ASBL NSL Infratech

అంతుచిక్కని ఆంధ్రప్రదేశ్ రాజకీయం!

అంతుచిక్కని ఆంధ్రప్రదేశ్ రాజకీయం!

·       మేమంతా సిద్ధం అంటున్న జగన్
·       యుద్ధానికి మేం కూడా రెడీ అంటున్న కూటమి
·       అవినీతి, అభివృద్ధి మధ్య వార్ అంటున్న టీడీపీ
·       జగన్ ఓటమే ధ్యేయమంటున్న జనసేన
·       గందరగోళంలో కమలం
·       సీట్ల కంటే ఓట్లపైనే కాంగ్రెస్ ఆశలు!
·       అంతుచిక్కని జనం నాడి..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. అధికార, విపక్ష కూటమి ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) ఈసారి కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. అభ్యర్థులను కూడా ఖరారు చేశాయి. సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతుండగా వాళ్లను దారికి తెచ్చుకనేందుకు పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిస్థితి కూటమిలో ఎక్కువగా కనిపిస్తోంది.

2019లో మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి మాత్రం నాలుగో విడతలో జరిగేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిలో 18న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్లు పరిశీలిస్తారు. 29 వరకూ నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు సమయం ఉంటుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఎన్నికలకు సుదీర్ఘ సమయం ఉండడంతో పార్టీలన్నీ ఈసారి కాస్త నెమ్మదిగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఈసారి పార్టీలన్నీ మంచి దూకుడు మీదున్నాయి. నామినేషన్లకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశాయి. దీంతో అభ్యర్థులంతా జనంలోకి వెళ్లేందుకు తగిన సమయం దొరికింది. అదే సమయంలో అసంతృప్తులను బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు పార్టీల హైకమాండ్స్ కు కూడా వీలవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి హారాహోరీ పోరు తప్పేటట్లు లేదు. ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలనే నమ్ముకుని ముందుకెళ్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. బాబుతోనే అభివృద్ధి సాధ్యం అంటూ కూటమి చెప్తోంది. అటు జగన్, ఇటు చంద్రబాబు సభలకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో ఓటరు నాడిని పసిగట్టడం కూడా కష్టంగా ఉంది.

వైసీపీ పాలనకు రెఫరెండం..!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు రెఫరెండం లాంటివి. తన హయాంలో చేసినన్ని పనులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని ఆ పార్టీ అధినేత జగన్ చెప్తున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. తన వల్ల మేలు జరిగింటేనే తనకు ఓటేయాలని.. లేకుంటే వద్దని స్పష్టం చేస్తున్నారు జగన్. ఈ ఐదేళ్లలో పార్టీలకతీతంగా అందరికీ మేలు చేశామని.. 90 శాతం కుటుంబాలకు ఏదో ఒక రూపంలో మేలు జరిగిందనేది జగన్ మాట. అందుకే ఈ ఎన్నికలు వైసీపీకి రెఫరెండం అని చెప్పొచ్చు. తన పాలన బాగుంటే వైసీపీకి జనం మళ్లీ పట్టం కడతారు. నచ్చకపోతే ఓడిస్తారు.

ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో అభ్యర్థుల ఎంపికలో జగన్ ఈసారి ఆచితూచి అడుగులు వేశారు. మార్చి 16న ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగుల్లో చాలా మందిని పక్కన పెట్టారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలకు జగన్ సీట్లు ఇవ్వలేదు. 68 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. మొత్తంగా 99 స్థానాల్లో అభ్యర్థులు మారారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చినట్లు ప్రకటించారు జగన్. గత ఎన్నికల్లో అభ్యర్థి బలాన్ని నమ్ముకున్న జగన్ ఈసారి మాత్రం సామాజిక సమీకరణకు పెద్దపీట వేశారు. అయితే సీట్లు దక్కని నేతలు ఇప్పటికే చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. సీట్లు దక్కని మరికొంతమంది లోలోపల రగిలిపోతున్నారు. వీళ్లంతా మనస్ఫూర్తిగా పనిచేస్తారా అనే భయం పార్టీని ఇప్పటికీ వెంటాడుతోంది. అయితే సీట్లు దక్కని నేతలకు అధికారంలోకి రాగానే మంచి పదవులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.

అభ్యర్థుల ప్రకటన పూర్తవగానే జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రచారం మొదలు పెట్టారు. మార్చి 27న ఇడుపులపాయలో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత బస్సు యాత్ర మొదలు పెట్టారు. జగన్ యాత్ర 21 రోజులపాటు సాగనుంది. గతంలో సిద్ధం సభలు జరిగిన చోట్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం సభలు జరిగేలా యాత్ర రూట్ మ్యాప్ రెడీ చేశారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం వివిధ వర్గాలతో మమేకమవుతారు.. చర్చలు జరుపుతారు.. సాయంత్రం బహిరంగసభలో పాల్గొంటారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా గెలిచి సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన శైలిలో ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. పూర్తిగా సంక్షేమ పథకాలనే జగన్ నమ్ముకున్నారు. సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలను ఈ ఐదేళ్లలో లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు చెప్తున్నారు జగన్. అయితే అభివృద్ధి అంతంతమాత్రంగానే జరగడంతో వైసీపీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఎన్డీయే కూటమి కుదుట పడినట్లేనా..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జగన్ ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి టీడీపీ, జనసేన. అయితే బీజేపీ కూడా తమతో కలిసొస్తే బాగుంటుందని భావించిన ఆ రెండు పార్టీలూ ఆమేరకు చర్చలు జరిపాయి. చివరకు బీజేపీతో జరిగిన చర్చలు ఫలించాయి. మూడూ ఉమ్మడిగా పని చేయాలని నిర్ణయించుకున్నాయి. సీట్లు కూడా సర్దుబాటు చేసుకున్నాయి. అందులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగనుండగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు దక్కాయి. ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించిన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ ఎక్కువగా సంక్షేమంపైన ఫోకస్ చేస్తుండగా కూటమి నేతలు మాత్రం జగన్ అవినీతి, అక్రమాలు, అభివృద్ధిలేమిని ఎత్తి చూపుతున్నారు.

పొత్తు కుదిరింది.. కానీ..!

ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు ఆయా పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. పలు స్థానాల్లో సీట్లు లభించని నేతలు అలక వహించారు. పొత్తులో భాగంగా టీడీపీ మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. జనసేన, బీజేపీలకు సీట్లు ఇవ్వడంతో అక్కడ ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. వాళ్లలో కొంతమంది మెత్తబడగా మరికొందరు ఇప్పటికీ అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వాళ్లను దారికి తెచ్చుకోవడం తలకు మించిన భారంగా ఉంది. దారికి తెచ్చుకోవడం ఒక ఎత్తయితే వాళ్లను బీజేపీ, జనసేన అభ్యర్థులతో కలిసి పనిచేసేలా చూడడం మరొక ఎత్తు. ఈ విషయంలో చంద్రబాబుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జనసేన పరిస్థితి కూడా ఇంతే. కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎక్కువమంది పోటీ పడుతుండగా.. కొన్నిచోట్ల అభ్యర్థులు లేకపోయినా సీట్లు దక్కించుకున్నారు. అభ్యర్థులున్న చోట ఒక రకమైన తలనొప్పి ఉంటే... లేని చోట్ల టీడీపీ అసంతృప్తుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక బీజేపీ అభ్యర్థులు, కేడర్ ఇప్పటికీ గడప దాటట్లేదు. టీడీపీ, జనసేన కేడర్ కలిసి పనిచేస్తుండగా బీజేపీ శ్రేణులు మాత్రం ఇంకా కూటమిలో కీలక పాత్ర పోషించట్లేదు. అంటీముట్టనట్టే ఉంటున్నాయి.

తెలుగుదేశం పార్టీకి చావోరేవో..!

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అధినేత చంద్రబాబు మొదలు చోటామోటీ లీడర్ల వరకూ ఎంతోమంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ వారిపై కేసులు అలాగే ఉన్నాయి. మరోవైపు పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలవడం ఆ పార్టీకి అత్యవసరం. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జనసేన, బీజేపీని కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. బీజేపీతో కలవడం చాలా మంది టీడీపీ నేతలకు ఇష్టం లేకపోయినా కేంద్రంలో ఆ పార్టీ పాత్ర దృష్ట్యా చంద్రబాబు తలొగ్గారు. పొత్తుల విషయాన్ని పక్కన పెడితే అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఈసారి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేశారు. సీనియర్లు చాలా మందిని పక్కన పెట్టారు. అనేక సర్వేల అనంతరం క్యాండిడేట్స్ ను ఎంపిక చేశారు. తెలుగుదేశం అంటేనే సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసే పార్టీ అనే పేరుంది. అయితే ఈసారి మాత్రం సామాజిక సమీకరణాల కంటే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకే చంద్రబాబు మొగ్గు చూపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశంలో పెద్ద దుమారమే రేపింది. చాలా చోట్ల సీట్లు దక్కని నేతలు రగిలిపోయారు.

ఉండి, ధర్మవరం, శ్రీకాకుళం, పాతపట్నం, అనపర్తి, సత్యవేడు, తెనాలి, సర్వేపల్లి, తిరుపతి, అవనిగడ్డ, మైలవరం, పెనమలూరు అసెంబ్లీ స్థానాల్లో నిరసన జ్వాలలు రేగాయి. అయితే మెజారిటీ స్థానాల్లో అసంతృప్తులను టీడీపీ అధినేత బుజ్జగించగలిగారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల కొంతమంది నేతలు గుర్రుగానే ఉన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. మార్చి 27 నుంచి ప్రజాగళం యాత్ర మొదలైంది. రోజుకు మూడు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఆయన షెడ్యూల్ రెడీ అయింది. చిత్తూరు జిల్లా మొదలైన ఆయన యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగియనుంది. ఈసారి లోకేశ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలకు కాకుండా మంగళగిరికి మాత్రమే పరిమితం అవడం విశేషం.

జనసేన త్యాగం.. పవన్ యుద్ధం..!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పని చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. మొదటి నుంచి ఆయన ఇదే మాట చెప్తున్నారు. జగన్ ను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తానని.. ఎన్ని మాటలైనా పడ్తానని ప్రకటించారు. అన్నట్టుగానే తమ కూటమిలోకి బీజేపీని తీసుకురావడంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. పొత్తులో భాగంగా తాను అన్ని స్థానాల్లో పోటీ పరిస్థితి ఉండదని తెలిసీ అంగీకరించారు. కొంతమంది నేతలు పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించారు. మొదట 24 సీట్లు అనుకున్నారు కానీ తర్వాత బీజేపీకోసం మరో 3 సీట్లను త్యాగం చేశారు. అభ్యర్థులను కూడా ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలు నియోజకవర్గాల్లో నిరసనలు తప్పలేదు. అయితే కూటమికోసం త్యాగాలు తప్పవని.. పార్టీ నిర్ణయానుసారం నడుచుకోవాలని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. అసంతృప్త నేతలను చాలావరకూ దారికి తెచ్చుకోగలిగారు. టీడీపీతో జనసేన కేడర్ ఇప్పటికే కలిసి పనిచేస్తోంది. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికీ జాయిన్ కాలేదు. బీజేపీ వల్ల తాము సీట్లు కోల్పోవాల్సి వచ్చిందనే కోపం జనసైనికుల్లో కనిపిస్తోంది.

2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. అయితే ఆ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. జనసేనకు 5.53శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సాక్షాత్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.  ఇది అనేక విమర్శలకు తావిచ్చింది. వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ టార్గెట్ గా అనేక సెటైర్లు వేసేవారు. వాటన్నిటికీ ఈసారి సమాధానం చెప్పాలనేది పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఈసారి టీడీపీ, బీజేపీని కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ మార్చి 30 నుంచి ప్రచారభేరి మోగించారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రచారం చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. తొలి మూడు రోజులు పిఠాపురంలో ప్రచారం చేసిన అనంతరం ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తాను సిద్ధం చేసుకున్న వారాహి వాహనం పైనే పవన్ కల్యాణ్ ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికలయ్యేంత వరకూ పిఠాపురం కేంద్రంగానే అన్ని కార్యక్రమాలు చేపట్టేలా పవన్ కల్యాణ్ షెడ్యూల్ రెడీ చేసుకున్నారు.

కూటమిలో కమలానిదే పెత్తనం?

తీస్ రీ బార్ చార్ సౌ కీ పార్.. అనేది ఈసారి బీజేపీ నినాదం. ఇందుకోసం ఎన్డీయే కూటమిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఏపీలో తెలుగుదేశం పార్టీతో జత కలిసింది. జనసేన మొదటి నుంచి బీజేపీతో ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు దక్కాయి. ఎచ్చెర్ల, విశాఖ ఉత్తరం, అరకు వ్యాలీ (ఎస్టీ), అనపర్తి, కైకలూరు, విజయవాడ పశ్చిమ, బద్వేలు (ఎస్సీ), జమ్మలమడుగు, ఆదోని, ధర్మవరం అసెంబ్లీ స్థానాల్లో కమలం పార్టీ బరిలోకి దిగుతోంది. అలాగే అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోంది. దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ సీట్లను సొంతం చేసుకోవడం ద్వారా తాము పెట్టుకున్న 370 టార్గెట్ రీచ్ అవుతామని బీజేపీ భావిస్తోంది. అందుకే ఏపీలో 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. అయితే ఏపీలో బీజేపీ ఓటింగ్ శాతం చాలా తక్కువ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 173 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 0.83శాతం మాత్రమే. లోక్ సభ స్థానాల్లోనూ అదే పరిస్థితి. 25 సీట్లలో పోటీ చేసిన కమలం పార్టీ 0.98శాతం ఓట్లు దక్కించుకుంది. అయితే ఈసారి మాత్రం కూటమిలో భాగంగా ఆ పార్టీ సీట్లు, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది.

గతంలో కూడా బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడే సీట్లు సాధించగలిగింది. ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. అయితే బీజేపీకి సత్తా లేకపోయినా టీడీపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీజేపీకి సరైన అభ్యర్థులు లేకపోయినా కొన్ని స్థానాల్లో బరిలోకి దిగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఎచ్చెర్ల, అనపర్తి, బద్వేలు, అరకు లాంటి చోట్ల బీజేపీకి గట్టి అభ్యర్థులు లేరు. అయినా ఆ పార్టీ సీట్లను తీసుకుంది. దీంతో కూటమి అభ్యర్థులు సహకరించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు సీట దక్కలేదని బీజేపీ సీనియర్లు కూడా గుర్రుగా ఉన్నారు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహా రావు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హైకమాండ్ తీరును నిరసిస్తున్నారు.  మరోవైపు నరసాపురం సీటు ఆశించి భంగడిన రఘురామ కృష్ణంరాజు కూడా బీజేపీ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు.

టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరిన తర్వాత అసంతృప్తి సెగలు మరింత ఎక్కువయ్యాయి. బీజేపీకి అభ్యర్థులు లేకపోయినా సీట్లు తీసుకుని అసలుకే మోసం తెస్తోందని టీడీపీ, జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. అనపర్తిలో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కాదని తమ అభ్యర్థి శివరామ కృష్ణం రాజుకు సీటు ఇచ్చింది బీజేపీ. అయితే శివరామకృష్ణంరాజు ఎవరికీ తెలీదు. నల్లమిల్లికి టికెట్ ఇచ్చింటే దాని ప్రభావం రాజమండ్రి పార్లమెంటుపైన కూడా ఉండేది. ఇప్పుడు శివరామకృష్ణం రాజుకు సీటు ఇవ్వడం వల్ల రాజమండ్రి పార్లమెంటు కూడా ఓడిపోతామేమో అనే భయం పట్టుకుంది. తిరుపతి సీటును వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ కు ఇచ్చింది బీజేపీ. వైసీపీ వద్దనుకున్న వరప్రసాద్ కు సీటు ఇవ్వడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. తమకు సరైన అభ్యర్థులు లేనప్పుడు ఆ సీట్లలో వేరే వాళ్లను తెచ్చి బలవంతంగా పోటీ చేయించడం ఎందుకు అనే భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఇష్యూస్ ను సెట్ రైట్ చేసుకోగలిగితే బీజేపీకి మేలు జరుగుతుంది. లేకుంటే కూటమి మొత్తానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ను షర్మిల కాపాడుతుందా..?

రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ లో కొంతమంది కీలక లీడర్లు ఉన్నా కేడర్ లేకుండా పోయింది. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించిన నేతలను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. అలాగే వైసీపీ, టీడీపీ, జనసేనలోని అసంతృప్తులను దారికి తెచ్చుకుని కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలీజా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇదే కోవలో మరికొందరు కీలక నేతలు పార్టీలోకి వస్తారనే నమ్మకంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతోంది. నోటిఫికేషన్ కు ఇంకా సమయం ఉండడంతో అభ్యర్థుల ప్రకటనకు తొందర్లేదనే ఆలోచనలో ఉన్నారు షర్మిల. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సీట్లు దక్కే పరిస్థితి లేకపోయినా ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది.

ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములు కావడంతో ఆ పార్టీలతో కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు షర్మిల వల్ల తమ ఓట్లు చీలుతాయేమోనని వైసీపీ ఆలోచిస్తోంది. అన్నిచోట్లా కాకపోయినా కడప జిల్లాలో షర్మిల ఎంపీగా బరిలోకి దిగితే దాని ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాస్తోకూస్తో కనిపిస్తుంది. కూటమికి మేలు చేసేందుకే షర్మిల ప్రయత్నిస్తోందని సాక్షాత్తూ సోదరుడు వైఎస్ జగన్ ఆరోపించడం విశేషం. అయితే షర్మిల చీల్చే ఓట్ల వల్ల తమకు ఎక్కడ ముప్పు ముంచుకొస్తుందోననే భయం కూటమి నేతలను కూడా వెంటాడుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జనం నాడిని పసిగట్టడం అంత సులభం కాదనిపిస్తోంది. ఏపీలో పరిస్థితిపై ఇప్పటికే పలు సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. అయితే అవన్నీ ఏ ఒక్క పార్టీకో పట్టం కట్టట్లేదు. కొన్ని సర్వేలు వైసీపీకి పూర్తి మెజారిటీ ఇస్తుంటే మరికొన్ని కూటమి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్నాయి. దీంతో ఏ సర్వేని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. సర్వేల విశ్వసనీయతపైనే అనుమానం కలుగుతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే జూన్ 4వరకూ వేచిచూడక తప్పదు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :