Radha Spaces ASBL

రివ్యూ : ప్రేమకథల్లో ఈ 'బేబీ' కథే వేరయా!

రివ్యూ : ప్రేమకథల్లో ఈ 'బేబీ' కథే వేరయా!

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5

నిర్మాణ సంస్థ: మాస్ మూవీ మేకర్స్
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, లిరిష,
కుసుమ, హర్ష, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు

సంగీతం : విజయ్ బుల్గానిన్ ఛాయాగ్రహణం : ఎం.ఎన్. బాల్ రెడ్డి ఎడిటర్: విప్లవ్ నైషధం,
ఎగ్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ దాసరి, సహా నిర్మాత: ధీరజ్ మొగిలినేని
నిర్మాత : ఎస్.కె.ఎన్ రచన, దర్శకత్వం : సాయి రాజేష్ నీలం

విడుదల తేదీ: 14.07.2023

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన తారలుగా సాయి రాజేష్ దర్శకత్వం వహించిన సినిమా 'బేబీ'. ఈ రోజు జులై 14న థియేటర్లలో విడుదలయింది. జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో' కు సాయి రాజేష్ రచయిత. ఆ సినిమా తర్వాత సాయి రాజేష్ నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ హీరో. 'అల వైకుంఠపురములో' సహా కొన్ని సినిమాల్లో, 'సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్' వెబ్ సిరీస్‌లో నటించిన వైష్ణవి చైతన్య ఈ సినిమాతో కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ మరో హీరో. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం!

కథ:

సృష్టి లో ప్రతి ఒక్కరిలో ప్రేమ పుడుతుంది.. అలా ప్రేమ పుట్టలేదంటే అది పచ్చి అబద్దం.. ప్రేమని ఆస్వాదించడమనేదే నిజం. ‘తొలి ప్రేమకి మరణం లేదు.. అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’.. అలా సమాధి చేయబడిన ఆనంద్, విరాజ్, వైష్ణవిల ముక్కోణపు ప్రేమకథే ఈ ‘బేబీ’. ఎదుటోడ్ని మోసం చేస్తే ఎలాగోలా బయటపడొచ్చు.. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నాశనమైపోతావ్.. అనే వాస్తవ పరిస్థితిని కళ్లకి కట్టిన భావోద్వేగ ప్రేమకథే ‘బేబీ’ ప్రేమించినోడు హగ్ ఆడిగితే చేతులు అడ్డుపెట్టి హగ్ ఇచ్చేటంత పవిత్రమైన బస్తీ పోరీ.. చదువు పేరుతో చెడు సావాసాలు బాట బట్టి.. తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా.. ఇద్దరు యువకుల జీవితాలను సర్వ నాశనం చేసిపారేసింది. ఆ పోరీ పేరే వైష్ణవి అలియాస్ బేబీ (వైష్ణవి చైతన్య). ఎదురింటిలో ఉన్న అబ్బాయి ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను ప్రేమిస్తుంది. ఆమెను అతడూ ప్రేమిస్తాడు.

అయితే... టెన్త్ ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ అవుతాడు. వైష్ణవి ఇంజనీరింగ్ జాయిన్ అవుతుంది. కొత్త పరిచయాలు వైష్ణవిలో మార్పుకు కారణం అవుతాయి. విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గర అవుతుంది. పబ్బులో అతడితో రొమాన్స్ చేస్తుంది. ఓ సందర్భంలో హీరోయిన్‌ని హీరో.. ల...జ అని తిడతాడు. తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? పదో తరగతి నుంచి ఇంటి ఎదురుగా ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్న సంగతి విరాజ్‌కు తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆనంద్, విరాజ్... ఇద్దరిలో వైష్ణవి ఎవరిని ప్రేమించింది? తెలిసీ తెలియని వయసులో ఆమె తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఆనంద్, విరాజ్‌ జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? చివరికి ఏమైంది? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

నటి నటుల హావభావాలు:

చిత్రం లో ముఖ్యంగా చెప్పుకోవలసింది టైటిల్ పాత్రధారినే! యూట్యూబ్‌లో 'సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్' వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటు.. మరికొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. బేబీ సినిమాతో ఈమె కథానాయికగా పరిచయం అయ్యింది. పొరుగురాష్ట్రం అమ్మాయిలను పట్టుకుని రండి అనే ఆలోచన ఉన్న దర్శకులకు, నిర్మాతలకు మన తెలుగు పోరీ వైష్ణవి.. తొలి చిత్రంతోనే తెల్ల తోలు పొరుగు హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా సినిమాకు కావలసిన అన్ని యాంగిల్స్ లో యాక్టింగ్‌తో చించిపాడేసింది.. ముద్దులు, హగ్‌లు, రొమాంటిక్ సీన్లే కాదు.. అంతకుమించే చేసింది. గత ఏడేళ్లుగా వెండితెరపై హీరోయిన్ ఛాన్స్‌ కోసం కసిగా ఎదురుచూస్తున్న ఈ ‘బేబీ’లో తనకున్న మల్టీటాలెంట్ మొత్తాన్ని దర్శకుడు సాయి రాజేష్ కు అప్పగించింది.

అసలు వైష్ణవి పాత్రకి ఈమెను తప్ప వేరొకర్ని ఊహించుకోలేం అంటే.. ఆమె ఎంత బాగా చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడూ వైష్ణవి తిట్టుకోకుండా అయితే థియేటర్ నుంచి బయటకు రాడంటే.. ఆ పాత్ర ఎంతలా మైండ్‌లో నాటుకుపోతుందో అర్ధం చేసుకోవచ్చు. క్లైమాక్స్‌లో హీరోయిన్ పెళ్లి ట్విస్ట్ అయితే అస్సలు జీర్ణించుకోలేం. అప్పటికే వైష్ణవిని ఛీ ఛీ ఈ పిల్ల ఇలా చేసిందేంట్రా అని తిట్టుకుంటాం. ఈ చిత్రం లో కొత్త ఆనంద్ దేవరకొండ కనిపించారు. మనం ఇప్పటి వరకు చూసిన ఆనంద్ వేరు, ఈ సినిమాలో ఆనంద్ వేరు. అతని నటనలో సహజత్వం కనిపించింది. బస్తీలో ఆటో డ్రైవర్లు, పదో తరగతిలో ప్రేమలో పడిన యువకులు ఎలా ఉంటారో? అలా కనిపించారు, నటించారు.

ఎమోషనల్ సీన్లు బాగా చేశారు. నటుడిగా ఆనంద్ దేవరకొండ బెస్ట్ సినిమా ఇది. ఇంతకు ముందు చేసిన సినిమాల్లో విరాజ్ అశ్విన్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మరోసారి మంచి నటన కనబరిచారు. సంపన్న కుటుంబంలో జన్మించిన యువకుడిగా విరాజ్ చక్కగా చేశారు. ఎమోషన్స్ కూడా పలికించారు. హీరో స్నేహితులుగా హర్ష, సాత్విక్ పాత్రలు పరిమితమే. ఉన్నంతలో ఇద్దరూ బాగా చేశారు. నాగబాబు నటించడం వల్ల తండ్రి పాత్రకు హుందాతనం వచ్చింది. ఓ ముఖ్యమైన సన్నివేశంలో ఆయన నటన ఆకట్టుకుంటుంది.

సాంకేతిక వర్గం పనితీరు:

‘కలర్ ఫోటో’ చిత్రానికి రచయితగా జాతీయ పురస్కారం అందుకున్న సాయి రాజేష్.. యూత్‌కి కనెక్ట్ అయ్యే అంశాలతో ‘బేబీ’ చిత్రాన్ని మలిచారు. ప్రేమకథ అంటేనే రొటీన్.. కానీ దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే.. ఆ కథ కనెక్ట్ అయ్యిందా ఎన్నిసార్లు చూసిన కథ అయినా మళ్లీ మళ్లీ చూసేట్టు చేస్తుంది. అలా చూసేసిన కథని ఇంకోసారి చూసేట్టు చేయడంలోనే దర్శకుడి నేర్పు దాగి ఉంటుంది.. అలాంటి నేర్పరితనం సాయి రాజేష్‌లో చాలానే ఉందనిపించింది బేబీ సినిమా ద్వారా. ఫ్రెండ్స్ అని.. బెస్ట్ ఫ్రెండ్ అని.. లవర్ అని.. డేటింగ్ అని.. తెలిసీ తెలియని వయసులో అమ్మాయిలు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించారు. యూత్‌ని రిఫ్లెక్ట్ చేసేలా వాస్తవ పరిస్థితుల్ని కళ్లకి కట్టారు. రొటీన్ కథని తెరపై చూపిస్తూనే.. బలమైన భావోద్వేగ సన్నివేశాలతో యూత్‌తో విజిల్స్ వేసేట్టు చేశాడు. ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్‌తో అలా వెళ్తూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ బ్లాగ్‌తో గుండెల్ని బరువెక్కించేశాడు దర్శకుడు. కొన్ని మాటలు థియేటర్లలో ఆటం బాంబుల్లా పేలతాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మీద అభిమానాన్ని కూడా చూపించారు.

'గుండెలపై కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వరూ కొట్టలేరు' - 'బేబీ' సినిమాలో వైష్ణవి చైతన్య డైలాగ్. నిజమే... 'బేబీ'లో కొన్ని మాటలు ప్రేక్షకుల గుండెలపై గట్టిగా కొడతాయి. బలమైన ముద్ర వేస్తాయి. యూత్‌కి కనెక్ట్ అయ్యే ఒక్క సాంగ్ ఉంటే సినిమా ఫేట్ మారిపోతుంది.. ఆ పాటే ప్రేక్షకుల్ని థియేటర్స్‌ వైపు నడిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఆరు పాటలూ ఫేట్ మార్చేవే. అంత మంచి మ్యూజిక్ అందించారు కాకినాడ కుర్రాడు విజయ్ బుల్గానిన్. పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. కెమెరా వర్క్ అందంగా ఉంది. నిడివి ఇంకొంచెం తగ్గిస్తే బావుండేది. నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. అతను పీఆర్ఓ కావడంతో ప్రమోషన్స్ పల్స్ పట్టాడు. మాస్ ఆడియన్స్ టు క్లాస్ ఆడియన్స్‌ ఏ ఒక్కర్నీ వదలకుండా.. బేబీని యూత్ వద్దకు తీసుకెళ్లాడు. కంటెంట్‌ని నమ్మాడు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఖర్చుచేశారు. మరీ ఈయన తొడలకొట్టి మీసం మెలేసినంత సీన్ లేదు కానీ.. మంచి సినిమా అందించారని చెప్పొచ్చు.

విశ్లేషణ:

పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి ?, చిన్న చిన్న పొరపాట్లు కారణంగా యువత తమ లైఫ్ ల్లో ఎలా బ్యాలెన్స్ తప్పి పోతున్నారనే కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. సాయి రాజేష్ రచన, దర్శకత్వంలో బలమైన సన్నివేశాలు, సమాజాన్ని కళ్ళ ముందు ఉంచే కథ ఉన్నాయి. పాటలు మనసును హత్తుకుంటాయి. హీరో హీరోయిన్లు ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రీ ఇంటర్వెల్ వరకు 'బేబీ' కథ నిదానంగా సాగుతుంది. పాఠశాలలో ప్రేమకథ ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

అయితే... మధ్యలో మంచి పాటలు మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర అసలు కథ, కథలో కాన్‌ఫ్లిక్ట్ మొదలైంది. 'ప్రేమిస్తే'తో పాటు కొన్ని సినిమాలు గుర్తు రావచ్చు. గుడ్ కంటెంట్ తో పాటు డీసెంట్ టేకింగ్, మేకింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచాయి. ఐతే, స్క్రీన్ ప్లే లో స్లో నేరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. కానీ, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తుండి పోయే సినిమా 'బేబీ'.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :