రివ్యూ : 'హిడింబ' పాయింట్ కొత్తదే కానీ....దర్శకుడు తడబడ్డాడు!
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : ఎస్ వి కె సినిమాస్
తారాగణం : అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, షిజ్జు,
విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేక సుదాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు తదితరులు
సంగీతం : వికాస్ బాదిసా, సినిమాటోగ్రఫీ : బి రాజశేఖర్, ఎడిటర్ : ఎం ఆర్ వర్మ
కొరియోగ్రాఫర్లు : శేఖర్ విజె, యష్, మాటలు : కళ్యాణ చక్రవర్తి, సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి, ప్రణవం
ఆర్ట్ : షర్మిల యలిశెట్ట, ఫైట్స్ : జాషువా, రియల్ సతీష్
సమర్పణ : అనిల్ సుంకర, (ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్)
నిర్మాత : గంగపట్నం శ్రీధర్, దర్శకత్వం : అనీల్ కన్నెగంటి
విడుదల తేదీ : 20.07.2023
'హిడింబ' హిడింబి అనే పదానికే ఎంతో చరిత్ర ఉంది. మహా భారతంలో పాండవులు వనవాసంలో వున్నపుడు భీముడు హిడింబి లకు ఘటోత్కచుడు పుడతాడు. తన మాయలతో అభిమన్యుడుకి శశిరేఖాపరిణయం జరిపిస్తాడు. అయితే ఈ 'హిడింబ' టైటిల్ ఈ మధ్య కాలంలో ట్రైలర్ తో బాగా ఆకట్టుకుంది. అప్పుడెప్పుడో మంచు మనోజ్ తో ‘మిస్టర్ నూకయ్యా’ సినిమా తీసిన అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు ప్రధానపాత్రలో రూపొందిన ‘హిడింబ’ ప్రమోషనల్ కంటెంట్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించింది. ‘హిడింబ’ ఓ హైబ్రీడ్ జోనర్ చిత్రమని, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు చరిత్రని జోడించామని చిత్ర యూనిట్ చెప్పింది. మరి ఆ చరిత్రకి నేరపరిశోధన కలయిక సరిగ్గా కుదిరిందా? హిడింబ ప్రేక్షకులకు థ్రిల్ ని పంచిందా? అన్నది ఓ సారి చూద్దాం.
కథ:
నగరంలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ కి గురౌతుంటారు. ఈ కేసుని చేధించడానికి ఆధ్య ( నందిత శ్వేతా) ని స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తారు. అదే టీంలో అభయ్ (అశ్విన్ బాబు ) చేరతాడు. ఆద్య, అభయ్ ల మధ్య ఒక గతం వుంటుంది. ఇద్దరూ ఒకే చోట ట్రైనింగ్ అవుతారు. ఆధ్య, సివిల్స్ పాసై ఐపీఎస్ అవుతుంది. అభయ్ మాత్రం పోలీస్ క్యాడర్ లోనే ఉంటాడు. ట్రైనింగ్ లో దగ్గరైన ఈ ఇద్దరూ తర్వాత ఏవో కారణాల వలన విడిపోతారు. ఇక కేసులోకి వస్తే.. కిడ్నాప్ వెనుక వున్నది ఎవరు అని పరిశోధిస్తుండగా కాలాబండ ప్రాంతంలో బోయ (రాజీవ్ పిళ్లై) అనే ఓ కిరాతకుడు దీని వెనుక వున్నాడని నిర్ధారణ కి వస్తారు. బోయని అదుపులోకి తీసుకుంటారు. ఐతే బోయ పొలీసుల అదుపులో ఉండగానే మరో కిడ్నాప్ జరగడంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ కేసుని తీవ్రంగా పరిశోథిస్తున్న ఆధ్యకి ఈ కిడ్నాప్ ల వెనుక వున్న వ్యక్తికి సంబధించిన ఒక క్లూ దొరుకుతుంది. కిడ్నాపర్ కేవలం రెడ్ డ్రెస్ వేసుకున్న వారినే టార్గెట్ చేస్తున్నాడు. అలాగే ఓ గొర్రె తలని పోలిన మాస్క్ కూడా క్లూగా దొరుకుతుంది. ఈ రెండు క్లూలతో ఈ కేసుని అధ్య, అభయ్ ఎలా చేధించారు? ఈ కేసుకి 1908 లోని అండమాన్ నికోబార్ దీవిలో నివసించిన ఓ తెగకి లింక్ ఏమిటి ? చివరికి కిడ్నాపర్ దొరికాడా? అసలు ఎందుకు కిడ్నాపులు చేస్తున్నాడు? అనేది మిగతా కథ.
నటీనటుల హావభావాలు:
అభయ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అశ్విన్ బాబు కనిపిస్తాడు. పాత్రకు తగ్గ బాడీని పెంచాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో సరికొత్త మోడ్‌లో మెప్పిస్తాడు. చివర్లో తనలోని మరో కోణాన్ని కూడా ప్రదర్శిస్తాడు. ఇక నందితా శ్వేత పోలీస్ ఆఫీసర్‌గా మెప్పిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఓ చోట పర్వాలేదనిపిస్తుంది. ఇక మార్కండ్ దేశ్‌పాండే నటన, షిజు కారెక్టర్ సినిమాకు ప్రధానంగా నిలుస్తాయి. శుభలేఖ సుధాకర్ కనిపించినంతలో ఓకే అనిపిస్తారు. శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచె, రాజీవ్ కనకాల లతో పోల్చుకుంటే సిజ్జు పాత్రకు కొంత ప్రాధన్యత వుంటుంది. విలన్‌గా కనిపించిన రాజీవ్ పిళ్లై అంతగా భయపెట్టలేకపోయాడు. మకరంద్ దేశ్ పాండే ది కీలకమైన పాత్ర. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు పర్వాలేదనిపిస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు :
హిడింబ కథని చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఓ అర్ధరాత్రి, గుడ్లగూబ చూపు, ఒంటరిగా వున్న మహిళ సడన్ గా అదృశ్యమైపోవడం, భీవత్సమైన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్..ఈ సెటప్ అంతా చూస్తే చాలా ఎక్సయిటింగ్ కంటెంట్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించాడు. అయితే కేసు విచారణ మొదలౌతుందో ఒక్కసారిగా సినిమా గ్రాఫ్ పడిపోయింది. నేపధ్య సంగీతాన్ని టెర్రిఫిక్ గా చేశారు. కేజీఎఫ్ స్టయిల్ లో కొన్ని షాట్లు ఎడిట్ చేశారు. నిజానికి ఈ కథకు అలాంటి ఎడిటింగ్ అనవసరం. బహుశా మేము ట్రెండ్ లో వున్నామని నిరూపించుకోవడానికి తప్పితే ఆ ప్యాట్రన్ ఈ సినిమాకి అక్కర్లేదు. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా వుంది. సినిమా నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
హిడింబ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదే. నరమాంస భక్షకురాలు ప్రస్తుత సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. దాని కోసం సెటప్ చేసుకున్న థీమ్ కూడా బాగానే ఉంది. కాలాబండను ప్రశాంత్ నీల్ కేజీయఫ్ స్టైల్లో బాగానే డిజైన్ చేసుకున్నాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. అసలు ఈ కథను దర్శకుడు ఎలా చెప్పాలనే విషయంలోనే కన్ఫ్యూజ్ అయినట్టుగా, అలాంటి గందరగోళంలోనే సినిమా తీసేసినట్టు అనిపిస్తుంది. సినిమా చూసే ప్రేక్షకుడి మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది? ఆ టైంలో అలా ఉంటే.. మరి ఈ టైంలో ఇలా ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు బోలెడన్న ఎదురవుతాయి. కథను ముందుకూ వెనక్కి తీసుకెళ్తూ చూపించాడని అనుకుంటే.. స్క్రీన్ ప్లే గానీ, కథ గానీ అలా అనిపించదు. అంతా కూడా ప్రజెంట్‌లోనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కాన్సెప్ట్ వరకు కొత్తగానే అనిపించినా.. సినిమాగా తెరపై ఎక్కించడంలో దర్శకుడు తడబడ్డాడని ఇట్టే అర్థం అవుతోంది.
ఆ తడబాటు ప్రేక్షకుల్లోనూ కలిగే అవకాశం ఉంది.
సినిమా బాగుందే అని అనుకునేలోపు కొన్ని చిక్కు ప్రశ్నలు మెదడుని తడతాయి. లాజిక్స్ వదిలేసి సినిమాను చూస్తే పర్వాలేదనిపిస్తుంది. రెండు జోనర్లని కలిపి ఒక కొత్త తరహా కథ చెప్పే ప్రయత్నం చెయ్యడం మెచ్చుకొదగిన విషయమే. అయితే.. స్క్రీన్ ప్లే పరంగా మరింత వేగం పెంచి, విచారణ లో కొత్త పంధా అనుసరిస్తే ఫలితం మెరుగ్గా ఉండేది. మొత్తానికి హిడింబ సినిమాను చూసి బయటకు వచ్చేటప్పుడు క్లైమాక్స్‌లోని ఆ ట్విస్ట్ ఊపిరినిస్తుంది. అయితే ఆ ట్విస్ట్‌ను ప్రేక్షకులు ముందే కనిపెట్టేలా ఉంది. ఆ ఒక్క ట్విస్ట్ మాత్రం సినిమాకు ప్రాణంలా నిలిచే చాన్స్ ఉంది.