ASBL NSL Infratech

మోదీ మాటల వెనుక వ్యూహమా..? భయమా..?

మోదీ మాటల వెనుక వ్యూహమా..? భయమా..?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే ఒక విడత పోలింగ్ కూడా పూర్తయిపోయింది. జూన్ మొదటి వారానికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఆయన్ను ఎలాగైనా గద్దె దించాలని విపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు మోదీ. అందులో భాగంగానే ఆయన తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆచితూచి మాట్లాడుతుంటారు. ఎక్కడా నోరు జారరు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ప్రసంగాల్లో వాడివేడి పెరిగింది. కాంగ్రెస్ టార్గెట్ గా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ముస్లింలకు దేశసంపదనంతా దోచి పెడ్తారని మోదీ కామెంట్స్ చేశారు. మీకు రెండు ఇళ్లు ఉంటే ఒక ఇంటిని స్వాధీనం చేసుకుంటారని.. తాళిబొట్లు కూడా లాగేసుకుంటారని ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తగ్గించారని విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకోసం ఈ దేశాన్నంతా దోచిపెడ్తారని సంచలన ఆరోపణలు చేశారు.

మోదీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడూ ఆచితూచి మాట్లాడే మోదీ ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక రీజనేంటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు ముస్లింలను మోదీ టార్గెట్ చేశారని కొందరు చెప్తున్నారు. అయితే ఓటమి భయంతోనే మోదీ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఇప్పటికీ మోదీ ప్రభుత్వం ముస్లిం, మైనారిటీలను ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది. ఇప్పుడు కూడా మళ్లీ వాళ్లనే టార్గెట్ చేయడంపై వ్యూహమేంటని పలువురు ఆరా తీస్తున్నారు.

ఈసారి సొంతంగానే 370 సీట్లు సాధించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అదే జరిగితే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తుందని పలువురు భయపడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చేసి దేశాన్ని హిందూరాజ్యంగా ప్రకటిస్తారని, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆ భయాలకు బలం చేకూర్చేలా మోదీ ప్రసంగాలు ఉంటుండడంతో మైనారిటీల్లో అసంతృప్తి కనిపిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఓటమి భయంతోనే మోదీ ఇలా మాట్లాడుతున్నారని.. సెక్యులర్ పదాన్ని తొలగించేలా బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శిస్తోంది. మరి మోదీ మాటల వెనుక అంతరార్థమేంటనేది అంతుచిక్కడం లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :