ASBL NSL Infratech

రివ్యూ : మెగాఫాన్స్ 'బ్రో'స్ కు పండగే పండగ

రివ్యూ : మెగాఫాన్స్ 'బ్రో'స్ కు పండగే పండగ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విత్ జీ స్టూడియోస్.
నటీనటులు : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం,
తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, రోహిణి, ఊర్వశి రౌటేలా అతిధి పాత్రలో సముద్ర ఖని, తదితరులు నటించారు.  
సంగీతం : ఎస్ థమన్, సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవ్,
ఎడిటర్ : నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ : ఏ. యస్. ప్రకాష్,
ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్ : వివేక్ కూచిబొట్ల,
నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్, స్క్రీన్ ప్లే - మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్,
కథ, దర్శకత్వం : పి.సముద్ర ఖని,
విడుదల తేదీ : 28.07.2023

మామ అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరించారు. అయితే తమిళ మాతృక 'వినోదయ సిత్తం' చిత్రం స్పల్ప మార్పులతో  మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రోజే విడుదలైన  'బ్రో' ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో సమీక్షలో చూద్దాం.

కథ:

ఇంటికి పెద్ద కొడుకైన మార్కండేయులు అలియాస్ మార్క్ (సాయి ధరమ్ తేజ్) తన చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో అన్ని బాధ్యతలు తనే నిర్వహించాల్సి వస్తుంది. ఇద్దరు చెల్లెల్లు, ఓ తమ్ముడి భవిష్యత్తు తనే ప్లాన్ చేస్తూ... మరింత ఎత్తుకు ఎదగాలని నిరంతరం శ్రమిస్తుంటాడు. అప్పటికే రమ్య (కేతిక శర్మ) ని ప్రేమిస్తాడు. ఉద్యోగం లో భాగంగా ఓ రోజు వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది. తిరుగు ప్రయాణం రోడ్ ద్వారా కారు లో వస్తుండగా... సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఫోన్ లో తన వారితో వీడియో కాల్ మాట్లాడుతుండగా... కారు రోడ్ ప్రమాదానికి గురి అవుతుంది డ్రైవర్ బతికి మార్క్ మరణిస్తాడు. తను ఇంకా జీవితం లో స్థిరపడలేదని.. తనని నమ్ముకున్న వాళ్లకు దారి చూపలేదని, తన జీవితానికి ఇంత తొందరగా ముగింపు ఇవ్వడం అన్యాయమ్ అని కాలం టైం (పవన్ కళ్యాణ్) అనే దేవుడితో మొరపెట్టుకుంటాడు. దాంతో 'కాలం' అనుగ్రహించి 90 రోజుల జీవిత కాలాన్ని పెంచుతాడు. అలా టైటాన్ పేరుతో మార్క్ తో పాటు భూలోకానికి వస్తాడు. మళ్ళీ ప్రాణం తో బ్రతికివచ్చిన మార్క్ 90 రోజుల్లో తాను అనుకున్నవన్నీ నెరవేర్చగలిగాడా? తను 90 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటానని తెలిసి కూడా రమ్య ను పెళ్లిచేసుకుంటాడా? ఈ 90 రోజుల్లో టైటాన్ సావాసం తో మార్క్ తెలుసుకుంది ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే!    

నటి నటుల హావభావాలు:

సినిమా ఆధ్యాంతం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల మధ్య సన్నివేశాలే సినిమాకు ప్రధానబలం. కాలం దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్, సినిమా మొదలైన 10 నిమిషాలకు పవన్ కళ్యాణ్ పాత్ర కనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలో వింటేజ్ మ్యానరిజం కనిపిస్తుంది. దానికి తోడు గత సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ సందర్భానుసారంగా సినిమాలో చొప్పించారు. మనిషి పాత్రలో సాయి ధరమ్ తేజ్ లు మెప్పించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరోక్షంగా విసిరే పొలిటికల్ పంచ్‌లకు ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. ఇక సాయి ధరమ్ తేజ్ మెలోడ్రామా పండించాడు. ఇటు సామాన్య ప్రేక్షకులను, పవన్ అభిమానులు శాటిస్ ఫై  అయ్యేలా సినిమా నడుస్తుంది. ఎక్కడా సినిమా బోర్ కొట్టదు. సాయి ధరమ్ తేజ్ చెల్లెలిగా చేసిన ప్రియా ప్రకాష్ వారియర్, ప్రేయసిగా చేసిన కేతిక శర్మ, తల్లిగా నటించిన రోహిణి తమ పాత్రలమేర నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, అలీ రెజా కొత్తగా నటించడానికి ఏమిలేదు. చిన్న పాత్రలో బ్రహ్మానందం ఓ మెరుపు లా మెరుస్తాడు.  

