రివ్యూ: ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా 'సామజవరగమనా'....
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి....
నటీనటులు : శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్,
రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.
సంగీతం : గోపీ సుందర్, సినిమాటోగ్రాఫర్ : రాంరెడ్డి
ఎడిటర్ :ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
కథ : భాను బోగవరపు, మాటలు :నందు సవిరిగాన
సహ నిర్మాత - బాలాజీ గుత్తా, సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత : రాజేష్ దండా, స్క్రీన్ ప్లే & దర్శకత్వం : రామ్ అబ్బరాజు
విడుదల తేదీ : 29.06.2023
విలక్షణమైన సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీవిష్ణు తాజా చిత్రం ‘సామజవరగమన’. అయితే ఇటీవల తన ఇమేజ్ మార్చుకునే క్రమం లో మాస్ యాక్షన్ కథల వైపు దృష్ఠి పెట్టి వరస ప్లాపులు మూటకట్టుకున్నాడు. తిరిగి తన పాత పంధానే ఎన్నుకుని చేసిన సినిమా ‘సామజవరగమన’. టీజర్, ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సామజవరగమన ఆయన అంచనాలను అందుకుందా? వివాహ భోజనంబు సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు రామ్ అబ్బురాజ్ ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు? ఈ రోజే విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
బాలు (శ్రీవిష్ణు) ప్రేమలో విఫలం అయ్యి, ప్రేమ పైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు. ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐలవ్ యూ చెబితే వెంటనే రాకీ కట్టించుకుంటుంటాడు. మరో వైపు బాలు తండ్రి (సీనియర్ నరేష్) డిగ్రీ పాసయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య వీలునామా రాసి చనిపోతాడు. దాని కోసం తండ్రిని డిగ్రీ పాస్ చేయించటానిని నానా ఇబ్బందులు పడుతుంటాడు. బాలు తండ్రేమో ముప్పై ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. అయితే కుటుంబ బాధ్యతలను బాలునే చూసుకుంటూ ఉంటాడు. ఓసారి తండ్రిని ఎగ్జామ్ హాల్‌కు తీసుకెళ్లినప్పుడు అక్కడ డిగ్రీ పరీక్షలు రాయటానికి వచ్చిన సరయు (రెబా మౌనికా జాన్) పరిచయం అవుతుంది. ఆమెకు హాస్టల్లో ఉంటూ చదువుకోవటం ఇష్టం ఉండదు. దాంతో బాలు ఇంటికే పేయింగ్ గెస్ట్‌గా వస్తుంది. కుటుంబ బాధ్యతలను చక్కగా చూసుకునే బాలుని సరయు ఇష్టపడుతుంది. చివరకు బాలు కూడా సరయు ప్రేమలో పడతాడు.
అదే సమయంలో బాలు అత్తయ్య కొడుక్కి (బావ) రాజమండ్రి అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. సరయు కూడా రాజమండ్రి అమ్మాయే కావటంతో ఆమెకు సర్‌ప్రైజ్ ఇద్దామని బాలు ఆమెకు చెప్పకుండా రాజమండ్రి వస్తాడు. బాలు బావ పెళ్లి చేసుకోవయేది సరయు అక్కయ్యనే అనే నిజం బాలుకి తెలుస్తుంది. అక్కడే అసలు చిక్కొచ్చి పడుతుంది. బాలు, సరయు పెళ్లికి వచ్చిన సమస్య ఏంటి? సరయు తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్)కి ప్రేమ పెళ్లిళ్లు అంటే ఎందుకు ఇష్టం ఉండదు? చివరకు బాలు, సరయు ఎలా కలుసుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి? అలాగే బాలు తండ్రి డిగ్రీ పాసయితే కోట్ల ఆస్తి దక్కేలా అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.
నటీనటుల హావభావాలు:
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అన్ని సన్నివేశాల్లో శ్రీ విష్ణు చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు. అలాగే సమస్యల నుంచి హీరో తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఇక మరో ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నరేష్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించారు. డిగ్రీ పాస్ కాలేని సగటు మిడిల్ క్లాస్ తండ్రిగా నరేష్ నటన సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ గా నటించిన రెబా మౌనికా జాన్ కూడా ఆకట్టుకుంది. తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆమె మెప్పించింది.ఇక ఎప్పటిలాగే కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.
సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు రామ్ అబ్బరాజు ఆసాంతం నవ్వించేలా సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోవటమే కాదు.. దాన్ని అంతే పక్కగా తెరకెక్కించటం విశేషం. సందర్భానుసారంగా వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి... నవ్విస్తాయి. తర్వాత గోపీససుందర్ పాటలు, నేపథ్య సంగీతం బావుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను రాంరెడ్డి చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
కొన్ని సినిమా కథలు సింపుల్‌గా ఉంటాయి. ఈ రోజుల్లో సినిమా క్లైమాక్స్ ఏంటనే విషయాన్ని కూడా ప్రేక్షకుడు ముందుగానే పసి గట్టేస్తున్నాడు. అయితే కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. అందుకు కారణం.. చక్కటి స్క్రీన్ ప్లే, ఆరోగ్యకరమైన హాస్యం, ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ఉండటం. అలా రొటీన్ కథతోనే రూపొందినా చక్కటి ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ చేసిన స్క్రీన్ ప్లేతో రూపొందిన సినిమాయే ‘సామజవరగమన’. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘సామజవరగమన’ అనే సినిమా. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో శ్రీవిష్ణు, నరేష్ ఈ సినిమాని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఫ్యామిలీ తోపాటు చూడాల్సిన చిత్రం ఇది.