ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాటాకు భారీ విరాళమిచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డి

నాటాకు భారీ విరాళమిచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డి

ఫిలడెల్ఫియాలో జూలై 6 నుంచి మూడురోజులపాటు జరిగిన మహాసభల్లో సేవా గుణ సంపన్నుడు, పలు కార్యక్రమాలకు చేయూతనందిస్తున్న ఒంగోలు మాజీ ఎంపి, టీడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నాటాకు విరాళం ఇవ్వడం ద్వారా సరికొత్త సంప్రదాయానికి నాంది పలికి సంచలనం సృష్టించారు. అమెరికాలోని ఓ తెలుగు సంఘానికి బయటివ్యక్తి విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి. తొలిసారిగా నాటాకు ఒక లక్ష యూఎస్‌ డాలర్లను విరాళం ఇవ్వడం ద్వారా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ ఘనతను సాధించారు.

ఇక్కడి తెలుగువారు ఓవైపు వృత్తిలో రాణిస్తూనే, మరోవైపు సేవా కార్యక్రమాల్లో, అసోసియేషన్‌లు నిర్వహిస్తున్న వేడుకల్లో ముమ్మరంగా పాల్గొనడం అభినందనీయమని శ్రీనివాసులు రెడ్డి అంటూ, తాను ఇంతకుముందు అమెరికాకు వచ్చినప్పటికీ ఏ అసోసియేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనలేదని తొలిసారిగా డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి ఆహ్వానం మేరకు తాను నాటా మహాసభలకు వచ్చానని, తాను దిగిన హోటల్‌ వద్ద ఎక్కడ చూసినా తెలుగు మాటలే తనకు వినిపించాయని అంటూ మనవాళ్ళు ఎక్కడ ఉన్నా తెలుగు భాషను మరవకుండా మాట్లాడటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. మహాసభలకు వచ్చిన ఆడవాళ్ళు తమ ఇంటి వేడుకల్లో పాల్గొంటున్నట్లు సంప్రదాయమైన చీరలతో, ఆభరణాలను ధరించి రావడం ఇంకా సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు.

తనను ఈ వేడుకలకు పిలిచి సత్కరించిన నాటా చైర్మన్‌, డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డికి, ప్రెసిడెంట్‌ రాజేశ్వరర్‌ రెడ్డికి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ రాఘవరెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకలకు వచ్చిన నాటా కుటుంబానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి ఈ మహాసభల నిర్వహణకోసం తీసుకున్న చర్యలు అద్భుతమని అన్నారు. నాటా స్వాగతగీతం చాలా బాగుందని ప్రశంసించారు. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి ఎన్నో అసోసియేషన్‌ కార్యక్రమాలకు హాజరయ్యేవారని ప్రేమ్‌సాగర్‌ రెడ్డి చెప్పారని, కానీ తాను ఇన్నాళ్ళు ఇలాంటి అద్భుతమైన వేడుకలకు ఎందుకు హాజరుకాలేకపోయానని బాధపడుతున్నానని చెప్పారు.  మా అన్నగారు మహాదాతగా పేరు గాంచారు. తరువాత రాజకీయ నాయకునిగా మారారు. ఆయన చూపిన మార్గంలోనే మేము పయనిస్తున్నాము. ఆ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు భగవంతుని ఆశీర్వాదం మాకు లభించింది. పలువురి పెద్దల సహకారంతో సేవా కార్యక్రమాలను మాగుంట ఫ్యామిలీ తరపున నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.

నాటా వేడుకలను చూసిన తరువాత మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను విన్న తరువాత స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి పేరుతో లక్ష యుఎస్‌ డాలర్లను నాటాకు విరాళంగా ఇస్తున్నానని, దాంతోపాటు మీరు చేస్తున్న కార్యక్రమాలకు మాగుంట ఫ్యామిలీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు.

అమెరికాలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో నాటా నిర్వహించే కార్యక్రమాల్లో మాగుంట కుటుంబం మద్దతుగా నిలుస్తుందని ఆయన చెప్పారు. రాజేశ్వర్‌ రెడ్డి తనతో మాట్లాడుతున్నప్పుడు ఓ విషయాన్ని చెప్పారని, తాము అన్నీరంగాల్లో ఉన్నప్పటికీ అమెరికా రాజకీయరంగంలో మాత్రం లేమని చెప్పారు. ఆ కొరతను తీర్చే బాధ్యత సెకండ్‌ జనరేషన్‌పైనే ఉంది. ఇప్పటికే కొంతమంది ప్రవాస భారతీయులు అమెరికా రాజకీయరంగంలో ప్రవేశించారు. ఇంకా ఎక్కువమంది రాజకీయాల్లోకి వచ్చి తెలుగువారి సత్తాను చాటాలని ఆయన కోరారు. మాగుంట కుటుంబం చేస్తున్న సేవలను గుర్తించి నన్ను ఆహ్వానించి సత్కరించినందుకు నాటా పెద్దలకు మరోసారి ధన్యవాదాలను తెలియజేస్తున్నానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.

Click here for Photogallery

Tags :