సాంకేతిక వర్గం పనితీరు:

సాంకేతికపరంగా సినిమా అద్భుతంగా వుంది. పాత్రల సంఘర్షణ, భావోద్వేగాలు బలంగా పండకపోయినా మాతృకలో చెప్పిన విషయాన్నీ తెలుగు ప్రేక్షకులకు వినోదాత్మకంగా ప్రధాన కథకు భంగం కలుగకుండా సముద్ర ఖని సక్సెస్ అయ్యారు. ‘బ్రో’ సినిమా త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు అయినా సరే  చాలా మందికి సినిమా చూశాక చాలా సంతృప్తి చెందుతారు. అంతలా ఆయన కలం నుంచి వచ్చిన కొన్ని మాటల బుల్లెట్లు పేలాయి. "భవిష్యత్ కాదు మనం ఇప్పడేలా బ్రతుకుతున్నామన్నది ముఖ్యం" "మన జీవితం మన భావితరాల కోసమే" "పుట్టుక మలుపు మరణం గెలుపు". ఇక సినిమాకు మరో బలం తమన్ నేపథ్య సంగీతం. ఎప్పటిలాగే తన సౌండ్స్‌తో అదరగొట్టారు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ నుంచి ఆయన కనిపించే ప్రతి సన్నివేశంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పాటలు అంతగా ఆకట్టుకోవు . సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవన్ కెమెరా పనితనం బాగుంది. చాలా సన్నివేశాలు ఇండోర్‌లో షూట్ చేసినవే. అయినప్పటికీ మంచి ఫీల్ కలిగించారు. ఈ సినిమాను చాలా వరకు వీఎఫ్ఎక్స్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే, కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ డొల్లతనం కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరిచయ సన్నివేశంలో నాసిరకం వీఎఫ్ఎక్స్ వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

ప్రతి మనిషి జీవితంలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే బ్రహ్మ రాత అంటారు! మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం ఎన్ని విన్యాసాలు చేసినా విధి ఆడించినట్టు ఆడాల్సిందే. ఆ విషయం తెలియక భవిష్యత్తు గురించి తెగ ఆలోచించేస్తూ, వర్తమానంలో తప్పులు చేస్తూ పోతే జీవితం ఉండదు, వర్తమానంలో మనం మనలా నిజాయతీగా బతికితేనే జీవితానికి అర్థం అని చెప్పడమే ‘బ్రో’ సినిమా ఉద్దేశం. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త కష్టపడి ఉంటే బాగుండేదనిపించింది. నిజానికి ఇది కమర్షియల్ సినిమా కథ కాదు. మంచి కథ తమిళంలో సముద్రఖని ఒక చిన్న సినిమాగా ఈ కథను చెప్పారు. కాకపోతే, తెలుగులో మాత్రం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ చేరికతో ఇది కమర్షియల్ సినిమాగా మారింది. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేశారు. అయితే, ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి వాణిజ్య అంశాలు వుండవు అంటే ఫైట్స్, చేజింగ్స్, రొమాన్స్, నరుక్కోవడాలు, కక్ష సాధింపులు అలాంటివేమీ ఇందులో లేవు. ఈ సినిమాకు జీవం పవన్ కళ్యాణ్. ఆయన భుజస్కంధాల మీదే సినిమా మొత్తం నడిచింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోని కనిపించనంత ఎనర్జిటిక్‌గా పవన్ కళ్యాణ్ కనిపించారు. వింటేజ్ పవర్ స్టార్‌ను చూపించారు. ఆయన స్టైలింగ్ కూడా అదిరిపోయింది. గతంలో ఆయన ఇలాంటి పాత్రే ‘గోపాల గోపాల’ సినిమాలో చేసినా.. అది కొంచెం ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఈ చిత్రం ఫ్యాన్స్‌ను మాత్రం ఊపేస్తుంది. సామాన్య ప్రేక్షకుడు ఒక సారి చూస్తే చాలు అనుకుంటాడు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :