యలు వివిధ రంగాలను ఇబ్బంది పెడుతుండడంతో అవి ఐటీ ప్రాజెక్టులకు బడ్జెట్లు తగ్గిస్తున్నాయి. దీంతో ఆశించిన రీతిలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. మరోపక్క కృత్రిమ మేధ (ఏఐ) ఐటీ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని అందిపుచ్చుకోని పక్షంలో వెనుకబడిపోతామని ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటినీ ఏఐ వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ నైపుణ్యం లేని ఉద్యోగులను భారంగా కంపెనీలు భావిస్తున్నట్లు, ఆ ఉద్యోగుల స్థానంలో ఏఐ నైపుణ్యం కల వారిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఓ పక్క ఉద్యోగుల తొలగింపు అనివార్యం అవుతోంది. మరోపక్క ఏఐ, సంబంధిత విభాగాల్లో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మారితేనే మనుగడ...:

ఐటీ సాంకేతిక పరిజ్ఞానంలో వినూత్నమైన మార్పులు వస్తున్నట్లు, అందువల్ల ఇంతకు ముందు మాదిరిగానే సాధారణమైన ఐటీ సేవలు మాత్రమే అందించే ఐటీ కంపెనీలకు మనుగడ కష్టమని హైదరాబాద్‌లోని ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌, బ్లాక్‌చైన్‌ వంటి నూతన టెక్నాలజీలపై ప్రాజెక్టులు చేయగల సత్తా సమకూర్చుకోవటంతో పాటు ఐటీ పరిశోధన-అభివృద్ధికి పెద్దపీట వేసే కంపెనీలే దీర్ఘకాలంలో మనగలుగుతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సూత్రం ఐటీ ఉద్యోగులకూ వర్తిస్తుందని తమ తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.

ఇండియాలోనూ ..

మన దేశంలోనూ కాస్త అటూ ఇటుగా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐటీ నియామకాలు పెద్దగా లేకపోగా, కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. స్విగ్గీ 400 మంది ఉద్యోగులను(7%) తొలగించింది. ఇందులో కాల్‌ సెంటర్‌, టెక్‌, కార్పొరేట్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులున్నట్లు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా వలోరాంట్‌ అనే గేమ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ 500 మందికి పైగా ఉద్యోగులను తీసివేసింది. సేల్స్‌ఫోర్స్‌ తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 10 శాతాన్ని తీసివేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థకు మన దేశంతో పాటు వివిధ దేశాల్లో 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :