ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆంధ్ర అలూమ్ని సమావేశానికి ముఖ్యమంత్రి రాక

ఆంధ్ర అలూమ్ని సమావేశానికి ముఖ్యమంత్రి రాక

ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్ని అసోసియేషన్‌ డిసెంబర్‌ 13వ తేదీన నిర్వహించనున్న గ్రాండ్‌ అలూమ్ని మీట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన ఎంతోమంది విద్యార్థులు నేడు ఎన్నో రంగాల్లో ప్రముఖులుగా రాణించి ఆంధ్ర యూనివర్సిటీ పేరు ప్రతిష్టలకు ప్రతీకగా నిలిచి ఉన్నారు. సర్‌ సిఆర్‌ రెడ్డి, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, డా. విఎస్‌ కృష్ణ వంటివాళ్ళు ఈ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలకు ప్రతీకగా నిలిచారు. యూనివర్సిటీ నిర్వహించిన ఎన్నో సమావేశాలకు నాటి ప్రధానమంత్రి డా.మన్‌మోహన్‌ సింగ్‌, నేటి ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వంటి వాళ్ళు హాజరయ్యారు.

   ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్ని కమిటీ కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ కమిటీకి జిఎంఆర్‌ గ్రూపు చైర్మన్‌ డా. జిఎం. రావు ఫౌండర్‌ చైర్మన్‌గా ఉన్నారు. వైస్‌ ఛాన్సలర్‌ పివిజిడి ప్రసాద్‌ రెడ్డి చీఫ్‌ ప్యాట్రన్‌గా, మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ బి. సత్యనారాయణ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన అలూమ్ని కమిటీ సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా వచ్చారని, ఈ సంవత్సరం నిర్వహిస్తున్న అలూమ్ని కమిటీ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వస్తున్నారని అలూమ్ని కమిటీ నాయకులు తెలిపారు. ఈ అలూమ్ని సమావేశం సందర్భంగా ప్రతిభావంతులను, ప్రముఖులను సన్మానించనున్నామని కూడా వారు పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీల్లో చదివిన ఎంతోమంది బిజినెస్‌, సర్వీసెస్‌, ఇండస్ట్రీస్‌, గవర్నమెంట్‌లలో ప్రముఖులుగా ఉంటూ యూనివర్సిటీకి గుర్తింపును తీసుకువచ్చారు. ఇలాంటి ప్రముఖులను ఈ అలూమ్ని సమావేశం సందర్భంగా సత్కరించాలని కమిటీ నిర్ణయించింది.

 ఈ సమావేశానికి అందరూ రావాలని, ఈ సమావేశానికి రావాలనుకున్నవారు తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకోవాల్సిందిగా కమిటీ నాయకులు కోరారు.

https://andhrauniversityalumni.com/events

Tags :