ASBL NSL Infratech

నాట్స్‌ తెలుగు సంబరాలకు గంగాధర్‌ శాస్త్రి

నాట్స్‌ తెలుగు సంబరాలకు గంగాధర్‌ శాస్త్రి

నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) ‘అమెరికా తెలుగు సంబరాలు -2023’ పేరుతో మే 26,27,28 తేదీలలో న్యూజెర్సీలో సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తోంది. ఇందులో తొలి రోజు కార్యక్రమంగా ‘ఘంటసాల శతజయంతి’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్‌ వి గంగాధరశాస్త్రిని ‘ఘంటసాల శతజయంతి విశిష్ట పురస్కారం’తో సత్కరించనున్నారు.

ఇండియా పర్యటన సమయంలో నాట్స్‌ సంబరాల కమిటీ కన్వీనర్‌ శ్రీధర్‌ అప్పసాని, కో కన్వీనర్‌ రాజశేఖర్‌ అల్లాడ, ఈటీవీ ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ దర్శకులు అనిల్‌ కడియాలలు గంగాధర శాస్త్రిని హైదరాబాద్‌ లోని భగవద్గీతా ఫౌండేషన్‌ కార్యాలయంలో కలిసి సంబరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఘంటసాల గాన వైభవాన్ని దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ, ఆయన ప్రారంభించిన భగవద్గీతను పూర్తి చేస్తూ, 9 సంవత్సరాల పరిశోధనాత్మక కృషి చేసి, స్వీయ సంగీతంలో సంపూర్ణంగా గానం చేసి, రికార్డు చేసి, తనకు స్ఫూర్తినిచ్చిన ఘంటసాలకు అంకితం చేస్తూ విడుదల చేసి, అంతటితో తన పని పూర్తి అయిపోయిందని భావించకుండా, స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన తొలి భారతీయ గాయకుడిగా గంగాధరశాస్త్రికి  ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు వారు చెప్పారు.

భగవద్గీత పఠనం.. వ్యక్తిత్వ వికాసానికి సోపానం

మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన జ్ఞానోపదేశమే భగవద్గీత. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న వ్యక్తిత్వ వికాస గ్రంథాలకు మాతృక అదే. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంతో దెబ్బతింటున్న మన సమిష్టి విలువలను సంరక్షించేంది భగవద్గీత ఒక్కటే ఆని భగవద్గీతా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్‌.వి.గంగాధరశాస్త్రి తెలుగుటైమ్స్‌తో మాట్లాడుతూ చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో మన సంస్కృతిని మరచిపోతూ నిస్సారమైన జీవితానికి అలవాటు పడుతున్న నేటితరానికి ‘భగవద్గీత’ పఠనం ఎంతో ముఖ్యమని అంటూ, భగవద్గీత  విశ్వవిద్యా లయ స్థాపనే తన అంతిమ లక్ష్యమమని చెప్పారు.

కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన లక్కావరుల కాశీవిశ్వనాథశర్మ-శ్రీలక్ష్మి దంపతులకు జన్మించిన గంగాధర శాస్త్రి చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ చూపారు. ఘంటసాలను ఆయన చూడక పోయినా ఆయన్నే గురువుగా భావించుకుని ఆయన పాటలనే స్ఫూర్తిగా తీసుకుని గాయకుడిగా ఎదిగారు. హైదరాబాద్‌ మ్యూజిక్‌ కాలేజీలో ఐదేళ్ళు కర్ణాటక సంగీతం అభ్యసించిన తరువాత ప్రముఖ దినపత్రిలో జర్నలిస్టుగా పనిచేశారు. ఎన్ని ఉద్యోగాలు చేసినా గాయకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో అందరికీ ఎంతో ఉపయోగపడే భగవద్గీతను ప్రచారం చేయాలని అనుకున్నారు. అనుకున్నడే తడవుగా ఈ దిశగా ఆయన ప్రయత్నం చేశారు.

సంపూర్ణ భగవద్గీతా గానం

ఘంటసాల భగవద్గీతా గానంతో తెలుగు సమాజంపై  తనదైన ముద్ర వేశారు. 70వ దశకంలో ఆయన ఏడాది కృషితో 106 శ్లోకాలు ఆలపించారు. సంపూర్ణ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ గాయకుడూ సంపూర్ణ గీతాగానం చేయలేదు. శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద ఆశీస్సులతో సంపూర్ణ భగవద్గీతా గానం ప్రాజెక్టును గంగాధరశాస్త్రి  ప్రారంభించారు. ఈ విషయంలో రచయిత భారవి  ఆయనకు స్ఫూర్తినిచ్చారు. 2006లో అక్కినేని, మురళీమోహన్‌, రాఘవేంద్రరావు వంటి కొద్ది మంది ప్రముఖుల ఆశీర్వాదాలతో ప్రాజెక్టును ఆయన చేపట్టారు. పుల్లెల శ్రీరామచంద్రుదు వంటి గొప్ప పండితుల సహాయంతో ఉచ్చారణ దోషాలు దిద్దుకుంటూ స్వర ప్రామాణికత సాధనకు కొన్ని వందలసార్లు ఈ శ్లోకాలను ఆయన  ఆలపించారు. భగవద్గీత దేవనాగరిలిపిలో ఉన్నందువల్ల తక్కువమంది అర్థం చేసుకోగలుగుతున్నారు. అందుకే తాత్సర్య సహితంగా దానిని గానం చేసి అందరికీ అర్థమయ్యేలా కృషి చేశారు. ఘంటసాల సతీమణి సావిత్రిగారు కూడా ఆయన శ్లోకాలు విని తన జన్మ తరించిందని వ్యాఖ్యానించడం విశేషం.

మ్యూజికల్‌ మెడిటేషన్‌

శ్రోత కళ్ళు మూసుకుని వింటుంటే శ్రీకృష్ణార్జున సంవాదం ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన దీనికి జోడించారు. శ్లోకం అంతర్యానికి తగినట్టు, వినే శ్రోతకు మ్యూజికల్‌ మెడిటేషన్‌ అనిపించేలా 72 మేళకర్త  రాగాలు, వాటి జన్యు రాగాల సహాయంతో కర్ణాటక, హిందుస్థానీ, శాస్త్రీయ లలిత, జానపద, పాశ్చాత్య సంగీత పద్దతులు మేళవించి, వాయిస్‌ ఫ్రీక్వెన్సీ సమతుల్యం చేసుకుంటూ స్వీయ సంగీత సారధ్యంలో ఒక మ్యూజికల్‌ మెడిటేషన్‌గా ఈ భగవద్గీత ప్రాజెక్టును తీర్చిదిద్దినట్లు గంగాధర శాస్త్రి తెలిపారు. ఈ 700 శ్లోకాలలో రిపీటైన రాగాలు చాలా తక్కువ. ఇదొక మ్యూజిక్‌ మెలొడీ. 150 మంది వాద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, పండితులు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహాత్ముల  ఆశీస్సులు, భగవద్బంధువుల సహకారంతో 2014లో రికార్డింగ్‌, 2015లో అవిష్కరణ కార్యక్రమాలను ఆయన పూర్తి చేశారు. భగవద్గీత శ్లోకాలను ఘంటసాలగారు ఆలపించిన ప్పుడు ఆయనకు సహకరించిన నలుగురు నిపుణులు ఈ  ప్రాజెక్టుతో పాలుపంచుకోవడం విశేషం.

