ASBL NSL Infratech

విడిపోకండి...కలిసి ఉంటేనే లాభం వెంకయ్య

విడిపోకండి...కలిసి ఉంటేనే లాభం వెంకయ్య

(చికాగో నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు)

తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని, ప్రాంతీయ వాదంతో విడిపోతే నష్టమని కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. చికాగోలో మూడురోజులపాటు జరగనున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) రజతోత్సవ సంబరాల్లో ఆయన ప్రసంగించారు. శుక్రవారం సాయంత్రం రోజ్‌మాంట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మహాసభల వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాంక్వెట్‌ విందుకు ఆయన ముఖ్య అతిధిగా  హాజరయ్యారు. తెలుగు వారసత్వాన్ని పరిరక్షించుకోవడంతోపాటు వివేకానందుని ఆదర్శాలను పాటించాలని కోరారు. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ, చంద్రబాబు నాయకత్వంలో ఎపి అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఐటీ పరిశ్రమలతో తెలంగాణ మెరుస్తుంటే, నూతన రాజధాని, కోస్తా తీరం, రైల్వే రవాణసౌకర్యాలతో ఎపి ముందుకువెళుతోందని చెప్పారు.

అమెరికాలోని తెలుగువాళ్ళు ఎన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నా, సంబరాలు చేసుకునే సమయంలో మాత్రం అందరూ ఒకే వేదికపైకి వచ్చి మన సంస్కృతీ, సాంప్రదాయాలను పాటించడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో మన సంస్కృతీ విలసిల్లజేస్తున్న అందరికీ నా అభినందనలని చెప్పారు. తెలుగువారంతా ఒక్కటే, భారతీయులందరూ ఒక్కటేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.

అమెరికాలో ఉన్నా మాతృరాష్ట్రాన్ని మరవకూడదన్నారు. కూచిపూడి, భరతనాట్యం వంటి కళలను స్వరాష్ట్రంలో ఉన్నవారికన్నా ఇక్కడ ఉన్నవారే ఎంతో మెరుగ్గా కాపాడుకుంటూ వస్తున్నారని కితాబిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో దేశం ప్రగతిపథంవైపు పయనిస్తోందని కూడా ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇల్లినాయి గవర్నర్‌ బ్రూస్‌రానర్‌ మాట్లాడుతూ, భారతదేశాన్ని ఇప్పుడు అన్నీ దేశాలు గమనిస్తున్నాయని చెప్పారు. ప్రపంచం చూపు ఇప్పుడు భారత్‌వైపే ఉందని అంటూ, భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్ళు కష్టజీవులని అన్నారు.

ఆటా మహాసభలకు ఇండియా నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయరంగం నుంచి జితేందర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, కె. కేశవరావు, వై.వి. సుబ్బారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాయిని నరసింహారెడ్డి, మల్లారెడ్డి, గంటా శ్రీనివాసరావు, ముళ్ళపూడి బాపిరాజు, రోజా సెల్వమణి, బిజినెస్‌ రంగం నుంచి గ్రంథి మల్లిఖార్జునరావు, ఆధ్యాత్మికరంగం నుంచి స్వామి పరిపూర్ణానందతోపాటు పలువురు ఈ మహాసభలకు వచ్చారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జంపాల చౌదరి, సతీష్‌ వేమన, జయరామ్‌ కోమటి, జయశేఖర్‌ తాళ్ళూరి, అంజయ్య చౌదరి, శ్రీనివాస్‌ గోగినేని, లక్ష్మీ దేవినేని వచ్చారు.

నాట్స్‌ నుంచి మోహన్‌ కృష్ణ మన్నవతోపాటు రావు లింగ, ఫణి రామినేని, కోటేశ్వరరావు బోదిపూడి, శ్రీధర్‌ కేసాని, ఫణిభూషణ్‌, శివ కృష్ణ మామిళ్ళపల్లి, శ్రీనివాస్‌ బాబు, నాగ సతీష్‌, గంగాధర్‌ రావు దేసు, సుధీర్‌ తిమ్మల తదితరులు హాజరయ్యారు.

ఆటా ప్రెసిడెంట్‌ సుధాకర్‌ పెర్కరీ, కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పాల్వాయి, కరుణాకర్‌ అసిరెడ్డితోపాటు ఆటా ప్రముఖులు, కమిటీ చైర్మన్‌లు మహాసభలను విజయవంతంగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.


Click here for Event Gallery

 

Tags :