ASBL NSL Infratech

తానా మహాసభలలో శ్రీ శ్రీనివాస కల్యాణం

తానా మహాసభలలో శ్రీ శ్రీనివాస కల్యాణం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో నిత్యం ఎన్నో కార్యక్రమాలు స్వామివారికి జరుగుతుంటాయి. ఆ స్వామివారికి జరిగే ఉత్సవాల్లో ప్రముఖమైనది శ్రీనివాసుని కళ్యాణమే. ప్రతినిత్యం జరిగే ఈ కళ్యాణమహోత్సవంలో పాల్గొనేందుకు ఎంతోమంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు తరలివస్తుంటారు. అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి కళ్యాణసేవలో స్వయంగా పాల్గొని తరించాలని ఎంతోమంది భక్తులు కోరుకుంటారు. అలాంటి భాగ్యాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తన 22వ మహాసభల ద్వారా కల్పిస్తోంది.

వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగే తానా మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం వేడుకను కూడా తిరుమలలో జరిగే విధంగా ఆగమపద్ధతుల్లో సంప్రదాయంగా నిర్వహించేందుకు తానా కాన్ఫరెన్స్‌ కార్యవర్గం ఏర్పాట్లు చేసినట్లు అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. మహాసభల్లో జూలై 6వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకస్వాములతో ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. టీటీడి కళ్యాణం?ప్రాజెక్ట్‌ స్పెషల్‌ డ్యూటీ ఆఫీసర్‌ ఎల్‌. సుబ్బారాయుడుతోపాటు అర్చకులు, వేద పండితులు శ్రీధర్‌ పరాంకుశం, వెంకటేశన్‌, ప్రహ్లాదాచార్యులు, శరత్‌కుమార్‌ ఆచార్యులు, సుందర వరద శర్మ తదితరులు టీటీడి తరపున శ్రీనివాస కళ్యాణం?చేయించేందుకు వస్తున్నారు. తానా మహాసభల్లోనే కాకుండా మరో 3 చోట్ల కూడా శ్రీనివాస కళ్యాణంను నిర్వహిస్తున్నారు. జూలై 13న ఫిలడెల్ఫియాలో, జూలై 14న న్యూజెర్సిలో, జూలై 20న డల్లాస్‌లో శ్రీనివాస కళ్యాణంను నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భక్తిగీతాలను పాడేందుకు గాయనీగాయకులు కూడా వస్తున్నారు. సునీత, స్మిత, రామాచారి, నిహాల్‌ ఇందులో భక్తిగీతాలను పాడనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని అధ్యక్షుడు సతీష్‌ వేమన, శ్రీనివాసకళ్యాణం కమిటీ చైర్‌ లక్ష్మీదేవినేని, ఆధ్యాత్మిక కమిటీ చైర్‌ సుబ్బు వారణాశి కోరుతున్నారు.

తానా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులు మహాసభలకు తరలివస్తున్నారు. జ్యోతిష్య నిపుణుడు డా. శంకరమంచి రామకృష్ణశాస్త్రి, ఆధ్యాత్మిక గురు స్వామి పరిపూర్ణానంద, సిద్ధయోగ నిపుణురాలు భువనగిరి సత్య సింధుజ తదతిరులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు.

తానా మహాసభల వేదికపై అన్నమయ్య సప్తగిరి సంకీర్తన గళార్చన పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. జూలై 6వ తేదీన మహాసభల వేదికపై జరిగే ఈ కార్యక్రమంలో గురు చైతన్య సోదరులతోపాటు 108 మంది కళాకారులు పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను గానం చేయనున్నారు.

 

Tags :