ASBL NSL Infratech

హెలీ టూరిజంపై ప్రత్యేక దృష్టి

హెలీ టూరిజంపై ప్రత్యేక దృష్టి

ఏపీ పర్యాటకశాఖ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా హెలీ టూరిజం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు అహ్లాదాన్ని, అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం నిర్వహించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో ఓ కార్పొరేట్ సంస్థ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా హెలీ టూరిజం ప్రారంభమైంది. అమరావతి, ప్రపంచ దేశాలను ఆకర్షించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొలువుతీరి ఉండే తిరుపతి ప్రాంతంలో కూడా హెలీ టూరిజం నిర్వహణకు పర్యాటకశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం అవసరమైన స్థలాన్ని ఇప్పటికే తిరుపతి పట్టణంలో గుర్తించారు.

హెలీ టూరిజంలో భాగంగా ఒక్కో వ్యక్తికి కనీసం రెండు వేల రూపాయల టికెట్‌ను నిర్ణయిస్తుంది. కనీసం రెండు వేల రూపాయలు చెల్లించే పర్యాటకులకు తిరుపతి, పరిసరాల్లో ఉండే పుణ్యక్షేత్రాలు తిరుచానూరు వంటి ప్రదేశాలను గగనతలం నుంచి వీక్షిస్తూ అనుభూతిని పొందే విధంగా ప్రత్యేక ప్యాకేజీని రూపకల్పన చేయనుంది. తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు తరిలివచ్చే ఆశేష భక్తాజనంతో పాటు, దేశ, విదేశీ పర్యాటకులను హెలీ టూరిజం ద్వారా ఆకట్టుకోవాలని నిర్ణయించిన పర్యాటకశాఖ ఈ క్రమంలో చర్యలు చేపడుతోంది. తిరుపతితోపాటు ఏపీ రాజధాని అమరావతిలోను మరో హెలీ టూరిజం నిర్వహణకు ఈ శాఖ దృష్టిసారిస్తోంది.

 

Tags :