భగవద్గీత లేకపోతే ప్రపంచ వాజ్మయం పరిపూర్ణం కాదన్నాడు జర్మనీ మేధావి ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌.  ప్రపంచం ఆ స్థాయిలో భగవద్గీతను అర్థం చేసుకుంటుంటే, మన తెలుగువారు మాత్రం దీనిని చావు క్యాసెట్‌గా, మరణగీతగా మార్చేస్తున్నారు. ఎవరైనా మరణించినప్పుడు ఘంటసాల గీతాన్ని నేపథ్య గానంగా ఉపయోగిస్తున్నారు. దయచేసి అలా చేయవద్దని ఆయన కోరుతున్నారు. ఎందుకంటే భగవద్గీతలో ప్రతీశ్లోకం మనిషిని ప్రస్తుత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేందుకు దోహదం చేస్తుంది. అందుకే గీతను మించిన ముక్తిమార్గం, మాతాతీ తమైన గ్రంథం లేవు. అలాగే శ్రీకృష్ణుణ్ణి మించిన సోషలిస్టు ఈ భూమ్మీద మరొకరు లేరని ఆయన పేర్కొంటారు. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించు కుంటావో, అంత సమానంగా సృష్టిలోని 84లక్షల జీవరాశులను ప్రేమించాలనీ, నాది, నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టమనీ, చెప్పేది భగవద్గీత. అదే భారతీయతత్వం.సమాజంలో నైతిక విలువలను వృద్ధి చేయడంలో గీతను మించిన మరో మార్గం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో సుడిగాలిలో దీపంలా రెపరెపలాడుతున్న మన సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మాన్ని శ్రీకృష్ణుని గీతా బోధనలే రక్షిస్తాయని చెబుతున్నారు.

ఎన్నో అవార్డులు...బిరుదులు

గంగాధర శాస్త్రి ఆలపిస్తున్న భగవద్గీత గానం ఎంతోమందిని మెప్పించింది. ఎన్నో సంస్థలు కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆయనకు అవార్డులను బిరుదులను అందజేశాయి.

భగవద్గీత యూనివర్సిటీ

సేవ లేకపోతే ఆధ్మాత్మికతకు పరిపూర్ణత్వం లేదు. ఆ సంకల్పంతోనే భగవద్గీతా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు గంగాధర శాస్త్రి వివరించారు. భగ వద్గీతలో ఏముందో ప్రతి పిల్లవాడికీ తెలియాలి. ఆ మార్గంలోనే నా జీవితాన్ని పునీతం చేసుకోవాలని నిర్ణయించు కున్నాను. తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత విశ్వవిద్యా లయం స్థాపనే నా లక్ష్యం.  ఒక ఆధ్మాత్మిక, సామా జిక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దాలి. ప్రపంచ వ్యక్తిత్వ వికాస గ్రంధాలన్నింటికీ మాతృక భగవద్గీత. అందుకే కాలేజీలు, పాఠశాలల్లో గీతాసారాంశాన్ని అందులోని భావప్రకటనా నైపుణ్యాలను వివరిస్తూ విద్యార్థుల్ని జాగృతం చేస్తున్నానని ఆయన తెలిపారు.  గీత తత్వాన్ని  గురించి విస్తృత ప్రచారం, అధ్యయనం, పరిశోధనలు జరగాలి. వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి దీన్ని ప్రభుత్వం  అనువదింప జేయాలి. పిల్లల పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చేలా అందరూ కృషి చేయాలని ఆయన కోరుతున్నారు.

అమెరికాలో కూడా భగవద్గీత ప్రచారాలు

అమెరికాలో కూడా గంగాధర శాస్త్రి భగవద్గీత ప్రచారాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ లో స్థాపించిన ‘భగవద్గీతా ఫౌండేషన్‌’ కు అనుబంధంగా న్యూజెర్సీలో ‘గీతా ఫౌండేషన్‌’ను రమేష్‌ అనుమోలు సహకారంతో ఏర్పాటు చేశారు. నాట్స్‌ సంబరాలకు వస్తున్న గంగాధర శాస్త్రి అమెరికాలో కూడా గీతా ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఇతర వివరాలకోసం సంప్రదించండి.

USA: C/o. Dr. Radhakrishna Tamirisa
Ph: +1 (858)349-6888,San Diego
C/o. Dr. YuvrajPolavaram
Ph: +1 (919) 559-6141, North Carolina
C/o Sri Ramesh Anumolu,
Ph: +1 (408) 829-5165, New Jersey
Website: www.bhagavadgitafoundation.org

E-mail: gitafoundation2008@gmail.com

India phone: 9030756555

 

 

Tags :