ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అందరి మదిలో 'అయోధ్య'..

అందరి మదిలో 'అయోధ్య'..

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరినోట అయోధ్య రామయ్య ఆలయం విశేషాలపై చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్త హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా, భక్తిభావంతో పూజిస్తున్న శ్రీరామస్వామికి.. అయోధ్యలో భవ్య,దివ్య ఆలయ నిర్మాణం అందుబాటులోకి రానుంది. ఈనెల 16న అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు మొదలు కానున్నాయి. 17న 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. 20న సరయూ నదీజలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారు. వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు.

రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతున్నప్పటికీ వారం ముందునుంచే సందడి మొదలుకానుంది. ఇందులో భాగంగా విగ్రహ పత్రిష్టాపనకు మూడు రోజుల ముందు ప్రపంచంలోనే అతిపెద్ద దీపం అయోధ్యలో వెలిగించనున్నారు....

28 మీటర్ల పొడవు - వెడల్పు ఉన్న ఈ దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాళ్ళ నూనె అవసరమవుతోంది. ఈ దీపం ఘనతను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రతువుకు దశరథ్ దీప్‌గా నామకరణం చేసిన ఆలయ ట్రస్ట్, దీపపాత్ర తయారీకి 100 పుణ్యక్షేత్రాల్లోని మట్టితో పాటు నదులు, సముద్రాల నుంచి పుణ్య జలాలు సేకరించారు. పాకిస్థాన్‌కు చెందిన హీంగ్లాజ్ నుంచి, నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి కూడా మట్టిని తెప్పించారు. పురాణాలను అధ్యయనం చేసి...త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తోన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమిద తయారీ కోసం 108 మంది కళాకారులు శ్రమిస్తుండగా...7 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. దీపం వత్తి తయారీకి 1.25 క్వింటాళ్ళ పత్తిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీపం తయారీకి వినియోగించే అధునాతన యంత్రం కోల్‌కతా నుంచి తెప్పించారు.

తులసివాడి

త్రేతాయుగంలో శ్రీరాముడు తన కుటుంబంతో కలిసి తులసివాడిలో పూజలు చేసేవాడని చెబుతారు. సరయూ ఒడ్డున స్నానమాచరించి ఆ తర్వాత తులసివాడిలో పూజలు నిర్వహించేవాడు. అందుకే ఆ ప్రదేశాన్ని రామ్ ఘాట్ అని అంటారు. ప్రభుత్వ పత్రాల్లో కూడా ఈ పేరుతోనే ఉంది. ఈ ప్రదేశంలోనే అతిపెద్ద దీపాన్ని వెలిగించనున్నారు..

పర్యాటక ప్రదేశంగా దశరథ మహారాజు సమాధి

శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు మరణించిన తర్వాత ఆయనకు అయోధ్యలోనే దహన సంస్కారాలు నిర్వహించి సమాధి నిర్మించినట్లు తెలుస్తోంది. రామాలయం ప్రారంభం తర్వాత భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో ప్రాశస్త్యం ఉన్న ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తోంది. అందులో ఈ దశరథ్‌ సమాధి స్థల్‌ కూడా ఉంది. ఈ ప్రాంతం రామమందిరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరయు నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతాన్ని బిల్వహరి ఘాట్‌ అంటారని స్థానిక పూజారి మహంత్‌ దిలీప్‌ దాస్‌ చెప్పారు. ఇక్కడ దశరథుడిని దహనం చేసి ఆ చితాభస్మాన్ని సమాధిలో భద్రపరచారని వెల్లడించారు. ప్రస్తుతం రామమందిరం నుంచి బిల్వహరి ఘాట్‌కు చేరుకునేందుకు నాలుగు వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇక్కడ దశరథుని సమాధితో పాటు రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుల పాద ముద్రలను తీర్చిదిద్దారు. లంక నుంచి రామలక్ష్మణులు తిరిగి వచ్చాక దశరథుని సమాధికి వచ్చి ఆశీస్సులను తీసుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికను హృద్యంగా తీర్చిదిద్దారు. నిర్మాణమవుతున్న ఆలయ వైభవాన్ని ప్రతిఫలిస్తూ దేవాలయ, బాల రాముడి చిత్రాలను ముద్రించారు. ఆహ్వానపత్రికతో పాటు అందిస్తున్న చిన్న పుస్తకంలో రామజన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ముఖ్య నాయకుల వివరాలను క్లుప్తంగా వివరించారు. శుభముహూర్తాన్ని 2024 జనవరి 22, మధ్యాహ్నం 12.20లుగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆలయ ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ల సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది.

సాధు సంతులు, మఠాధిపతులు సహా మొత్తం 7000 మందిని దేవాలయ ట్రస్టు ఆహ్వానించింది. దేవాలయ కాంప్లెక్స్‌ను సంప్రదాయ నాగరా పద్ధతిలో నిర్మిస్తున్నారు. అది 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఉండనుంది. మూడంతస్తుల్లో నిర్మిస్తున్న దేవాలయంలో ప్రతి అంతస్తు ఎత్తు 20 అడుగులు ఉంటుంది. 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. అందంగా రూపొందించిన ఏనుగులు, సింహాలు, హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహాలను రామమందిరం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద అమర్చనున్నారు. అయోధ్యలో ఈ నెల 19 నుంచి 21 వరకూ ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ గాలిపటాల పండగను నిర్వహించనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :