ASBL NSL Infratech

బందరు నుంచి తెరపైకి కొత్త వ్యక్తి..!? జనసేన ట్విస్ట్ ఇవ్వబోతోందా..?

బందరు నుంచి తెరపైకి కొత్త వ్యక్తి..!? జనసేన ట్విస్ట్ ఇవ్వబోతోందా..?

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్ని అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా పూర్తి చేయలేదు. మెజారిటీ సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసినా కొన్ని కీలక సీట్లకు మాత్రం అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలో జనసేన ఆచితూచి అడుగులు వేస్తోంది. అసంతృప్తులను దారికి తెచ్చుకుంటూ కేండిడేట్స్ ను సిద్ధం చేస్తోంది. అయితే జనసేనకు కేటాయించిన పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికీ బందరు పెండింగులో ఉంది. అయితే ఓ కీలక నేత కోసమే దీన్ని పెండింగులో పెట్టారనే టాక్ వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులను ప్రకటించేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. అసెంబ్లీల్లో పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ అసెంబ్లీలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అలాగే మచిలీపట్నం పార్లమెంటు సీటును కూడా పెండింగులో పెట్టింది. వాస్తవానికి మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ సీటు నుంచి మళ్లీ పోటీ చేసేందుకు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు.

మచిలీపట్నం సీటు కచ్చితంగా బాలశౌరికే దక్కుతుందని అందరూ ఆశించారు. జనసేన ప్రకటించే మొదటి లిస్టులోనే బాలశౌరి పేరు కూడా ఉంటుందనుకున్నారు. అయితే అలా జరగలేదు. ఇప్పటికీ బాలశౌరికి టికెట్ కన్ఫామ్ కాలేదు. ఆయన్ను అవనిగడ్డ అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే బందరులో ప్రచారం ప్రారంభించిన బాలశౌరి ఇప్పుడు దానికి స్వస్తి చెప్పి పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మచిలీపట్నం పార్లమెంటు బరి నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే బందరు పార్లమెంటు స్థానానికి వంగవీటి రాధాను తెరపైకి తెచ్చింది జనసేన. వంగవీటి రాధాను పార్టీలోకి లాక్కునేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. రాధా వస్తే మచిలీపట్నం సీటు ఇస్తామని ఆఫర్ చేశారు. అయినా రాధా మాత్రం ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించలేదు. జనసేన తరపున పార్లమెంటు బరిలో దిగేందుకే ఆయన వైసీపీ చేరలేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బందరు పార్లమెంటు నుంచి పవన్ కల్యాణ్ లేదంటే నాగబాబు కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే అది జరగకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వంగవీటి రాధా లేదంటే బాలశౌరికే ఎక్కువ ఛాన్స్ ఉంది. బాలశౌరి పార్లమెంటు బరిలో నిలిస్తే వంగవీటి రాధా అవనిగడ్డలో దిగుతారు. లేదంటే రాధా బందరు పార్లమెంటుకు, బాలశౌరి అవనిగడ్డకు పోటీ చేయొచ్చు. వైసీపీ సామాజిక సమీకరణాలకు బ్రేక్ వేసేందుకే బందరు పార్లమెంటు బరి నుంచి వంగవీటి రాధా దింపేందుకు పవన్ కల్యాణ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :