నోట్లరద్దుపై సుప్రీంకోర్టులో అక్టోబర్ 16న విచారణ!

నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లపై అక్టోబర్ 16న వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌లపై విచారణ చేయనుంది. నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై బుధవారం నాడు సర్వోన్నత న్యాయస్థానం వాదనలు వినాల్సింది. అయితే కొన్ని న్యాయపరమైన కారణాలవల్ల ఈ విచారణ తేదీ అక్టోబర్ 12కు మారినట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 8న పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ.500 నోటుకు బదులుగా కొత్త నోటును తీసుకురాగా, పాత రూ.1000 నోటును పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో రూ.2000 నోటును తీసుకొచ్చారు. అయితే ఈ నోట్ల రద్దు సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నగదు కోసం ప్రతిరోజూ బ్యాంకుల ముందు బారులు తీరాల్సి వచ్చిందని, ఇంత చేసినా నోట్ల బ్యాన్ వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపిస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. తదుపరి దర్యాప్తును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు 2016, డిసెంబర్ 16న ప్రకటించింది.






