ASBL NSL Infratech

రివ్యూ : థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ తో 'విరూపాక్ష' నెక్స్ట్ లెవల్

రివ్యూ : థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ తో 'విరూపాక్ష' నెక్స్ట్ లెవల్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, సోనియా సింగ్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, రాజీవ్ కనకాల, ఝాన్సీ,  రవి కృష్ణ తదితరులు.

ఛాయాగ్రహణం : ష్యామ్ ద‌త్ సైనుద్దీన్‌,  సంగీతం : బి. అజ‌నీష్ లోక్‌ నాథ్‌, ఎడిటర్ : నవీన్ నూలి , సమర్పణ : బాపినీడు .బి, స్క్రీన్ ప్లే : సుకుమార్ ,నిర్మాత : బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌,  కథ, దర్శకత్వం : కార్తీక్ దండు.

విడుదల తేదీ: 21.04.2023

“రిపబ్లిక్” విడుదలకు ఒక నెల ముందు అనుకోని విధంగా జరిగిన బైక్ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న సాయిధరమ్ తేజ్ టైటిల్ పాత్రలో నటించగా విడుదలైన చిత్రం “విరూపాక్ష”. 2015లో విడుదలైన “భమ్ బోలేనాధ్”తో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ దాదాపు ఏడేళ్ళ అనంతరం మళ్ళీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సూపర్ నేచురల్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేసిన సాయి ధరమ్ తేజ్ విజయం అందుకున్నారా ? లేదా?  సమీక్ష లో చూద్దాం..!!

కథ:

1979 కాలంలో రుద్రవనంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల సమాహారమే ఈ కథ. రుద్రవనంలో అమ్మవారి జాతర ఉండటంతో సూర్య (సాయి ధరమ్ తేజ్) తల్లితో కలిసి రుద్రవనానికి వస్తాడు. ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర ప్రసాద్ (రాజీవ్ కనకాల) తొలి చూపులోనే కుమార్తె నందిని (సంయుక్తా మీనన్)ను ప్రేమిస్తాడు. ఊరి నుంచి సూర్య వెళ్ళిపోయే సమయంలో అమ్మవారి గుడిలో ఓ వ్యక్తి మరణిస్తాడు. దాంతో ఊరికి అరిష్టం అని అష్టదిగ్బంధనం వేస్తారు. అప్పుడు ఒకరి తర్వాత మరొకరు... నలుగురు మరణిస్తారు. ఒక దశలో ఆ మరణాలను ఆపడానికి ఏకైక పరిష్కార మార్గం నందిని సజీవ దహనమే అని పూజారి చెబుతారు.  ఊరు మొత్తం పీడశక్తి కారణంగా అల్లకల్లోలమవుతున్న సందర్భంలో.. సూర్య ధైర్యంగా నిలబడి, రుద్రవనానికి పట్టిన పీడను తొలగించడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. అలా ఎందుకు చెప్పారు? ప్రేమించిన అమ్మాయిని, ఊరిలో ప్రజలను కాపాడటం కోసం సూర్య ఏం చేశాడు?  అసలు రుద్రవనంలో ఏం జరిగింది? ఆ ఊరి ప్రజలను కాపాడడానికి సూర్య చేసిన సాహసం ఏమిటి? అనేది మిగతా సినిమా  వెండితెరపై  చూడాల్సిందే!!

నటీనటుల హావభావాలు:

నటుడిగా సాయిధరమ్ తేజ్ లో ఎనర్జీ లోపించింది. అయినా  హీరోయిజం చూపించే సినిమా కాదిది. హీరో క్యారెక్టర్ కూడా కథలో భాగంగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఇటువంటి కథ, ఆ పాత్రలో నటించడానికి ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ ను ప్రత్యేకంగా అభినందించాలి. పాత్రకు ఏం కావాలో, ఆయన అది చేశారు. అతడి పాత్రలోని కచ్చితత్వం, నిజాయితీ కనిపించినప్పటికీ.. ఇంకాస్త హుషారు ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సాయితేజ్ నటన విషయంలో బాగా తేలిపోయాడు. మరి యాక్సిడెంట్ ఎఫెక్టో లేక.. సెటిల్డ్ గా చేయాలనే తపనతో తన మార్క్ ఇంటెన్సిటీని పక్కన పెట్టాడో తెలియదు కానీ.. సాయితేజ్ వీక్ పెర్ఫార్మెన్స్ తేటతెల్లమవుతుంది. 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్'తో సంయుక్తా మీనన్ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఆ సినిమాల్లో ఆమె పాత్ర పరిధి తక్కువ. సంయుక్త మీనన్ ఈ చిత్రంలోని నందిని పాత్రలో ఆశ్చర్యపరిచింది. ఆమెకు నటన రాదంటూ కామెంట్ చేసినవాళ్లందరి నోర్లు మూయించింది. ఆమె పాత్ర సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. అలాగే.. తెలుగు చిత్రసీమలో ఆమె స్థానాన్ని ఇంకాస్త బలపరిచింది. ఆ సన్నివేశాల్లో నటిగా సంయుక్త నటన నెక్స్ట్ లెవల్. కమర్షియల్ సినిమా కథానాయిక పరిధి దాటి నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అజయ్, రవికృష్ణలు ఈ చిత్రంతో తమలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వారి క్యారెక్టరైజేషన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సాయిచంద్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

దర్శకుడు కార్తీక్ వర్మ దండు గురించి మాట్లాడుకోవాలి. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా తాను అనుకున్న కథను అద్భుతంగా తెరపై ప్రెజంట్ చేశాడు. ముఖ్యంగా.. సినిమాలో అనవసరంగా పాటలు ఇరికించకుండా.. థీమ్ మ్యూజిక్ తో సెకండాఫ్ ను నడిపిన విధానం బాగుంది. అలాగే.. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించింది. కథకుడిగా, దర్శకుడిగా కార్తీక్ దండు సూపర్ హిట్ కొట్టాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులనుండి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు... క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాత సన్నివేశాన్ని ఇంకా బాగా రాసుకుని ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. అప్పటి వరకు ఉన్న 'హైప్ 'ను ఆ సీన్ కాస్త డౌన్ చేసింది. అందులో లాజిక్ కూడా లేదు. అయితే, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సూపర్బ్! రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా కొత్త కథను చూపించడంలో, పల్లెటూరిలో హారర్ ఎలిమెంట్స్ సెటప్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అజనీష్ లోక్నాధ్ ఈ సినిమాకి మెయిన్ హీరో. తన మార్క్ నేపధ్య సంగీతం విజువల్ ఎఫెక్ట్స్ తో ఓపెనింగ్ సీక్వెన్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేశాడు. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తే మాత్రం ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.అలాగే.. సౌండ్ మిక్సింగ్ విషయంలో తీసుకున్న కేర్ కూడా ప్రశంసనీయం. ఇక షాందత్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ ను వేరే ప్రపంచంలో కూర్చోబెట్టేసింది. సినిమాని 1979ల కాలంలో జరిగే కథగా ఎస్టాబ్లిష్ చేయడం మంచి ప్లస్ అయ్యింది.సెట్ బ్యాక్ గ్రౌండ్   వర్క్ & ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

'విరూపాక్ష' ట్రైలర్ చూస్తేనే  ప్రేక్షకులకు  అర్ధమౌతుంది .. ఇది ఏ తరహా చిత్రమో? ఇటువంటి సినిమాల్లో ప్రేమకథను ఆశించి ఎవరూ థియేటర్లకు రారు. ఆ ప్రేమ కథే సినిమాకు అడ్డంకిగా నిలిచింది.  ప్రేమ కథను పక్కన పెట్టి హారర్ అంశాలకు వస్తే సినిమా అద్భుతమే!  ప్రారంభమే ఆసక్తిగా మొదలైంది. ఒళ్ళు జలదరించే సన్నివేశంతో కార్తీక్ దండు సినిమాను మొదలు పెట్టారు.  సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడి మదిలో కొన్ని  సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ క్షుద్ర పూజలకు కారణం ఎవరు? అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు వ్యక్తిని చివరి వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేయడంలో సుకుమార్ 100 శాతం సక్సెస్ అయ్యారు. 

 'విరూపాక్ష' అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్. క్షుద్ర పూజలు, మరణాలు వంటి అంశాల కారణంగా పిల్లలతో కలిసి దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళలేరు. అటువంటి చిన్న చిన్న తప్పులు పక్కన పెడితే... థ్రిల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్! ఇంటర్వెల్ ముందు, ఆ తర్వాత... క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ 'వావ్' అనిపిస్తాయి. మనల్ని షాక్ కు గురిచేస్తాయి..  'విరూపాక్ష' ఓ టి టి లో వస్తుందిలే! తరువాత చూద్దాం అనుకుంటే చిత్రంలోనే  థ్రిల్స్ మిస్ అవుతారు. ఈ సినిమా కేవలం థియేటర్లలో చూస్తేనే కిక్ నిస్తుంది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో కరెక్ట్ టైమ్ లో పడిన హిట్ సినిమా ఇది. ఒక మంచి థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :