ASBL NSL Infratech

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ప్రచారం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ప్రచారం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ఆ ప్రచారంలో ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతవరకూ బాగానే ఉంది కానీ..ప్రజల్ని వెర్రోళ్లను చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. తమ అభ్యర్థులు సచ్చీలురు, బడుగు వర్గాలకు చెందినవారని బాకా వేస్తున్నాయి. నిజంగా బడుగు వర్గాలకు చెందిన వ్యక్తులు.. ఇప్పుడున్న ఎన్నికల ఖర్చును తట్టుకుని నిలబడగలరా..? నిలబడి గెలవగలరా..? ఈ విషయాన్ని ఏపీలో ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి.

ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ సైతం పదేపదే తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు పేదోళ్లని.. వారి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని చెప్పుకొచ్చారు. కర్నూలు మేయర్‌ బీవై రామయ్య పేదవాడని, ఆలూరు అభ్యర్థిగా పోటీచేస్తున్న విరూపాక్షి కూడా పేద వ్యక్తని, తన చెల్లెలు బుట్టమ్మ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, కోడుమూరు అభ్యర్థి డాక్టర్‌ సతీశ్‌ దగ్గర డబ్బుల్లేవని, ఐఏఎస్‌ అధికారిగా పనిచేసి, ఇటీవలే రాజీనామా చేసి కర్నూలు అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ ఇంతియాజ్‌ దగ్గర కూడా డబ్బులు లేవని, ఆదోని అభ్యర్థి సాయన్న, మంత్రాలయం అభ్యర్థి బాలనాగిరెడ్డి కూడా సౌమ్యులని, వారిద్దరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నారు. అయితే స్థానికంగా మాత్రం వారంతా కోటీశ్వరులన్న అంచనాలున్నాయి.

ఈ సారి ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే గెలవాలంటే కనీసం రూ.25 కోట్లు, ఎంపీ అభ్యర్థి అయితే 60 నుంచి 70 కోట్లు ఖర్చుపెట్టాలని అంచనాలున్నాయి. అలాంటిది ఏమీ లేని పేదవాడిని నిజంగా ఎన్నికల్లో నిలబడితే గెలిచే పరిస్థితి ఉంటుందా..? ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకూ కార్యకర్తలకే లక్షల రూపాయలు పంచాల్సి ఉంటుంది. వారికి మందు, బిర్యానీ ప్యాకెట్, డబ్బులు .. ఇవన్నీ ఇస్తేనే వెనక తిరుగుతారు.. లేదంటే అంతే సంగతులు.. క్షణాల్లో పార్టీ మార్చేస్తారు. డబ్బిచ్చే నాయకుడికే జై కొడతారు. వారిని అనాల్సిన పనిలేదు. ఎందుకంటే.. తర్వాత తాము పిలిచినా నాయకుడు పలకడు. చేతికి డబ్బులు రావు. అందుకే దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని భావిస్తున్న పరిస్థితి ఉంది.

ఓవైపు టికెట్ రాని అసంతృప్తులు .. ఒక్కో టికెట్ కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారంటూ అధినేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టించి పనిచేసిన వారిని కాదని.. పక్కపార్టీల నుంచి వచ్చిన ప్యారాచూట్ పార్టీలకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు మేం పేదలకు టికెట్లిచ్చాం.. గెలిపించండి అంటే ఎవరు నమ్ముతారు. కనీసం ఈ రాజకీయ నాయకులకు.. ఈమాత్రం అర్థం కాదా అన్నది సామాన్యుల వ్యథగా కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :