ASBL NSL Infratech

జన్మభూమి పనులను సమీక్షించిన జయరాం కోమటి

జన్మభూమి పనులను సమీక్షించిన జయరాం కోమటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నారైల విరాళంతో చేపట్టిన జన్మభూమి పనుల వివరాలను విజయవాడలో జరిగిన సమావేశంలో అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి సమీక్షించారు. జన్మభూమి  సేవాకార్యక్రమాలపై రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్‌ రామాంజనేయులుతో కలిసి ఆయన  పంచాయితీరాజ్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల సహకారంతో 70:30 నిష్పత్తిలో జరుగుతున్న శ్మశానాల అభివృద్ధి పురోగతిపై జిల్లాల వారిగా సమీక్ష నిర్వహించి పనులు త్వరగతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, ప్రశాకం జిల్లాలకు  సంబంధించి 334 డిజిటల్‌ తరగతులు మంజూరు అయ్యాయని, అవి ఎప్పటిలోగా ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో వాడుకలోకి వస్తాయని అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రానున్న నాలుగు ఐదు రోజుల్లో పూర్తి చేయాలని, ఈ ఐదు జిల్లాలలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ఉత్తర అమెరికా ఎన్నారైల బృందం పర్యటిస్తుందని చెప్పారు.  రాష్ట్రంలోని అన్ని పంచాయితీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు తమ వంతు సహాయం అందించేందుకు ఎన్నారైలు సుముఖత వ్యక్తం చేశారని ఆయన వివరించారు. జయరాం కోమటి ఆధ్వర్యంలో జరుగుతున్న 3 సంక్షేమ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంంలో జాయింట్‌ కమిషనర్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల సహకారంతో చేపడుతున్న అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కోమటి జయరాం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్‌ఆర్‌ఐ సెల్‌ లో కో ఆర్డినేటర్‌లను కూడా నియమించామని తెలిపారు. వీరందరూ సంబందిత జిల్లాలో జరుగుతున్న ఎన్‌ఆర్‌ఐల కృషితో చేపడుతున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వేగవంతం  చేయడానికి పనిచేస్తారని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ యాప్‌ ద్వారా ప్రతిగ్రామంలో ఉన్న ప్రవాసాంధ్రులను వారి వారి గ్రామాలకు అనుసంధానం చేసే ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. సంబంధిత జిల్లా మండల స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోని ప్రవాసాంధ్రుల వివరాలను అతి త్వరలో సేకరించాలని కోరారు.

జయరాంకోమటి మాట్లాడుతూ తనతోపాటు చాలామంది ఎన్నారైలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అమెరికాలో స్థిరపడ్డారని చెప్పారు. తనతోపాటు 5 లక్షల కుటుంబాలు అమెరికాలో  జీవిస్తున్నారని, వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కావటం గర్వకారణమన్నారు.  నవ్యాంధ్ర నిర్మాణాంలో భాగస్వాములు కావడానికి తాము ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నామని, ఎటువంటి ఆర్థిక సాయం చేయడానికి అయినా వెనుకాడబోమని సృష్టం చేశారు. ఎటువంటి సేవా కార్యాక్రమాల్లోనైనా అధికారులు కీలక పాత్ర పోషిస్తారని. తాము చేపట్టిన కార్యక్రమాల్లో అధికారులు విరివిగా పాలుపంచుకోవాలని అభ్యర్ధించారు. ఈ సమావేశంలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :