ASBL NSL Infratech

రివ్యూ: దేశభక్తి చాటినా.... 'స్పై' మిషన్ ఫెయిల్

రివ్యూ: దేశభక్తి చాటినా.... 'స్పై' మిషన్ ఫెయిల్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5
నిర్మాణ సంస్థ: ఈ డి ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం, ఐశ్వర్యా మీనన్, సానియా ఠాకూర్,
మకరంద్ దేశ్‌ పాండే, జిష్షు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవి వర్మ అతిధి పాత్రలో రానా దగ్గుబాటి తదితరులు నటించారు
సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
సంగీతం  : విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి, సి ఈ ఓ : చరణ్ తేజ్ ఉప్పలపాటి 
కథ, నిర్మాత : కె. రాజశేఖర్ రెడ్డి, ఎడిటింగ్, దర్శకత్వం : గ్యారీ బీహెచ్
విడుదల తేదీ: 29.06.2023

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ గత ఏడాది విడుదల అయిన పాన్ ఇండియా మూవీ కార్తికేయ 2 సినిమాతో మంచి విజయాన్ని అందున్నాడు. ఆ సినిమా తర్వాత18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌ తో  అలరించాడు . ఇక ఈ సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రం 'స్పై' పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గూఢచర్యం, రా ఏజెంట్లు నేపథ్యంలో ఇప్పటికే ఇండియాలో చాలా సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ  స్పై మూవీస్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. స్క్రీన్‌ప్లే, ప్రజెంటేషన్ కొత్తగా ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘స్పై’ మూవీకి అలాంటి పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. స్వాత్యంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యం ఆధారంగా ఈ మూవీను తెరకెక్కించడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం భాషల్లో  ఈ రోజు  గ్రాండ్ గా విడుదల అయింది. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది .నిఖిల్ స్పై తో మరో విజయాన్ని దక్కించుకున్నాడా లేదా అనేది రివ్యూ లో చూద్దాం.

కథ :

అజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, లక్షాలది మంది సామాన్యులను సైనికులుగా తయారుచేసి, వారిలో యుద్ధ స్ఫూర్తిని నింపిన స్వాతంత్ర సమరయోధుడు  సుభాష్ చంద్రబోస్. యుద్ధ సమయంలో విమాన ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనతో భారతీయ చరిత్ర సుభాష్ చంద్రబోస్ ఆచూకీని కోల్పొయింది.ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.అలాంటి పవర్ ఫుల్ స్టోరీలో దాగి ఉన్న అనేక రహస్యాలను పరిశోధన చేసి రాసుకున్న కధే ఈ ‘స్పై.   జై అలియాస్ విజయ్ (నిఖిల్ సిద్ధార్థ) 'రా' ఏజెంట్. అతని అన్నయ్య సుభాష్ (ఆర్యన్ రాజేష్) సైతం 'రా' ఏజెంటే. అయితే... ఇప్పుడు ఆయన లేరు. ఇండియాకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న ఖాదిర్ ఖాన్ (నితిన్ మెహతా)ను సుభాష్ చంపుతాడు. ఆ తర్వాత సుభాష్‌ను ఎవరో చంపేస్తారు. తన అన్నయ్యను ఎవరు చంపారో తెలుసుకోవాలని జై ప్రయత్నిస్తూ ఉంటాడు.

జై, కమల్ (అభినవ్ గోమఠం) శ్రీలంకలో ఓ మిషన్ పని మీద ఉండగా... ఇండియా ప్రధాని (సచిన్ ఖేడేకర్)కు ఓ వీడియో వస్తుంది. అందులో ఖాదిర్ ఖాన్ ఉంటాడు. ఖాదిర్ ను సుభాష్ చంపడం శాస్త్రి వీడియోలో చూస్తాడు.  మరణించిన ఖాదిర్ మళ్ళీ ఎలా బతికాడు? ఇండియా ఎలా వచ్చాడు? సరిగ్గా అదే సమయంలో 'రా' హెడ్ ఆఫీసులో భగవాన్ జీ (సుభాష్ చంద్రబోస్) ఫైల్స్ మిస్ కావడం వెనుక ఎవరు ఉన్నారు? ఖాదిర్ ను మళ్ళీ 'రా' పట్టుకోగలిగిందా? జైను 'రా' నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? ఖాదిర్, భగవాన్ జీ ఫైల్స్ అన్వేషణలో సాయం చేసిన వైష్ణవి (ఐశ్వర్య మీనన్), జై మధ్య గతంలో ఏం జరిగింది? 'రా'లో జై సీనియర్ అర్జున్ (రానా దగ్గుబాటి), పాకిస్థాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అబ్దుల్ రెహమాన్ (జిష్షు సేన్ గుప్తా) పాత్రలు ఏమిటి? అనేది మిగతా సినిమాలో చూడాలి. 

నటి నటుల హావభావాలు:

కథ, కథనాలు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే...  మోడ్రన్ స్పైగా నిఖిల్ ఎనర్జిటిక్ గా కనిపించి మెప్పించాడు .అతడి లుక్, యాక్టింగ్, యాక్షన్ బాగున్నాయి … హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సాన్యా ఠాకూర్ కీలకమైన సరస్వతి పాత్ర చేశారు. ఇక రానా ఎప్పీయరెన్స్ సూపర్ .అలాగే అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నితిన్ మెహతా విలన్ గా బాగా చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మకరంద్ దేశ్ పాండే క్లీన్ షేవ్ తో కొత్త లుక్ లో కనిపించారు. ప్రధానిగా సచిన్ ఖేడేకర్ చేసింది ఏమీ లేదు. హీరోతో పాటు సినిమా అంతా ట్రావెల్ చేసే కమల్ పాత్రలో అభినవ్ గోమఠం కనిపించారు. సన్నివేశంతో సంబంధం లేకుండా కొన్నిచోట్ల ఆయన కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. కొన్నిచోట్ల, అసలు ఆ సన్నివేశంలో ఆ డైలాగ్ అవసరమా? అని మనకు కామెడీగా అనిపిస్తుంది. జిష్షు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు రెగ్యులర్ రోల్స్ చేశారు. రానా దగ్గుబాటి కనిపించేది ఒక్క సన్నివేశమే అయినా... నటన, డైలాగ్ డెలివరీతో చిన్న హై ఇస్తారు. ఆర్యన్ రాజేష్, తనికెళ్ళ భరణి, పృథ్వీ, పోసాని కృష్ణమురళి రెండు మూడు సన్నివేశాలకు పరిమితం అయ్యారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

ఇక సాంకేతిక విషయాలకు వస్తే.... స్వాత్యంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు మెండుగా ఉన్నాయి.  సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పలు సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన గ్యారీ దర్శకుడిగా తానూ తెరకెక్కించిన సినిమాని అంతే థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు . ఖాదిర్ అనే ఉగ్రవాద నాయకుడిని కేంద్రంగా చేసుకుని సినిమా కథని గ్రిప్పింగ్ గా చూపించే ప్రయత్నం బాగుంది . పాటలు కథకు అడ్డు తగిలాయి. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది .ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ కలిగిస్తుంది . నిర్మాణ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే... అంత మంచిది! నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుడిని డైవర్ట్ అయ్యేలా చేస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆ గ్రాఫిక్స్ వల్లనో, మరొకటో... కెమెరా వర్క్ బాలేదు.

విశ్లేషణ:

ఈ  'స్పై' కథలో సస్పెన్స్ & సెంటిమెంట్, లవ్ & యాక్షన్, మరీ ముఖ్యంగా కామెడీ... ఒక్కటేమిటి? అన్నీ ఉన్నాయి. లేనిది ఏమిటని ఆలోచిస్తే? ఉత్కంఠ కలిగించే కథనం.  స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు... ఏ దశలోనూ 'స్పై' ఓ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడికి కలగదు. ఆ స్థాయిలో సినిమా తెరకెక్కించారు. సన్నివేశాలు  సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే మరీ ఘోరం! యాక్షన్ థ్రిల్లర్ మాట పక్కన పెడితే... 'రా' నేపథ్యంలో తీసిన సినిమాగా ఎక్కడా కనిపించదు. అదీ 'స్పై' ప్రత్యేకత!  ఆ స్థాయిలో సినిమా తెరకెక్కించారు. కథలో లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పే సీన్లు కాస్త బెటర్. సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి ఆయన పేరు వాడుకున్నట్లు అనిపించింది. దేశభక్తిలో భగవాన్ జీ సక్సెస్ అయితే... నిఖిల్ 'స్పై' మిషన్ ఫెయిల్ అయ్యింది. డిజప్పాయింట్ చేసే రొటీన్ థ్రిల్లర్ ఇది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :