ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చంద్రబాబు పిలుపుకు స్పందించిన పెట్టుబడిదారులు

చంద్రబాబు పిలుపుకు స్పందించిన పెట్టుబడిదారులు

అమెరికాలో సెప్టెంబర్‌ 23 నుంచి 27 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పర్యటన సత్ఫలితాలను ఇచ్చింది. తన పర్యటనలో ఆయన పలువురితో సమావేశమయ్యారు. చివరిరోజున భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.

టెలికాం రంగంలో అగ్రగామిగా భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎయిర్‌టెల్‌) ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సరికొత్త రంగాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో పర్యాటక రంగానికి వున్న ప్రాధాన్యం దృష్ట్యా ఆథిధ్యరంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు భారతీ గ్లోబల్‌ ఆసక్తి కనబరిచింది. లండన్‌కు చెందిన ఎన్నిస్‌ మోర్‌(Ennismore) కంపెనీ భాగస్వామ్యంతో ఇప్పటికే యూకే, యూరప్‌, యుఎస్‌లలో ఆతిధ్య రంగ వెంచర్లపై పెట్టుబడులు పెట్టినట్టు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు సునీల్‌ మిట్టల్‌ ఆధ్వర్యంలోని భాగస్వామ్య సంస్థ ఫీల్డ్‌ ఫ్రెష్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. మిర్చి, మొక్కజొన్న పంటల ఉత్పత్తులు గణనీయంగా సాధిస్తున్న ఏపీలో ఇందుకు సంబంధించి ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయడం రాష్ట్రంలోని రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సునీల్‌ మిట్టల్‌తో ముఖ్యమంత్రి అన్నారు.

డెల్‌ మోంటే పసిఫిక్‌ లిమిటెడ్‌తో కలిసి భారతి ఎంటర్‌ప్రైజెస్‌ ఫీల్డ్‌ ఫ్రెష్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌ నిర్వహిస్తోంది. డెల్‌ మోంటే బ్రాండ్‌ పేరుతో ఆహార, పానీయ ఉత్పత్తులను భారత్‌ సహా సార్క్‌ దేశాలలో విక్రయిస్తోంది. ప్రధానంగా మొక్కజొన్న, మిర్చి ఎగుమతులను యుకే, పశ్చిమ ఐరోపా దేశాలకు చేస్తోంది.

ఇంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే సాఫ్ట్‌ బ్యాంక్‌, ఫాక్స్‌ కాన్‌ గ్రూపులతో కలసి పునరుత్పాదక ఇంధనోత్పత్తి రంగంపై భారతి గ్రూపు పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి సునీల్‌ మిట్టల్‌ తీసుకువచ్చారు. 350 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వామిగా వున్నందుకు సునీల్‌ మిట్టల్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి మరిన్ని రంగాలకు పెట్టుబడులు విస్తరించాలని ఆకాంక్షించారు. 

విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీలో 'వాట్సన్‌' పెట్టుబడులు

విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీలో డేటా అనలిటిక్స్‌, ఆపరేషనల్‌ రీసెర్చ్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వాట్సన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రిని కలిసిన వాట్సన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ బిజినెస్‌ హెడ్‌ శామ్‌ కల్యాణం ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, బ్లాక్‌ చెయిన్‌, ఫ్రాడ్‌ రెగ్యులేటరీ కంప్లెయన్స్‌ ఆధారిత ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడతామని శామ్‌ కల్యాణం ముఖ్యమంత్రికి తెలిపారు.

అమెరికాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందంలో మంత్రులు యనమల రామకష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌, సమాచార శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌, ఇంకా పలువురు అధికారులు ఉన్నారు.

Tags :