ASBL NSL Infratech

కడప బరిలో షర్మిల..! రసవత్తరంగా మారిన పార్లమెంట్ పోరు..!!

కడప బరిలో షర్మిల..! రసవత్తరంగా మారిన పార్లమెంట్ పోరు..!!

కడప అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెప్తుంటారు. అయితే ఈసారి మాత్రం కడప పార్లమెంటు స్థానం అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు ఈసారి కడప బరిలోకి దిగుతున్నారు. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి షర్మిల బరిలోకి దిగుతున్నారు. టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీ చేయనున్నారు. అయితే ట్రయాంగిల్ వార్ లో ఎవరికి మేలు జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

కడప పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. తర్వాత అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారింది. అయితే కాంగ్రెస్ అయినా వైఎస్సార్ కాంగ్రెస్ అయినా గెలిచింది మాత్రం వైఎస్ కుటుంబసభ్యులే. కాబట్టి దీన్ని వైఎస్ ఫ్యామిలీ కంచుకోటగా చెప్పుకుంటూ ఉంటారు. 1989 నుంచి ఇక్కడ వైఎస్సార్ ఫ్యామిలీ వాళ్లే గెలుస్తూ వస్తున్నారు. 4 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి, 2 సార్లు వైఎస్ వివేకానంద రెడ్డి, 2 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2 సార్లు వైఎస్ అవినాశ్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు.

అయితే.. 2024 ఎన్నికల్లో కడప పార్లమెంటులో సమీకరణాలు మారాయి. వైఎస్ ఫ్యామిలీలో విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల విడిపోయారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అధ్యక్షుడిగా ఉండగా.. ఆయన బద్దశతృవుగా భావించే కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా మారారు. పైగా కడప పార్లమెంటు నుంచి ఆమె బరిలోకి దించుతోంది కాంగ్రెస్ పార్టీ. వైసీపీ తరపున వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో వైసీపీ, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఇద్దరూ వైఎస్ కుటుంబీకులే కావడంతో ఈ పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది.

జమ్మలమడుగుకు చెందిన చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిని తమ అభ్యర్థిగా దించుతోంది టీడీపీ. టీడీపీకోసం గత కొన్నేళ్లుగా ఈయన పనిచేస్తున్నారు. అయితే జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంటు నుంచి పోటీ చేయించి... జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి భూపేష్ రెడ్డిని బరిలోకి దింపితే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల బరిలోకి దిగుతుండడంతో ఆమెకు వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం సంపూర్ణ మద్దతు పలకనుంది. వైఎస్ అవినాశ్ రెడ్డిని ఓడించాలని ఇప్పటికే వివేకా కుటుంబం విజ్ఞప్తి చేసింది. షర్మిల కూడా వాళ్లకు అండగా నిలవడంతో అదే ఈసారి ప్రచారాస్త్రం కాబోతోంది. ఇది అవినాశ్ రెడ్డికి పెద్ద మైనస్. కాబట్టి వైసీపీ ఓట్లు చీలే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవేళ వైసీపీ ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షర్మిలకు పడితే అది అల్టిమేట్ గా టీడీపీకి మేలు చేసే అవకాశం ఉంది. అయితే షర్మిల చీల్చే ఓట్లను బట్టి వైసీపీ, టీడీపీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :