ASBL NSL Infratech

నంద్యాల: మూడేళ్ళలో తీవ్రపోటీ, సెంటిమెంట్‌ అస్త్రంతో భూమా, బిసి కార్డుతో కాంగ్రెస్

నంద్యాల: మూడేళ్ళలో తీవ్రపోటీ, సెంటిమెంట్‌ అస్త్రంతో భూమా, బిసి కార్డుతో కాంగ్రెస్

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడ తన అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్థానం నుండి బిసి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రంగం సిద్దం చేస్తోంది.ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల తర్వాత అత్యధిక ఓట్లు బిసిలకే ఉన్నాయి. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో తమకు కలిసిరానుంది బిసి అభ్యర్థిని కాంగ్రెస్ రంగంలోకి దింపనుంది. మరో వైపు సెంటిమెంట్‌ను టిడిపి తెరమీదికి తీసుకువచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఈ ఏడాది ఆగష్టు 23వ, తేదిన ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు ఎత్తులకు పై ఎత్తులను వేస్తున్నాయి.

ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి ఈ రెండు పార్టీలు. అయితే ఈ స్థానం నుండి పోటీచేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ కూడ సన్నాహలు చేసుకొంటుంది.

నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీచేయకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని కర్నూల్ మాజీ ఎంపి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన వెంటనే తాము కూడ ఈ స్థానం నుండి పోటీచేస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు.

బిసి అభ్యర్థిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ యోచన

నంద్యాల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడ పోటీచేయాలని ఎట్టకేలకు నిర్ణయం తీసుకొంది. అయితే ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారీటీలు అత్యధికంగా ఓటర్లుగా ఉన్నారు. వారి తర్వాత బిసిల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీన్ని గమనంలోకి తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుండి బిసి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. బిసి అభ్యర్థిని బరిలోకి దింపితే సామాజిక సమీకరణాలతో రాజకీయంగా కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది.

ఉప ఎన్నికల్లో నంద్యాలలోనే తీవ్రమైన పోటీ

2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ఆకస్మిక మరణాలతో జరిగిన ఉప ఎన్నికల్లో ఇంత స్థాయిలో పోటీ జరగలేదు. చనిపోయిన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు పోటీచేసిన సమయాల్లో అధికార, విపక్షాలు పరస్పరం అవగాహనతో పనిచేశాయి. పోటీకి దూరంగా ఉన్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా ప్రయత్నాలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో రోడ్డు ప్రమాదంలో ఆనాడు వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శోభా నాగిరెడ్డి మరణిస్తే ఆ స్థానంలో టిడిపి పోటీకి దింపలేదు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మరణించిన సమయంలో టిడిపి ఆయన సతీమణిని బరిలోకి దింపింది. అయితే ఆ స్థానంలో వైసీపీ పోటీకి దింపలేదు. ఈ ఏడాది మార్చి12వ, తేదిన భూమా నాగిరెడ్డి మరణించాడు. అయితే భూమా కుటుంబసభ్యులు పోటీలో ఉన్నందున పోటీకి దూరంగా ఉండాలని వైసీపీని టిడిపి కోరింది. అయితే వైసీపీ మాత్రం తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఉప ఎన్నికల్లో ఇంత తీవ్రమైన పోటీ నంద్యాలలోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వారంతా రాజకీయాలకు కొత్త

టిడిపి తరపున బరిలో ఉన్న భూమా బ్రహ్మనందరెడ్డి రాజకీయాలకు కొత్త. అయితే ఆ కటుంబానికి రాజకీయాలతో సంబంధాలున్నాయి. మరోవైపు ఆయన సోదరి, టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రయ కూడ మూడేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు.శోభానాగిరెడ్డి మరణంతో ఆమె అనివార్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే ఆ సమయంలో నాగిరెడ్డి బతికున్నందున ఆమెకు అంతగా ఇబ్బందులు లేవు. అయితే నాగిరెడ్డి కూడ మరణించడంతో ఆ కుటుంబానికి ఇబ్బందిగా మారింది.అయితే టిడిపి నాయకత్వం కీలకమైన నేతలను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ స్థానంలో ఎన్నికల నిర్వహణ కోసం పంపింది. మరో వైపు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి రాజకీయాల్లో అనుభవం ఉంది. నెల క్రితం వరకు ఆయన టిడిపిలోనే కొనసాగారు. గతంలో ఈ స్థానం నుండి ఆయన ఎమ్మెల్యేటా ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడ పనిచేశారు ఈ అనుభవం ఆయనకు కలిసిరానుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

సెంటిమెంట్ అస్త్రం

తల్లిదండ్రులన కోల్పోయిన భూమా ఫ్యామిలీ ఈ అంశాలను ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారస్థ్రాలుగా ఉపయోగించుకొనే అవకాశాలు లేకపోలేదు. తల్లిదండ్రులు లేని బిడ్డలపై పోటీచేయడం సహేతుకమేనా అంటూ ఏపీ సిఎం చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఆళ్ళగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను తాను తల్లిదండ్రులుగా భావిస్తానని అఖిలప్రియ ప్రకటించింది.అయితే ఈ సెంటిమెంట్ అస్త్రాలను భూమా ఫ్యామిలీ ప్రచారం చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

క్యాడర్‌ను కాపాడుకొనేందుకే

2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతింది. కొన్ని స్థానాల్లో మినహ అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయం మేరకు ఓటర్లు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చారు. ఈ తరుణంలోనే ఎన్నికల ముందు, ఆ తర్వాత కీలక నేతలు ఆ పార్టీని వీడారు. మరోవైపు పార్టీని రాష్ట్రంలో పునర్నిర్మించే పనిలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. అయితే ఇందులో భాగంగానే నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొందని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

 

Tags :