ASBL NSL Infratech

అధిష్టానంపై బీజేపీ సీనియర్ల గుస్సా..!!

అధిష్టానంపై బీజేపీ సీనియర్ల గుస్సా..!!

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేనతో కలిసి పనిచేస్తోంది బీజేపీ. అందులో భాగంగా ఆ పార్టీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు దక్కాయి. ఇప్పటికీ అసెంబ్లీ అభ్యర్థులను మాత్రం బీజేపీ ప్రకటించలేదు. నిన్న పార్లమెంటు అభ్యర్థులను మాత్రం అనౌన్స్ చేసింది. ఆ జాబితా చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రజల సంగతి పక్కన బెడితే సొంత పార్టీ నేతలే ఆ లిస్టు చూసి షాక్ తిన్నారు. ఊహించని పేర్లు ఆ జాబితాలో కనిపించాయి. దీంతో పార్టీ సీనియర్ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో భాగంగా ఆరు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అరకు, అనకాపల్లె, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట స్థానాలకు ఆ పార్టీకి దక్కాయి. ఈ ఆరు స్థానాలకు అభ్యర్థులను ఒకే దఫా ప్రకటించింది బీజేపీ. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లె నుంచి సీఎం రమేశ్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి వరప్రసాద్, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. అయితే ఈ జాబితాలో మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్లలో ఒక్కరికి మాత్రమే సీటు దక్కింది. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పార్టీని నమ్ముకున్న వాళ్లకు, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే వాళ్లకు బీజేపీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని అందరూ భావిస్తారు. అయితే ఏపీ లిస్టు చూశాక అది నిజం కాదని అర్థమవుతోంది. అరకు నుంచి బరిలోకి దిగుతున్న కొత్తపల్లి గీత గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరారు. ఆమె పార్టీకోసం పనిచేసింది లేదు. కనీసం నియోజకవర్గానికి అందుబాటులో కూడా ఉండరు. ఇక అనకాపల్లె నుంచి సీఎం రమేశ్ ను దించుతోంది. సీఎం రమేశ్ కూడా గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. పార్టీకోసం కష్టపడిందేమీ లేదు. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఈమె కూడా కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరారు. నర్సాపురం నుంచి పోటీ చేస్తున్న శ్రీనివాస వర్మ ఒక్కరే పార్టీకోసం మొదటి నుంచి పనిచేస్తున్న వ్యక్తి. ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని కేడర్ స్వాగతిస్తోంది. ఇక తిరుపతి నుంచి పోటీ చేస్తున్న వరప్రసాద్.. పార్టీలో చేరిన రోజే టికెట్ దక్కించుకున్నారు. ఆయన్ను వైసీపీ పక్కన పెడితే టికెట్ కోసం జనసేన చుట్టూ చేరారు. చివరకు బీజేపీలో చేరి టికెట్ సొంతం చేసుకున్నారు. రాజంపేట నుంచి పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరి ఏడాది కావస్తోంది. అయినా పార్టీ కోసం పెద్దగా పనిచేసింది లేదు. పెద్దోళ్లు వచ్చినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనరు.

ఈ లిస్టు చూసిన తర్వాత పార్టీకోసం మొదటి నుంచి పనిచేస్తున్న సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు రగిలిపోతున్నారు. సోము వీర్రాజు రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే ఆ సీటును పురంధేశ్వరికి ఇచ్చారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకు జీవీఎల్ ఆసక్తి కనబరిచారు. చాలాకాలంగా ఆయన విశాఖలో పలు కార్యక్రమాలు చేపడుతూ హడావుడి చేశారు. అయితే అది ఆయనకు దక్కలేదు. ఇది ఏకంగా టీడీపీకి కేటాయించారు. విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ సీటు కూడా టీడీపీకి వెళ్లింది. దీంతో వీళ్లంతా గుర్రుగా ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :