ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సాయి దత్త పీఠంలో వైభవంగా దసరా వేడుకలు

సాయి దత్త పీఠంలో వైభవంగా దసరా వేడుకలు

అమెరికాలో బతుకమ్మ ఆడిన తెలుగు మహిళలు

అమెరికాలో  భారతీయ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీ సౌత్ ప్లయిన్ఫీల్డ్ లోని సాయి దత్తపీఠంలో నవరాత్రుల వేడుకలను భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. తొమ్మది రోజులు తొమ్మిది అలంకారాలతో పాటు, అమ్మ వారికి లక్ష కుంకుమార్చన, చండీ హోమం, బాబా పుణ్య తిధి, లక్ష పుష్పార్చన తో పాటు మొత్తం గా 11 రోజుల పాటు...ఒక్కో రోజు ఒక్కో అలంకారం తో  ఆ దేవి అమ్మవారి దర్శన భాగ్యాన్ని సాయిదత్త పీఠం కల్పించింది. ప్రతి రోజు దేవి కలశ పూజ, దేవీ సహస్ర నామ పూజ, చండీ సప్త శతీ పారాయణ, అమ్మవారికి, బాబాకు అఖండ హారతి, శ్రీ చక్రానికి శ్రీసూక్తంతో అభిషేకం, విష్ణు సహస్ర నామ పరాయణ, సామూహిక కుంకుమార్చన, లలితా సహస్ర నామ పారాయణ, దూప హారతి, షేజ హారతి, ఘార్భా, దేవీ మాతకు హారతి లాంటి కార్యక్రమాలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

నవరాత్రుల సందర్భంగా ఏర్పాట్లు, భక్తి రస, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. భక్తి గీతాలతో సాయి దత్త పీఠం మారుమ్రోగిపోయింది. అఖిల జగాలకు అమ్మవు నీవు అంటూ ఆ అఖిలాండేశ్వరీ భక్తులు తొమ్మిదిరోజులు ఎంతో భక్తితో కొలిచారు.  బతుకమ్మ ఉత్సవాలను కూడా సాయి దత్త పీఠం ఘనంగా నిర్వహించింది. పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మన తెలుగు మహిళల అంతా బతుకమ్మ పాటలు పాడారు. అమెరికాలో అచ్చ తెలుగు ఆధ్యాత్మిక పాటలను పాడారు. స్థానిక సాంస్కృతిక సంస్థలు, కళా శిక్షణ సంస్థలు సాయి దత్త పీఠంలో ఏర్పాటు చేసిన నృత్య రూపకాలు,  గాన విభావరిలకు చక్కటి స్పందన లభించింది. దసరా విశిష్టతను తెలిపేలా వేసిన నృత్య రూపకాలు అద్భుతం.. అపూర్వం అనేలా సాగాయి. హిందువుల పండుగలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న సాయి దత్త పీఠం.. దసరా వేడుకలను కూడా అద్భుతంగా నిర్వహించింది. చివరగా, అమ్మవారికీ, బాబా కీ పల్లకీ సేవ లో వందలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. 

విజయదశమి, బాబా పుణ్య తిధి నాడు అహర్నిశలూ బాబా సచ్చరిత్ర పారాయణలో భక్తులు పాల్గొన్నారు.

ఆఖరి రోజున భక్తులకు సాయి బాబా వేష ధారణలో ప్రముఖ సినీ నటుడు విజయచందర్ విచ్చేసి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు.  ఆయన చేతులమీదుగా భక్తులకు జరిగిన అన్న ప్రసాదం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. అందరూ బాబా రూప ధారణలో ఉన్న విజయచందర్ తో ఫోటోలు దిగి పరవశానికి లోనయ్యారు. 

 

Tags :