ASBL NSL Infratech

రివ్యూ : సెల్ ఫోన్ బయోపిక్ 'మాయ పేటిక'  

రివ్యూ : సెల్ ఫోన్ బయోపిక్ 'మాయ పేటిక'  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్మెంట్స్
న‌టీన‌టులు : విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్, సునీల్,
పృథ్వీరాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, సమ్మెట గాంధీ, హిమ‌జ‌, శ్యామ‌ల త‌దిత‌రులు
సంగీతం :  గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ :  సురేష్ ర‌గుతు
ఎడిట‌ర్‌:  డి.వెంక‌టేష్ ప్ర‌భు, న‌వ్ క‌ట్స్‌, ఆర్ట్‌ : బిక్షు, మూర్తి
స‌మ‌ర్ప‌ణ‌ :  మాగుంట వెంక‌ట నారాయ‌ణ రెడ్డి
నిర్మాత‌లు : మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం :  ర‌మేష్ రాపర్తి
విడుదల తేదీ : 30.06.2023

మానవుడి మనుగడ సాగాలంటే... గాలి, నీరు, వెలుతురు, ఆహరం, డబ్బు అవసరం.  కానీ.... ప్రస్తుతం అది లేనిదే మనిషి ఏమి సాధించలేడు. కష్టమైనా, సుఖమైనా, విజ్ఞానమైనా, వినోదమైనా నిరంతరం పంచుకునేది, అదే 'సెల్ ఫోన్'.  చేతిలో డబ్బు లేకున్నా ఈ భూతం మన దైవందిన జీవితంలో అన్ని పనులు చక్కపెడుతుంది. ఇది ప్రస్తుత సమాజంలో  తప్పనిసరిగా అవసరమయ్యే సాధనం.  మనిషి తలదించుకుని దీనికి బానిసయ్యాడు. దీనిని బట్టి మనకు తెలిసింది ఈ ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతీవ్యక్తికి ఈ మొబైల్ ఫోన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ మూవీ 'థాంక్ యు బ్రదర్' బ్యానర్ నుండి వస్తున్న ఈ 'సెల్ ఫోన్' బయోపిక్ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.  మరి సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ 'మయా పేటిక' కథా కమామీషూ ఏంటో సమీక్షలో తెలుసుకుందాం. 

కథ:

ఇది ఒక స్మార్ట్ ఫోన్ కథ... ఈ మయా పేటిక (సెల్ ఫోన్) చైనా దేశంలో పుట్టి, మన హైదరాబాద్ కు వస్తుంది. తొలుత హీరోయినిగా చేస్తున్న పాయల్ రాజపుత్ (పాయల్ రాజపుత్) కు  ఆ సినిమా నిర్మాత షోరూమ్ నుండి కొని ఆమెకు బహుమతిగా ఇస్తాడు. ఈ విషయం ఆమె కాబోయే భర్త ప్రణయ్ (ర‌జ‌త్ రాఘ‌వ్) తెలుస్తుంది. హీరోయిన్ పాయల్ రాజపుత్ ఎప్పుడూ ఆ  సెల్ ఫోన్ తో మాట్లాడటం ప్రణయ్ కి ఇష్టముండదు పైగా తన స్నేహితులు హీరోయిన్ అంటే ప్రతివ్రత కాదు..కుర్రాళ్ళు కోరుకునే ఒక అందమైన అమ్మాయి అనడంతో,  పాయల్ రాజపుత్ ను సినిమా రంగాన్ని వదిలేయమంటాడు. దీనికి కారణం బహుమతిగా వచ్చిన సెల్ ఫోన్ కారణమని, దాన్ని తన అసిస్టెంట్ దేవదాసుకు ఇచ్చేస్తుంది. అసిస్టెంట్ దేవదాసు తన పర్సనల్ వర్క్ కోసం లంచంగా నెల్లూరు కార్పొరేటర్  కన్నెకామేశ్వర రావు (పృథ్వీరాజ్‌)కు ఇస్తాడు. స్త్రీ లోలుడైన అతను సెక్స్ స్కామ్ లో ఇరుక్కుంటాడు. దాంతో ప్రజలు తరిమికొట్టే సమయంలో ఆ సెల్ ఫోన్ ను ఓ కారులో పోగుట్టుకుంటాడు. ఆ తరువాత కర్నూల్ లో వున్న కారు మెకానిక్ అలీ (విరాజ్ అశ్విన్) కి దొరుకుతుంది.

అలీ, ఆస్రా (సిమ్ర‌త్ కౌర్) ప్రేమించుకోడానికి ఆ సెల్ ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ తరువాత అదే సెల్ ఫోన్ ఓ వేశ్య  ఓ విటుడి వద్ద లాకుంటుంది, సెకండ్ హ్యాండ్ కొనే వాడికి అమ్మేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఎరుగని నక్కిలిసు నారాయణ దంపతులు( సునీల్, శ్యామల)సెకండ్ సేల్ లో కొంటారు. వాళ్ళ నుండి కోతితో దొంగతనాలు చేయించే శ్రీను (శ్రీనివాస రెడ్డి) వద్దకు, చివరాఖరుకు పాకిస్తాన్ టెర్రరిస్టుల వద్దకు చేరుతుంది. ఇంతకీ ప్రణయ్, పాయల్ రాజపుత్ ని పెళ్లి చేసుకున్నాడా? కన్నెకామేశ్వర రావు ని సెక్స్ స్కామ్ లో ఎవరు ఇరికించారు?  అలీ, ఆస్రా ల ప్రేమ ఫలించిందా? సెక్యూరిటీ నారాయణ నక్కిలిసు నారాయణ గా ఎలా పేరు తెచ్చుకున్నాడు?  శ్రీను నుండి పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతిలోకి సెల్ ఫోన్ ఎలా చేరింది? టెర్రరిస్టుల సెల్ ఫోన్ ని ఏ సాధనంగా ఉపయోగించుకున్నారు? ఈ  మయా పేటిక ప్రయాణం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

నటి నటుల హావభావాలు:

కారు మెకానిక్ అలీగా నటించిన విరాజ్ అశ్విన్, హీరోయిన్ కి కాబోయే భర్త ప్రణయ్ గా ర‌జ‌త్ రాఘ‌వ్, అన్ని సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. ముఖ్యంగా విరాజ్ అశ్విన్ ముస్లిమ్ యువకుడిగా, ప్రేమ సన్నివేశాల్లో తన తల్లి గురించి సిమ్ర‌త్ కౌర్ కి చెప్పే సన్నివేశాల్లో  బాగా నటించాడు. సినిమా హీరోయినిగా పాయల్ రాజపుత్  తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆమె మెప్పించింది.  అదే విధంగా మరో హీరోయిన్ సిమ్ర‌త్ కౌర్ అమాయకమైన మూగ పాత్రలో తన కళ్ళ తోనే హావభావాలు ప్రదర్శించింది. స్త్రీ లోలుడు  కన్నెకామేశ్వర రావు గా నటించిన పృథ్వీరాజ్‌ చెప్పేయ్ అనే దానికి విప్పేయ్ అంటూ సెక్సీ డైలాగులతో ..తన దైన స్టయిల్లో  ప్రేక్షకులను నవ్వించాడు. నక్కిలిసు నారాయణ గా సునీల్, ఎప్పటిలాగే కీలక పాత్రల్లో కనిపించిన శ్రీనివాస రెడ్డి  ట్రాన్సజెండెర్ గా, దొంగ గా విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

ద‌ర్శ‌కుడు రమేష్ రాపర్తి ఓ డివైస్ ని కథానాయకుడిగా, దాని ప్రయాణాన్ని కథగా మలుచుకోవడం, ఆ సాంతం న‌వ్వించేలా, వినోదాత్మకంగా సినిమా స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకోవ‌ట‌మే కాదు.. దాన్ని అంతే ప‌క్క‌గా తెర‌కెక్కించటం విశేషం. సంద‌ర్భానుసారంగా వ‌చ్చే డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి...న‌వ్విస్తాయి. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా సెల్ ఫోన్ బయోపిక్ తీయడం ద‌ర్శ‌కుడు రమేష్ రాపర్తి ని అభినందించాలి. త‌ర్వాత గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌ పాట‌లు, నేప‌థ్య సంగీతం చాలా బావుంది. సురేష్ ర‌గుతు  సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను సురేష్ ర‌గుతు చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. డి.వెంక‌టేష్ ప్ర‌భు ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు  మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

ఫామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ,క్రైమ్ థ్రిల్లర్, హర్రర్,మాస్, కామెడీ అని  సినిమా కథలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక పరికరం తన కథ చెప్పుకోవడం, రెండున్నర గంటల పాటు దాన్ని అంతే ప‌క్క‌గా తెర‌కెక్కించటం విశేషం. ఈ రోజుల్లో  సినిమా చూడటానికి  ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించాలంటే ఏదో ఒక కొత్తదనం ఉండాలి.  'మాయ పేటిక' లో, అవసరమైన పాత్రలు, చ‌క్క‌టి స్క్రీన్ ప్లే, ఆరోగ్యకరమైన హాస్యం, ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు వున్నాయి. ఎక్కడా లాజిక్ మిస్ అవకుండా, నేటి జనరేషన్ కి ఇష్టమైన ఎలిమెంట్ అన్ని ఈ చిత్రంలో వున్నాయి. అలాంటి కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రమే  'మాయ పేటిక'.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :