ASBL NSL Infratech

వికసిత్ ఏపీ లక్ష్యం...

వికసిత్ ఏపీ లక్ష్యం...

వికసిత్ భారత్‌ లక్ష్యంగా ఎన్డీఏ అడుగులు వేస్తోందన్నారు ప్రధాని మోడీ. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమన్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇదే సందర్భంగా తమ ల క్ష్యం వికసిత్ భారత్‌ తో పాటు వికసిత ఏపీ అన్నారు మోడీ. ఎన్డీయే కూటమి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్తూ వారి అభివృద్ధిని కోరుకుంటుందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, వైసీపీలను ప్రధాని మోడీ టార్గెట్ చేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. రెండు పార్టీలు వేర్వేరు కాదన్న విషయాన్ని ప్రజలు ఏపీ ప్రజలు గుర్తించాలన్నారు ప్రధాని.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం సుదీర్ఘకాలంగా కృషి చేస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. రాష్ట్రంలో మనం గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి, వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యం అవుతుంద‌ని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. ఏపీలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ఈ పల్నాడు జిల్లాలో దాదాపు 5 వేల ఇళ్లు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ తో ఏపీలో కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు ప్రధాని మోడీ.

ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చామ‌ని గుర్తు చేశారు మోడీ. విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశామ‌ని, తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించామ‌ని ప్రధాని వివ‌రించారు. మంగళగిరిలో ఎయిమ్స్, విజయనగరంలో గిరిజ‌న యూనివ‌ర్సిటీ లాంటి కేంద్ర సంస్థలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఎన్డీఏలోని ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటారని చెప్పారు.  ఏపీలో నీలి విప్లవానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని.. యువతకు, మహిళలకు ఉద్యోగాలతో పాటు కొత్త అవకాశాల కల్పనకు ప్లాన్ చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.

ఇదే సమయంలో దివంగత నేత, మహానటుడు నందమూరి తారక రామారావును ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయ‌న రాముడు, కృష్ణుడు పాత్రల్లో జీవించార‌ని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం విడుదల చేశామన్నారు. మరో తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇచ్చి తమ ప్రభుత్వం గౌరవించుకుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తుచేశారు.

ఎన్డీఏకు 400 సీట్లు ఖాయం: చంద్రబాబు

బీజేపీ,టీడీపీ, జనసేన జెండాలు వేరు కావొచ్చు. కానీ సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే మా ఎజెండా ఒక్కటే. ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించడానికే మేం జట్టు కట్టాం. మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీర్వాదం మాకు కావాలి అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. గత అయిదేళ్లలో వైసీపీ విధ్వంస, అహంకార, అవినీతి పాలన వల్ల రాష్ట్రప్రజల జీవితాలు నాశనమైపోయాయని.. రాష్ట్ర భవిష్యత్తు మారేలా రాబోయే ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. పల్నాడు దేశంలో ఎన్డీయేకి 400 పైగా సీట్లు వస్తాయి. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో గెలిపించి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. ఆ బాధ్యత ప్రజలదే అన్నారు. ప్రజల కోసం పరితపించే నాయకుడు పవన్‌కల్యాణ్‌ అని, ఆయనకు అభినందనలని అన్నారు.

మోదీ అంటేనే సంక్షేమం...

అభివృద్ధి ప్రధాని నరేంద్రమోడీ ఒక వ్యక్తి కాదు.. భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి. మోడీ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ, భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ఆయన ప్రపంచం మెచ్చిన నాయకుడు. ప్రధానమంత్రి అన్నయోజన, ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన, కిసాన్‌ సమ్మాన్‌నిధి, ఆయుష్మాన్‌ భారత్‌, జలజీవన్‌ మిషన్‌ తదితర పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పారు. సంక్షేమ పథకాలు అందిస్తూనే దేశాన్ని బలమైన ఆర్థికశక్తిగా మార్చడానికి మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, గతిశక్తి, భారత్‌మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేశారు. సబ్‌ కా సాథ్‌- సబ్‌ కా వికాస్‌- సబ్‌ కా విశ్వాస్‌ నినాదంతో దేశానికే నమ్మకం కల్పించిన శక్తిమంతమైన నాయకుడు మోడీ. కొవిడ్‌ సంక్షోభం సమయంలో ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా పనిచేసి దేశ ప్రజల ప్రాణాల్ని రక్షించారు. వంద దేశాలకు టీకాలు పంపించి దేశ సమర్థత చాటారని గుర్తు చేశారు చంద్రబాబు.

జగన్‌ను గద్దె దించే సమయం: పవన్ కల్యాణ్

నా వద్ద డబ్బులున్నాయి. ఎవరేం చేయగలరని జగన్‌ అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. తనకు చుట్టూ బంగారంతో కట్టిన లంక...వజ్ర, వైఢూర్యాలతో ఉన్న పుష్పక విమానం.. ధీరులు, శూరులు, మందీమార్బలం ఉన్నారని.. ఎవరేం చేయగలరని రావణాసురుడు కూడా అనుకున్నారు. నార వస్త్రాలను ధరించి నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో ఆయనను సంహరించారు. అయోధ్యకు శ్రీరాముడిని తీసుకొచ్చిన మోడీ ఇక్కడుంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన ఈ చిటికన వేలంత రావణాసురుణ్ని గద్దె నుంచి దించడం పెద్ద కష్టమా అని సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విరుచుకుపడ్డారు.

ఇసుకలో రూ.40 వేల కోట్ల కుంభకోణం...

ప్రధాని మోడీ...డిజిటల్‌ భారత్‌ దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళుతుంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగానే క్యాష్‌ ఎకానమీని ప్రోత్సహిస్తోంది. దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్‌ లోనే నల్లధనం ఎక్కువైంది. సారా వ్యాపారాన్నే తీసుకుంటే..సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి.. అతను ముఖ్యమంత్రి కాదు. సారా వ్యాపారి. అయిదేళ్లలో రూ.1.13 లక్షల కోట్ల మద్యం అధికారికంగా, అనధికారికంగా విక్రయించారు. దానిని రూ. 84,050 కోట్లుగా తగ్గించి చూపించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల జీఎస్టీ ఎగవేశారు. ఇసుక దోపిడీలో రూ.40 వేల కోట్ల కుంభకోణం జరిగింది. జేపీ వెంచర్స్‌ వెనుక ఉన్న ఆ అయిదుగురూ జగన్‌ బినామీలే. అందరూ కలిసి ఇసుకను దోచేశారని మండిపడ్డారు పవన్ కల్యాణ్.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :