ASBL NSL Infratech

తెలుగు ఎన్నారైలకు చక్కటి వేదిక ఎపిఎన్‌ఆర్‌టీ...

తెలుగు ఎన్నారైలకు చక్కటి వేదిక ఎపిఎన్‌ఆర్‌టీ...

ఎపిఎన్నారై అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్‌ రవి వేమూరు

అంగరంగ వైభవంగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు స్వయంగా వచ్చిన ఎన్నారైలు, ఈ వేడుకను టీవీల ద్వారా, ఇంటర్నెట్‌ ద్వారా వీక్షించి సంతోషాన్ని తెలియజేసిన ప్రపంచంలోని వేలమంది ఎన్నారైలకు పత్రికాముఖంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ ఎఫైర్స్‌, అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అడ్వయిజర్‌ రవి కుమార్‌ వేమూరు చెప్పారు.

దాదాపు 2 లక్షల మందికిపైగా ప్రజలు ఈ అమరావతి శంకుస్థాపనకు వచ్చారని, అందులో 20,000 మంది తెలుగు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు,  750 మంది ఎన్నారైలు ఉన్నారని ఆయన చెప్పారు. ఈ వేడుకలకు ఎన్నారైలను పిలవాలన్న తమ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడమే కాక, ఎన్నారైలకోసం ప్రత్యేకమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా ఎన్నారైల తరపున ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నట్లు రవి తెలిపారు. ఈ వేడుకల్లో తమ శాఖ కీలకంగా వ్యవహరించిందన్నారు. ఎన్‌ఆర్‌టీ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 28 దేశాల్లో ఉన్న దాదాపు 32వేల మందికిపైగా ఎన్నారైలకు తాము ఆహ్వానపత్రాలను పంపించామని, అందులో 2400 మంది తమ ఆహ్వానానికి స్పందించినట్లు చెప్పారు. వేడుకలకు వచ్చిన ఎన్నారైలకు నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో కార్‌పాస్‌లు, ఇతర పాస్‌లను అందజేయడంతోపాటు వారికి అవసరమైన సూచనలను మా వలంటీర్లు ఇచ్చారన్నారు. ప్రత్యేకంగా టీ షర్టులను, టోపీలను, హ్యాండ్‌బ్యాగ్‌లను కూడా ఎన్నారైలకు అందించినట్లు రవి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ఎన్నారైలు ఇప్పటికే కీలకపాత్రను పోషిస్తున్నారు. వారి సేవలను మరింతగా వినియోగించుకునేందుకు వీలుగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున ఎపిఎన్‌ఆర్‌టీని ఏర్పాటు చేశారు. దీనిద్వారా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడంతోపాటు, ఏ రంగాల్లో వారి భాగస్వామ్యం అవసరమో కూడా వారికి తెలియజెప్పే బాధ్యతలను ఈ విభాగంపై ఉంచారు. వారి సూచనల మేరకు తమ విభాగం పనులను ప్రారంభించిందని, ఇప్పటికే ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్న తెలుగు ఎన్నారైలకు ఈ విషయమై సమాచారాన్ని అందజేసే పనిని ప్రారంభిస్తున్నట్లు రవికుమార్‌ వేమూరు వివరించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎన్నారైలకు తమ విభాగం గురించి తెలియజేసేందుకు ఉపయోగించుకున్నామన్నారు.

ఎన్నారైల వివరాలను సేకరించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా, ఎన్నారైల డాటాను కలెక్ట్‌ చేయడమే కాక వారి సొంతూరు ఏమిటో ముందుగా తెలుసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో ఎన్నారైలు కూడా సహకరించి తమ వివరాలను ఎపిఎన్‌ఆర్‌టి డాట్‌ కామ్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలని రవికుమార్‌ వేమూరు కోరారు. తమకు అందిన సమాచారాన్ని తాము గోప్యంగా ఉంచుతామని, అభివృద్ధిపనులకోసమే ఈ డాటాను తాము ఉపయోగించుకుంటామని తెలిపారు. తమ పనులను మూడుగా విభజించుకున్నామని, తొలివిడతలో  టెంపుల్‌ టూరిజం కార్యకలాపాలను చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలలో ఎన్‌ఆర్‌టీలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించేందుకు వీలుగా దేవాలయాల అధికారులతో చర్చించడం ప్రారంభించామన్నారు. తిరుమల తిరుపతి దేనస్థానంతోపాటు ఇతర ముఖ్య పుణ్యక్షేత్రాల్లోని అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.

రెండవ విడతలో ఎన్నారైల ప్రయాణానికి సంబంధించి సహాయపడటం, సౌకర్యాలను సమకూర్చడం, ఎన్నారై తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు,   ఇలా ఎన్నో సేవలను అందించాలని నిర్ణయించాము. మూడవ విడతలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వారికి తెలియజేయడంతోపాటు ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభమో కూడా తెలియజేయనున్నాము. దానికి తోడు అన్నీ విషయాల్లోను మేము పారదర్శకతను పాటించడం వల్ల ఎన్నారైలకు ఇది నమ్మకమైన వేదికగా నిలుస్తుందన్న విశ్వాసం తమకుందని రవికుమార్‌ వేమూరు చెప్పారు.

మాకు సంబంధించిన వివరాలు, ఇతర విషయాలకోసం ఎపిఎన్‌ఆర్‌టీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

www.apnrt.com

 

Tags :