ASBL NSL Infratech

విజయవంతమైన ‘ఆటా’ బిజినెస్ సెమినార్

విజయవంతమైన ‘ఆటా’ బిజినెస్ సెమినార్

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన బిజినెస్‌ సెమినార్‌ విజయవంతమైంది. వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనల్ని ప్రోత్సహించడం, యువ వ్యాపారవేత్తలకు మెంటారింగ్‌, వెంచర్‌ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం, స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ బిజినెస్‌ సెమినార్‌ను ఆటా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అమెరికా, భారత్‌లకు చెందిన సుమారు 100 మంది మెంటార్లు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక రంగ నిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆటా వేడుకల బిజినెస్‌ కమిటీ ఛైర్మన్‌ కాశీ కొత్త మాట్లాడుతూ ఈ బిజినెస్‌ సెమినార్‌ ఎజెండా బహుముఖం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యాపారవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానం, అనుబంధాన్ని పెంచడం, భారత్‌లో మరీ ముఖ్యంగా తెలంగాణలో స్టార్టప్‌ కంపెనీలకు మాంటారింగ్‌ చేసి వాటిలో పెట్టుబడులు పెట్టడం, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌, నిజామాబాద్‌ లాంటి టైర్‌-2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం’’ అని అన్నారు. తెలుగు వాణిజ్యవేత్తలు అమెరికాతో పాటు ప్రపంచమంతా మంచి గుర్తింపు పొందుతున్నారు. భారత్‌-అమెరికా భాగస్వామ్యాలను ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు ఆటా బిజినెస్‌ సెమినార్‌ ఒక మంచి ప్రయత్నమన్నారు. 2014 నుంచి హైదరాబాద్‌లో ప్రతి రెండేళ్లకొకసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఇప్పటివరకు భారతీయ స్టార్టప్‌లలో దాదాపు 20 మిలియన్‌ డాలర్లు (రూ.150 కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చాయి. ఈ బిజినెస్‌ సెమినార్‌ల వల్ల పలు సంస్థలు టైర్‌-2 నగరాలకు తరలివెళ్లాయి.

ఖమ్మం పట్టణంలో టి-హబ్‌ ప్రారంభించడం ఆటా బిజినెస్‌ కో-ఛైర్‌ లక్ష్‌ చేపూరి సాధించిన ఓ అతిపెద్ద విజయం అని అమెరికా తెలుగు సంఘం కాన్ఫరెన్స్‌ సలహా కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ చల్లా అన్నారు. మరోవైపు, మెంటారింగ్‌, పెట్టుబడిదారులు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, వాణిజ్యవేత్తల మధ్య పెట్టుబడులకు సంబంధించిన మంచి చర్చలు జరగడంతో పాటు ఈ బిజినెస్‌ సెమినార్‌ అనేది ద్వితీయ శ్రేణి నగరాలకు వెళ్లాలనే కంపెనీలకు, ప్రభుత్వ అధికారులకు మధ్య నిరంతర చర్చలకు కూడా ఓ వేదికగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ, తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్‌ఐపాస్‌ వంటి విధానాల అమలు సహా అంకుర సంస్థల ప్రోత్సాహానికి వీలుగా టీహబ్‌ లాంటి సంస్థనూ ఏర్పాటుచేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  వచ్చే ఆగస్టు నాటికి తెలంగాణలోని ప్రతి ఇంటికి ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ కనెక్షన్‌ అందుతుందన్నారు. 

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, తెలంగాణ ఐటీ పెట్టుబడుల విభాగం సీఈవో విజయ్‌ రంగినేని, తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హతో పాటు ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బూజల, ఆటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌, ఆటా వేడుకల చైర్‌ మధు బొమ్మినేని, సదస్సు సలహా కమిటీ ఛైర్మన్‌ జయంత్‌ చల్లా, కిరణ్‌ పాశం (సదస్సు సమన్వయకర్త), కాశీ కొత్త (ఆటా వేడుకలు బిజినెస్‌ ఛైర్‌), లక్ష్‌ చేపూరి (ఆటా వేడుకలు బిజినెస్‌ కో ఛైర్‌) తదితరులు పాల్గొన్నారు.  

 

Click here for Photogallery

 

 

 

Tags :